- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లౌకికత్వం అర్థం ఇదేనా?
హిందువుల పండుగలను ఒకలాగా, ఇతర మతాల పర్వదినాలను ఒకలాగా ట్రీట్ చేస్తున్న ప్రతిపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాల చర్యలు లౌకికవాదంలో భాగమేనా? లౌకికవాదం అంటే మైనార్టీల పేరుతో ముస్లింలను సంతృప్తిపర్చడం, హిందువులను నిర్లక్ష్య ధోరణితో అవమానపరచడం లాగా మారిందన్న ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ మాటలు నిజం చేసేలా ఉన్నాయి పలు రాజకీయ పార్టీల చేష్టలు..
సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేని విధానమని విశాలార్థంలో చెబుతుంటారు. అలాగే, మతపరమైన చట్టాలు, మత ప్రబోధనల నుండి రాజ్యాలు స్వేచ్ఛ పొందడమంటే, ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన విషయాలు పాటించినా, ప్రభుత్వం మతపరమైన విషయాల నుండి దూరంగా ఉండాలి. ఎలాంటి మత ప్రమేయం లేకుండా ప్రజలందరిని సమాన దృష్టితో చూడాలి. అయితే భారతదేశంలో సెక్యులరిజం (లౌకికవాదం) అంటే మైనార్టీల పేరుతో ముస్లింలను సంతృప్తి పరచడం, హిందువులను నిర్లక్ష్య ధోరణితో అవమానపరచడం అన్నట్టు ఉన్నాయి రాజకీయ పార్టీల చేష్టలు.
వివక్ష ఎందుకు?
హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామునికి అయోధ్యలో భవ్యమైన ఆలయాన్ని నిర్మించే విషయంలో వీహెచ్‌పీ తదితర హిందూ సంస్థలకు మద్దతుగా బీజేపీ నిలిచి దశాబ్దాలపాటూ పోరాటం చేస్తే కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీఆర్ఎస్ తదితర పార్టీలు మతతత్వం అంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ అవే పార్టీలు రంజాన్ సందర్భంగా తమ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులను, క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడాన్ని మాత్రం సెక్యులరిజం అంటాయి. ఇది ఎంతవరకు సమంజసం? అంతేకాక హిందూ దేవాలయాలను, దేవాలయాల భూములను, నిధులను యథేచ్ఛగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తూ.. మసీద్, చర్చీల జోలికి వెళ్లకపోవడం, ముస్లిం, క్రిస్టియన్ మతబోధకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా జీతాలు ఇవ్వడం ఎలా సెక్యులరిజం అవుతుంది?
మక్కా, హజ్ యాత్రకు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తున్న ఈ పార్టీల ప్రభుత్వాలు హిందువుల పండుగలు, పుష్కరాలు లాంటి విశేష సందర్భాల్లో మాత్రం బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచుతారు.. పైగా దేవాలయాలలో అడుగడుగునా దర్శనాలు, పూజలు, పార్కింగ్ ఫీజు అంటూ భక్తులతో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేస్తారు.. ఇది ఏ రకంగా లౌకికత్వం అవుతుంది?
మతం వ్యక్తిగతమైతే..
అయోధ్యలో రామాలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి రమ్మని గౌరవపూర్వకంగా ఆహ్వానాన్ని పంపిస్తే మతం వ్యక్తిగతం కాబట్టి తాము హాజరు కాలేమని నీతులు చెప్పిన సీతారాం ఏచూరి లాంటి కమ్యూనిస్టు నాయకులు ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నప్పుడు, క్రిస్మస్ వేడుకలకు హాజరవుతున్నప్పుడు మతం వ్యక్తిగతం అనే విషయం గుర్తుకు రాలేదా? ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా గ్రహిస్తున్నారు కాబట్టే కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీఆర్ఎస్ తదితర పార్టీలను ఓడించడం మొదలు పెట్టారు. బీజేపీ ఇందుకు విరుద్ధం కాబట్టే గెలిపిస్తున్నారు.
వాస్తవాలను గ్రహించండి..
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారు. ఇదంతా కేవలం రామాలయం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు మాత్రమే కారణం కాదు.. దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలు, కుటుంబ పాలన, అరాచకాలు ప్రజలకు అర్థమయి, పైగా 2014 తర్వాత మోడీ ప్రభుత్వ హయాంలోనూ, అంతకు ముందు వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ జరిగిన అభివృద్ధి, అవినీతి రహితపాలన, ప్రపంచంలో మన దేశ కీర్తి ప్రతిష్టలు పెరగడం కూడా కారణమే! అభివృద్ధి చెందిన దేశాలెన్నో ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుండగా మన దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రపంచంలో ఐదో స్థానానికి ఎగబాకడం, అతి త్వరలోనే ప్రపంచంలో తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతామని మోదీ గ్యారెంటీ ఇవ్వడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ పేరుతో కుల, మత, వర్గ విభేదాలు లేకుండా నిరుపేదలందరికీ మోడీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు మెజారిటీగా ఉన్న స్థానాల్లో సైతం ప్రజలందరు బీజేపీ అభ్యర్టులను గెలిపిస్తున్నారు.. ఇదే కొనసాగిస్తూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి మళ్ళీ మోడీ ప్రభుత్వాన్నే గద్దెనెక్కించాలని, తద్వారా మన దేశ అభివృద్ధి మరింత ముందుకు సాగాలనే కాంక్షతో దేశ ప్రజలున్నట్లు దేశ, విదేశీ సంస్థలెన్నో తమ సర్వేలతో బయటపెట్టాయి. అందుకే రాజకీయ పార్టీలు లౌకికత్వం అంటూ బూటకపు సెక్యులరిజాన్ని పక్కన పెట్టి వాస్తవాల్ని గ్రహించి, అనవసరంగా బీజేపీపై బురద జల్లడం మానుకోవాలి. లేకపోతే మీ పార్టీలు రాజకీయ క్షేత్రంలో కనుమరుగు కావడం మాత్రం ఖాయం!
- శ్యామ్ సుందర్ వరయోగి,
సీనియర్ జర్నలిస్ట్
98669 66904