- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కారు బడుల ఘనత ఇదేనా!?
తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఉంటుందని ఉద్యమ కాలంలో కేసీఆర్ పదేపదే చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలవుతున్నా ప్రభుత్వ విద్య ఇప్పటికీ మారలేదు. దేశ వార్షిక బడ్జెట్‌లో 10 శాతం, రాష్ట్రాల బడ్జెట్‌లో 30 శాతం నిధులను విద్యకు కేటాయించాలని 1964లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కొఠారీ కమిషన్ సూచించింది. కొఠారీ కమిషన్ సూచనలు ఇప్పటికీ అమలు కావడం లేదు. 2014 నుండి 2022 బడ్జెట్ వరకు విద్యకు కనీసం 15 శాతం మించి నిధులు కేటాయించలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతోంది. కేంద్రం రేషనలైజేషన్ పేరుతో విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేస్తే కనీసం అడ్డు చెప్పకపోగా వారికి వత్తాసు పలికి తెలంగాణలో కూడా ప్రభుత్వ బడులను మూసివేయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
హామీలకే పరిమితమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'నాడు-నేడు' పేరుతో బడులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నది. మౌలిక వసతులు కల్పించి డిజీ స్కూల్స్‌గా మారుస్తున్నది. తెలంగాణ మాత్రం ఇంకా హామీలకే పరిమితమైంది. యేటా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్న హామీ ఇప్పటికి నేరవేరలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి సంకోచిస్తున్నారు. మారుమూల ప్రాంతాల పాఠశాలలు సబ్జెక్టు టీచర్లు, సరైన గదులు, మంచినీటి సౌకర్యం, కనీసం మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. రాష్ట్రంలో దాదాపు 29,275 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ పాఠశాలలో సుమారు 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది. కేజీ టు పీజీ హామీని మరచి కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నది. అవి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా పట్టించుకోకపోవడం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
'కొఠారీ' మాటలకు తూట్లు
'భారీగా గురుకులాలు ఏర్పాటు చేసి, ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నాం' అని ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయనే నిజాన్ని గ్రహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం వర్సిటీ విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీలను పట్టించుకోకుండా, వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా 2018-19లో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చిన దుర్మార్గపు విధానాలు టీఆర్ఎస్ ప్రభుత్వానివి.
'దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే నిర్మాణం అవుతుంది' అన్న కొఠారీ కమిషన్ మాటలకు తూట్లు పొడుస్తున్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలన్న రాజ్యాంగ హక్కులను హరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబిస్తోంది. పేద మధ్యతరగతివారికి వారి జీవన విధానం మెరుగుపరచుకోవడానికి కావాల్సిన ఆయుధం విద్య కాబట్టి కార్పొరేట్‌కి దీటుగా పాఠశాలను తీర్చిదిద్దాలి. కార్పొరేట్ పాఠశాలలను జాతీయం చేయాలి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకు వచ్చిన విద్యా విప్లవం, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆధునికీకరణను స్ఫూర్తిగా తీసుకోవాలి. విద్య ఒక హక్కుగా అందరికీ అందాలన్న కేరళ ప్రభుత్వం లాంటి విధానాలను, కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి.
బాలసాని లెనిన్
AISF స్టేట్ ఈసీ మెంబర్, పెద్దపల్లి
95027 26430