అన్నం పెట్టే రైతులపై కాల్పులా?

by Ravi |   ( Updated:2024-03-02 00:45:55.0  )
అన్నం పెట్టే రైతులపై కాల్పులా?
X

దేశానికి అన్నం పెడుతున్న రైతుల పట్ల పాలక పక్షాల చర్యలను దేశమంతా నేడు నిరసిస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన ధర్నా చేస్తున్న రైతుల ప్రధాన డిమాండ్ 'కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి' అని. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోవడం వల్ల పంట ఉత్పత్తి కాలంలో అస్థిర మార్కెట్ ధరల కారణంగా తాము పలు విధాల నష్టపోతున్నామని వారి అభిప్రాయం. అలా కాకుండా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తే అన్ని పంటలకు సరియైన ధరలు మార్కెట్లలో లభించడం వల్ల తాము కొంతవరకు లాభపడతామని వీరి ఆశా భావం.

భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. నేటికి సుమారు 53% శ్రామిక జనాభా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నది. గ్రామీణ భారతావనికి వ్యవసాయమే నేటికి ప్రధాన జీవనాధారం. భారతదేశం పారిశ్రామిక, సేవ రంగాల్లో ఎనలేని పురోగతి సాధించినప్పటికీ నేటికీ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 17.4 శాతంగా ఉండి దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రత్యక్షంగాను, పారిశ్రామిక, సేవ రంగాల అభివృద్ధికి పరోక్షంగా ఎనలేని తోడ్పాటు నందిస్తుంది.

దిగొచ్చిన కేంద్రం

వ్యవసాయ దారుల స్థితిని మార్చడానికి ప్రభుత్వాలు అనేక కమిషన్లు నియమిస్తున్నప్పటికీ అవి సూచించిన సిఫార్సులను ప్రభుత్వాలు చిత్త శుద్ధిగా అమలు చేయక పోవడం వలన రైతుల జీవితాల్లో మార్పు అసాధ్యమైంది. తమ సమస్యల సాధన కోసం వివిధ రైతు సంఘాల నాయకత్వంలో అనేక సంవత్సరాల నుండి రైతాంగం ఉద్యమిస్తుంది. ధర్నాలు, నిరసనలతో రైతులు తమ అసంతృప్తిని ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాయి. ఈ ఉద్యమాలలో అతి పెద్దది... 2020 సెప్టెంబర్‌లో భారత పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఉద్యమం. ఈ రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో వేల సంఖ్యలో రైతులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని కొన్ని నెలల పాటు తమ అక్కడే ఉండి తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. రైతుల పరిస్థితులను గమనించిన దేశ అత్యున్నత న్యాయస్థానం 2021లో ఈ చట్టాలపై స్టే విధించింది. ఆ తర్వాత కొంత కాలానికి హిమాచల్‌ప్రదేశ్ మొదలుకొని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో రైతు అగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వం తాము రూపొందించిన మూడు రైతు చట్టాలను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు 2021 నవంబర్ 19న ప్రకటించింది. ఈ సందర్భాన రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రభుత్వం రైతుల అనేక డిమాండ్లను పరిశీలించి వాటికి కార్యరూపంలో పెడతామని రైతులకు హామీ నిచ్చింది.

హామీలపై ఆశలు భగ్నం

ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చకపోవడంతో 2024 ఫిబ్రవరి 12 నుండి తిరిగి తమ డిమాండ్ల సాధన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు తిరిగి రాజధాని బాట పట్టాయి. వ్యవసాయమే ప్రధాన జీవన ఆధారంగా ఈ దేశ ప్రజలకు నోటికి ముద్ద అందిస్తున్న రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ బాట పడితే వీరి సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించకపోగా శత్రు దేశ సైన్యాలను ఎదుర్కొన్నట్లు రైతులను రోడ్లపై కాంక్రీట్ నిర్మాణాలు, ముళ్లకంచెలు, కంటైనర్ల మోహరింపు, రోడ్లపై మేకులు తదితరాలు వినియోగిస్తూ, భాష్ప వాయుగోళాల ప్రయోగాలు చేస్తూ, రబ్బరు బుల్లెట్లను, పొగ బాంబులను వినియోగిస్తూ, దీర్ఘ శ్రేణి ధ్వని ఆయుధాలను ఉపయోగిస్తూ రైతుల నిరసనను బలప్రయోగంతో అణిచివేస్తున్నది.

కేసుల మాఫీ.. విద్యుత్ చట్టం రద్దు

వారి రెండవ డిమాండ్. రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో తమపై నమోదైన కేసులు మాఫీ చేయమని. రైతు చట్టాల ఉపసంహరణ చేసిన సమయంలోనే ప్రధాని, రైతులపై నమోదు చేసిన కేసులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు కేసులను మాఫీ చేయడం పాలక పక్షాలకు పెద్ద పనేం కాదు. అలాగే 2022 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయమని వారు కోరుతున్నారు. ఈ చట్టం వలన రానున్న కాలంలో ప్రభుత్వాలు తమకు కల్పిస్తున్న విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయని వారి భావన. రైతులకు నష్టాన్ని, ప్రైవేటు కంపెనీలకు లాభాన్ని కలిగించేవిగా ఉంటే ప్రభుత్వాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలి. రైతులది కేవలం అపోహ అయితే రైతు సంఘాలతో చర్చించి వారి అపోహ తొలగించాలి. ఇది ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.

రైతులు సమాజ శత్రువులా?

రైతు సంఘాల ఇంకొక డిమాండ్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయమని. స్వామినాథన్ నాయకత్వంలోని వ్యవసాయ కమిషన్ కనీస మద్దతు ధరను వ్యవసాయ ఖర్చులపై 50 శాతం అధికంగా చేసి మద్దతు ధరలను ప్రకటించాలి అని చెప్పింది. ఇక రైతుల రుణమాఫీ డిమాండ్‌ను కూడా ప్రభుత్వాలు పరిశీలించాలి. కార్పొరేట్ రుణాలను నిరర్థక ఆస్తుల కింద మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు రైతు రుణమాఫీ సాధ్యసాధ్యాలను కూడా పరిశీలించాలి. రైతులను శత్రువులుగా భావించకుండా సహృదయ భావంతో చర్చలు జరపాలి. సాధ్యమైన రైతు డిమాండ్లను ప్రభుత్వాలు నెరవేర్చాలి. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి తగు పరిష్కారం చూయించి ఉద్యమానికి ముగింపు పలికేలా ప్రభుత్వం అడుగులు వేయాలి.

మధుకర్ మునేశ్వర్

99630 43490

Advertisement

Next Story