- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగు సినిమాలో గొప్ప స్త్రీ పాత్ర
తెలుగు సినిమాలో గత రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. సినిమా టేకింగ్‌లో కొత్తదనంతో పాటు పాత్రల చిత్రీకరణ విషయంలో ఎన్నో కొత్త కోణాలను దర్శకులు ఆవిష్కరించారు. అయితే ఆ మార్పు క్రమంగా అల్పా మేల్, మేల చావనిస్ట్, పర్వర్టెడ్ హీరోల వైపుకు దారి చేసింది. ఈ మార్పుకు కాస్త ముందు తెలుగు సినిమాకు ఓ టర్న్ తీసుకొచ్చిన దర్శకులు పూరి జగన్నాధ్. ఈయన సినిమాలన్నీ నాకు నచ్చవు. జనం మెచ్చిన సినిమాలు నాకు అసలు నచ్చలేదు. కానీ సినిమా క్రాప్ట్ పట్ల పూరి జగన్నాధ్ కున్న పట్టు చాలా తక్కువ మంది దర్శకులకు ఉంటుంది.
ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో లక్ష్మి పాత్ర తరువాత మళ్ళీ తెలుగులో ఇప్పటిదాకా సరయిన స్త్రీ పాత్ర నాకు కనిపించలేదు. బలమైన స్త్రీ పాత్ర అంటే స్త్రీ ముఖ్య పాత్రతో నడిచే కథ అనుకుంటారు చాలా మంది. కాని అది సరి కాదు. కొద్ది సేపు తెరపై కనిపించినా ఆ పాత్ర, ఆ వ్యక్తిత్వం సినిమా అంతా నిండి ఉండడం ఆ పాత్రను ప్రభావంతమైన పాత్రగా నిలుపుతుంది. ఈ సినిమాలో జయసుధ పాత్ర నిడివి ఇతర పాత్రలతో పోలిస్తే చాలా తక్కువ కాని నిస్సందేహంగా ఇప్పటివరకు తైరపై కనిపించిన స్త్రీ పాత్రల మధ్య అదో అద్భుతమైన పాత్ర. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న గొప్ప పాత్ర. ఆ పాత్రను సృష్టించినందుకు పూరి జగన్నాధ్‌ను చాలా సినిమాలోని స్త్రీ పాత్రల విషయాలలో క్షమించేయాలనిపిస్తుంది.
గౌరవం కలిగించే పాత్ర
భర్త నిరాదరణను ఎదుర్కున్న స్త్రీ పాత్రలు సినిమాలలో మనకు కొత్త కాదు. కళ్ళ నిండా నీటితో జాలి గొలిపే చూపులతో నిస్సహాయతతో కదిలే సింగెల్ విమెన్ పాత్రలతో మన సినీ ప్రపంచం నిండిపోయి ఉంది. కానీ ఈ సినిమాలో లక్ష్మి పాత్ర అద్భుతమైన జీవితేచ్చతో ముందుకు సాగుతుంది. ఆమెలోని ఆ శక్తే నిజమైన స్త్రీ శక్తి. ఏ కండిషనింగ్‌కి లొంగని ఓ అద్భుతమైన వ్యక్తిత్వం అది. తానో సింగిల్ విమెన్‌ని అని ఆమె ఎప్పుడూ ఎక్కడా కుచించుకుపోదు. తల ఎత్తుకుని జీవిస్తుంది. కొడుకుని అన్నీ తానై పెంచుతుంది. అతని జీవితాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ అతనికి ఇస్తుంది. తనకంటూ కుటుంబం లేకపోయినా కుటుంబ విలువలను కొడుకు అర్ధం చేసుకుని వాటిని గౌరవించేలా అతన్ని తీర్చిదిద్దుతుంది. ఒంటరి స్త్రీగా మిగిలిపోయినందుకు సెల్ప్ పిటీ తోటో లేదా కర్మ సిద్ధాంతం ఆధారంగానో ఆమె ఎక్కడా ఒదిగి జీవించదు. జీవితం పట్ల ఆమె ప్రదర్శించే ప్రాక్టికల్ అండ్ ఫిలసాఫికల్ అప్రోచ్ ప్రస్తుత ఆధునిక స్త్రీ అందిపుచ్చుకోవలసిన అత్యవసర మార్గాలు. ఒక సింగిల్ మదర్ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రెండు విషయాలనూ స్పష్టంగా చెప్పడానికి ఈ లక్ష్మి పాత్రకన్నా మించినది మరొకటి తెలుగు సినిమాలో లేదు.
కుటుంబ బాధ్యత తీసుకోలేను నాకీ కుటుంబం వద్దు, కొద్ది కాలం దూరం అవుదాం అన్న భర్త నిర్ణయం విన్నప్పుడు లక్ష్మి భర్తతో ‘కొన్ని రోజులు విడిపోయాక ఇక కలవడం జరగదు’ అని స్పష్టంగా చెబుతుంది. తమను కాదని వృత్తిని ఎంచుకుని కెరియర్ కోసం వెళ్ళిపోయిన భర్తను ఆమె క్షమించగలదేమో కాని అతని నిష్క్రమణ రేపిన గాయాన్ని ఆమె అభిమానం మర్చిపోనివ్వదు. అందుకే మళ్ళీ అదే ఆప్యాయత, ప్రేమ తమ మధ్య ఉండవని ఆమె స్పష్టంగా అర్ధం చేసుకుంటుంది. భర్తతో విడిపోతుంది. విడిపోతూ మీకూ ఓ లక్ష్యం ఉన్నట్లే నాకూ ఓ లక్ష్యం ఉంది. నా బిడ్డను ప్రయోజకుడిని చేయాలి అని చెప్తూ బిడ్డలను పెంచడం కొందరి తల్లులకు కేవలం కర్తవ్యం మాత్రమే కాకపోవచ్చు అది వారి జీవిత లక్ష్యంగానూ మారవచ్చు అని స్పష్టపరుస్తుంది. ఆ చాయిస్ వెనుక స్త్రీ అసహాయత కన్నా ఆత్మస్థైర్యం పనిచేస్తూ ఉండటం చూసినప్పుడు ఆ తల్లిపై అపారమైన గౌరవం కలుగుతుంది ప్రేక్షకులకు. ఒంటరి స్త్రీని జాలితో కాక గౌరవంతో, అబ్బురంతోనూ తెలుగు ప్రేక్షకులు చూసేలా చేసినందుకు పూరి జగన్నాధ్‌కు హట్సాఫ్. ఆ పాత్రను అంతే గొప్పగా పోషించిన సహజనటి జయసుధ లక్ష్మిగా ఎందరో స్త్రీల మనసుల్లో నిలిచిపోయారు.
నిండైన స్త్రీని తెరపై చూపిస్తూ..
భర్తతో విడిపోయాక లక్ష్మి స్వయంగా ఎదిగి లెక్చరర్ స్థాయికి వెళుతుంది. కొడుకు జీవితానికి కావలసినవన్నీ అమరుస్తుంది. తండ్రిని కొడుకు ద్వేషించడం ఆమె సహించదు. ద్వేషం మనిషిని లోలోన తినేస్తుందని ఆమెకు తెలుసు. ఆ కొడుకు సాంగత్యంలోనే నిజమైన పార్టనర్‌ని ఆమె వెతుక్కుంటుంది. కొడుకునే ఓ మిత్రునిగా చేసుకుంటుంది. ఈ తల్లీ కొడుకుల అనుబంధం ఎంత మెచ్యూర్డ్‌గా దర్శకులు చిత్రీకరించారంటే ఎక్కడా అనవసర సోది కనిపించదు. భర్త ఇవ్వలేని స్నేహ హస్తాన్ని, ప్రేమని కొడుకు ద్వారా పొందగలిగే స్థాయికి ఆ తల్లి ఎదగడం ఆమె జీవితంలో సాధించిన గొప్ప విజయం. కొడుకుని బాస్టర్డ్ అన్న తోటి శిష్యులతో ‘యెస్ బాస్టర్డ్స్ ఆర్ బార్న్ ఔట్ ఆఫ్ లవ్. నువ్వు నీ తల్లి తండ్రులు సంసారం అనే డ్యూటీ చేస్తే పుట్టినోడివి. నా బిడ్డ నాకు నా భర్త ద్వారా అందిన ప్రేమ ఫలం' అని ఆమె గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు ఇన్నాళ్ళు ఇలాంటి స్త్రీలను స్క్రీన్‌పై ఎందుకు చూడలేకపోయాం అన్న బాధతో పాటు చివరకు ఓ నిండైన స్త్రీని తెరపై చూసిన గొప్ప తృప్తి కలుగుతుంది ప్రేక్షకులకు.
సింగిల్ విమెన్ అంటే మెషిన్ కుట్టుకుంటూ ఏ సరదాలూ, సంతోషాలూ లేకుండా అసలు అలాంటి వాటి ప్రసక్తే రాకుండా తలుపు చాటున ఉంటూ కొడుకుని పెద్దవాడిని చేయడమే తన జీవిత ధ్యేయం అని వందల సార్లు చెప్పుకుంటూ నలిగిన చీరలతో కళ్ళు తుడుచుకుంటూ జీవించే స్త్రీలనే స్క్రీన్‌పై చూశాం. కాని లక్ష్మీ దీనికి పూర్తిగా భిన్నం. తన చుట్టూ ఉన్న వారిని ఉత్సాహపరుస్తూ, చేతనయిన సహాయం చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కొడుకుతో పార్కులకు పబ్బులకు కూడా వెళ్లడానికి ఉత్సాహం చూపుతుంది. కొడుకు చేత దోసెలు వేయించుకుని తినడం దగ్గర నుంచి కొడుకు మ్యాచ్‌కి వెళ్ళి ఈల వేసి ఎంజాయ్ చేసే దాకా ఆమెలో అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. గడిచిపోయిన గతాన్ని తలచుకుని ఏడుస్తూ కూర్చునే స్త్రీలకు విరుద్ధంగా లేనిదాన్ని మరచి ఉన్నదానితో ఆనందించమనే సూక్తితో లక్ష్మి ముందుకు సాగిపోవడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఈ పాత్రలు ఎందరికో దారిచూపుతాయి..
తనకు గుండే జబ్బు ఉందని ఎన్నో రోజులు బతకనని ఆమెకు తెలుసు. అందుకే కొడుకుని భర్త దగ్గరకు చేర్చాలని ప్రయత్నిస్తుంది. మొండి పట్టుదలతో, కోపంతో కొడుకు భవిష్యత్తుని ఒంటరి చేసే ఉద్దేశం ఆమెకు ఉండదు. అందుకే చనిపోయే ముందు కొడుకు నుండి మాట తీసుకుని అతన్ని తండ్రి దగ్గరకు చేరుస్తుంది. ఏ తండ్రి అయితే కుటుంబం కన్నా కెరియర్ ప్రధానం అనుకున్నాడో అతని జీవితానికి, వృద్ధాప్యానికి ఈ కొడుకునే అండగా మిగిల్చి నైతికంగా భర్తపై విజయం సాధిస్తుంది. చనిపోయిన లక్ష్మిని గుర్తుకు తెచ్చుకుని ఆమె భర్త ఆమెకు సెల్యూట్ చేసే స్థాయిలో జీవితాన్ని గడిపిన ధీర లక్ష్మి.
కొన్ని సార్లు రక్తం ద్వారా కొన్ని లక్షణాలు మరో తరానికి సంక్రమిస్తాయి. అలా తండ్రి లాగే కొడుకూ కిక్ బాక్సింగ్ కెరీర్‌గా ఎంచుకుంటాడు. కాని కుటుంబం కెరీర్ కన్నా ఎప్పుడూ ఎక్కువే అన్న సిద్దాంతమే అతన్ని ఓ మంచి కొడుకుగా నిలబెడుతుంది. ఆ విలువలే అతనికి జీవితంలో ఓ బాలెన్స్ రావడానికి సహాయపడతాయి. తండ్రితో ఆ కొడుకు గడిపిన సమయమంతా అతనికి తన తల్లి గొప్పతనాన్ని తన ప్రవర్తన ద్వారా తెలియచెబుతాడు. తండ్రి దగ్గరకు లక్ష్మి కొడుకుగానే చేరి అలాగే ఉండి అలాగే ఆ తండ్రికి కుటుంబ విలువలు నేర్పిస్తాడు ఆ కొడుకు. మరణించిన లక్ష్మి కొడుకు రూపంలో ఉంటూ తన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటూ తన వ్యక్తిత్వపు గుబాళింపులతో ఆ భర్తపై సాధించే అద్భుత విజయమే సినిమా రెండవ భాగం అంతా.
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా సగంలో మాయమయ్యే లక్ష్మి పాత్ర ఒక్కటే చివరి దాకా అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. తాను ఆడే మేచ్‌లో తల్లి స్మృతిలో ఓ ఖాళీ కుర్చీ స్టేడియంలో ఉంచేలా చూస్తాడు కొడుకు. దర్శకుడు కూడా సినిమా సగంలో చనిపోయిన ఆ తల్లికి కనపడని ఓ ఖాళీ కుర్చీ సినిమా ప్రతి ప్రేం లో ఉంచి సినిమాను నడిపించిన తీరు అద్భుతం. అదీ దర్శకత్వ ప్రతిభ. ఇంతటి ప్రతిభావంతుడు ఇలాంటి గొప్ప పాత్రలవైపు కాక, మాస్ మసాలా హీరోల వైపు దృష్టి సారించి ఏం సాధించాడొ తెలియదు కాని మా లాంటి సినిమా ప్రేమికులకు మాత్రం పూరి జగన్నాధ్ లక్ష్మీ పాత్ర సృష్టికర్తగా మాత్రమే గుర్తుండిపోతాడు.
సినిమా ప్రారంభంలో ఇది తనకు పరిచయమయిన వ్యక్తుల కథ అని ఆ వ్యక్తులకిచ్చిన మాటకు కట్టుబడి వారెవరో చెప్పలేనని దర్శకుడు ప్రకటించుకోవడం నాకు నచ్చింది. జీవితంలోంచి వచ్చిన సినిమాలో ‘పోకిరి’తనాన్ని దాటి వచ్చిన ‘అమ్మ’ తనం ఉంటుంది. పోకిరిల, ఇడియట్‌ల, రోమియోల, చిరుతల, బుజ్జిగాళ్ల ఉనికి కొన్ని రోజులే కాని లక్ష్మి లాంటి అమ్మలు ఎందరికో దారి చూపే స్వయంసిద్దలు. ఇది అర్ధం అయితే అయినా ఇలాంటి పాత్రలు ఇంకొన్ని తెలుగు తెరపై కనిపిస్తాయేమో మరి. ఏమైనా తెలుగు సినిమా స్త్రీ పాత్రలలో మరో అద్భుతం ఈ సినిమాలో కనిపించే లక్ష్మి. అందుకే ఎన్నో గొప్ప భారతీయ సినీ స్త్రీ పాత్రలను ఏర్చి కూర్చుతున్న సందర్భంలో లక్ష్మీ పాత్రను కూడా ఈ వరసలో చేర్చడం అవసరం అనిపించింది.
- పి. జ్యోతి
98853 84740