కులగణనపై జేపీ వాదన అసంబద్ధం!

by Ravi |   ( Updated:2025-02-28 01:15:26.0  )
కులగణనపై జేపీ వాదన అసంబద్ధం!
X

'కులగణనపై బహిరంగ సవాల్' పేరుతో ప్రసారమైన ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్, ప్రైవేటీకరణ ప్రవక్త జయప్రకాశ్ నారాయణ.. కులగణన వలన దేశానికి ఒరిగే మేలు ఏ మాత్రం లేదంటూ కొత్త భాష్యం పలికారు. దాని వల్ల ప్రజలకూ ఒరిగేది ఏం లేదని ఘంటాపథంగా తేల్చేసారు.

నేను నిశ్చయంగా చెబుతున్నాను, సవాల్ చేస్తున్నా ను.. అంటూ ఈ అంశంపై ఆయన కరాఖండిగా చెప్పేసారు. అయితే ఆయన తెలిసీ దాటవేస్తున్నారు కానీ.. గణాంకాల సేకరణ ఆధునిక ప్రభుత్వాలు చేపట్టాల్సిన ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.. దేశంలో నెలకొన్న పరిస్థితిని గణాం కాలు తేల్చిచెబుతాయి.

మేధావి ట్యాగ్‌లైన్ అతికించుకుని..

పదేళ్లకోసారి సాగే జనాభా లెక్కల్లో.. మతాల వారీ లెక్కలను, వివిధ భాషలను మాట్లాడేవారి జనాభా ఎంతో సైతం తేలుస్తున్నారు. జనాభా లెక్కల్లో మతాల లెక్కలు, భాషా సమూహాల లెక్కలతో ఎలాంటి ఫాయిదా ఒరగదంటూ గతంలో జేపీ ఎక్కడా వాదించిన దాఖలాలు లేవు. కానీ నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కులగణనపై.. పాలకవర్గాలకు ఉపకరించే 'సమ్మతి తయారీ' పనిలో ఆయన నిమగ్నమైనట్టున్నాడు. నేడు మనం సత్యానంతర (post truth) యుగంలో జీవిస్తున్నాం. కనబడినది కనబడదని వినబడినది వినబడదని.. అంతా మిథ్య అనే దబాయింపు నేడిక్కడ రివాజుగా మారింది. మేధావులు అనే ట్యాగ్‌లైన్లు అతికించుకున్నవారు.. పాలకవర్గాల దుర్నీతులకు వంత పాడే నేరేటివ్స్‌ని ప్రచారంలో పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. రిటైర్డు ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ ప్రజల గోసలు పట్టించుకోని మేధావిగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు గాంచారు. తాజాగా.. నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కులగణనపై.. పాలకవర్గాలకు ఉపకరించే 'సమ్మతి తయారీ' పనిలో ఆయన నిమగ్నమైనట్టున్నాడు.

సమతా స్ఫూర్తి వ్యతిరేక ప్రవక్తలు..

1931 వరకు మన దేశంలో కుల గణన జరిగేది. నేటికి సైతం జనాభా లెక్కల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల కులగణన సాగుతున్నది. కొత్తగా తీసేవి.. బీసీ, ఇతర వర్గాల లెక్కలు మాత్రమే. ప్రజలలోని ఆయా వర్గాల జనాభా లెక్కలు, సామాజిక ఆర్థిక స్థితిగతులు సేకరిస్తేనే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ చర్యలకి దిశా నిర్దేశం ఒనగూరుతుందన్న ప్రాథమిక విషయం ఐఏఎస్‌గా వ్యవహరించిన జేపీ సాబ్‌కు తెలియదా? రిజర్వేషన్లను 'రాయితీలు' అంటున్నారాయన. రాయితీ అనే మాటను సామాజిక న్యాయవాదులు సైతం ఒప్పుకుంటారు. అయితే ఆ రాయితీ ఏదో దయతోనో, బిక్షగానో ఇచ్చేది కానే కాదు. జేపీ ఆరోపించినట్లుగా రాజకీయ సమీకరణల కోసం కూడా ఇచ్చేది కాదు. రాజ్యాంగ నిర్మాతలను రాజకీయ ప్రలోభాలు ఆవహించలేదన్న విషయాన్ని జేపీ గుర్తెరగాలి. గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సవరిస్తేనే నేటి కాలంలో సమానత్వం వర్ధిల్లుతుంది, సమాజం ఐక్యతతో ముందుకు పోతుందని గుర్తించిన రాజ్యాంగ నిర్మాతలు.. రిజర్వేషన్ల వ్యవస్థకు రాజ్యాంగంలో చోటు కల్పించారు. ఆ సమతా స్ఫూర్తి నేటి ప్రైవేటీకరణ ప్రవక్తలకు అర్థం కాదు లెండి!

సుప్రీంకోర్టు తీర్పునూ గుర్తించరా?

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టే తెలంగాణలో కులగణన జరిగిందంటూ జేపీ చేస్తున్న ప్రచారం.. ఆ డిమాండ్‌పై గత 15 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్న బడుగు వర్గాలను అవమానించడమే అవుతుంది. ప్రజల నుండి వచ్చిన డిమాండ్ మేరకు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారనేది సత్యం. ఆ డిమాండ్ ప్రజలది, రాజకీయ నాయకులది కాదు. రిజర్వేషన్లకు కులగణనకు సంబంధం లేదనే జేపీ గారి వాదన సైతం అసంబద్ధమే. ఈరోజు జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసి.. ఆ గణాంకాల వెలుగులోనే.. వారి రిజర్వేషన్ల కొనసాగింపు ఆమోదింపబడుతున్నది. అలాగే మండల్ కమిషన్ మొదటిసారిగా బీసీల రిజర్వేషన్ల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు బీసీ వర్గాల లెక్కలను కూడా శాస్త్రీయంగా ప్రభుత్వాలు తేల్చాలంటూ ఆదేశించింది. అందుకనే 1990 నుండి బీసీల కుల గణన డిమాండ్ ప్రజల్లో ప్రచారంలోకి వచ్చింది. లెక్కలు లేకుండా రిజర్వేషన్ల కొనసాగింపు సమ్మతం కాదని సుప్రీంకోర్టు తేల్చిన విషయం జేపీ దృష్టికి రాలేదా ఏమిటి?

బీజేపీపై వల్లమాలిన ప్రేమ ఎందుకు?

నిత్యం అభివృద్ధి మంత్రం జపించే జేపీ.. అభివృద్ధికి వ్యతిరేకమంటూ మత రాజకీయాలను విమర్శించిన దాఖలాలు ఎక్కడా కనబడవు. గుళ్ల చుట్టూ దేవుళ్ళ చుట్టూ రాజకీయాలు నడుపుతున్న బీజేపీని.. "ప్రజలెవరూ అడగనప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు?" అంటూ జేపీ ప్రశ్నించిన దృష్టాంతం ఒక్కటైనా ఉన్నదా? బీజేపీ పార్టీ నడుపుతున్న మత రాజకీయాలు మాత్రం దేశ ప్రజలకు మేలు చెయగలవని జేపీ చెప్పదలుచుకున్నారా? బీజేపీకి, ఎన్డీఏ కూటమికి ఎన్నో మార్లు బహిరంగంగా మద్దతు ప్రకటించారు జయ ప్రకాష్. పోయిన ఏడాది ఏపీ ఎన్నికల్లో సైతం ఆయన ఎన్డీఏకు మద్దతుగా ప్రచారం చేశారు. దేశ ఐక్యతకు విఘాతం కలిగించే రాజకీయాలని ప్రశ్నించడానికి ముందుకు రాని జేపీ, బడుగు వర్గాలకు మేలు జరిగే చర్యలను మాత్రం అభివృద్ధి నిరోధకమంటూ వాటిపై నింద వేయడానికి ముందుకొస్తారు. ఆధిపత్య వర్గాల పెత్తందారీతనం సాఫీగా కొనసాగడంలో ఎలాంటి ఇబ్బంది లేని జేపీ.. బడుగులకు కాస్త మేలు జరిగితే తెగ ఇబ్బంది పడుతున్నారు.

ఈ ఏడుపు ఇప్పుడు దేనికి?

భారత సమాజంలో కొందరు స్వార్థపర శక్తులు మెజార్టీ వర్గాలను వేల సంవత్సరాలుగా కులం పేరుతో సామాజిక వివక్షకు గురి చేసిన కారణంగానే రిజర్వేషన్ల వ్యవస్థకు రాజ్యాంగంలో అంకురార్పణ జరిగిందని సామాజికవేత్తలందరూ అంగీకరిస్తారు. అయితే.. ఆ అంశంపై జేపీ తలతిక్క వాదనలను ప్రతిపాదిస్తున్నారు. "వెనుకబడిన వర్గాల వారు నిత్యం తమ కులాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు.. తమ ప్రతిభ వలన తమకు గుర్తింపు రావాలని ఆశించకుండా, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే రిజర్వేషన్లకు కారణమవుతున్నది" అంటారు జేపీ ఈ టీవీ చర్చలో.. బాధితులనే నిందితులను చేస్తూ, ఉల్టా దబాయించడం ఆయనకే చెల్లింది. దురదృష్టవశాత్తు ఈ వాదన కొత్తదేమీ కాదు. రాజ్యాంగపు సమతా స్ఫూర్తిని వ్యతిరేకించేవారు రిజర్వేషన్లపై ఎప్పుడూ వెలిగక్కే ఏడుపే ఇది! గెట్ వెల్ సూన్ జేపీ గారు!!

ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక

94404 43183


👉 Read Disha Special stories


Next Story

Most Viewed