- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సృజనతోనే చదువులకు వెలుగు
ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైన ఆయుధమే విద్య అని నెల్సన్ మండేలా పేర్కొన్నారు. ఈ విద్య ప్రాధాన్యతను వివరించడానికి యునెస్కో నిర్దేశించినదే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. భారతదేశం సామాజిక, ఆర్థిక పురోగతికి అక్షరాస్యత కీలకంగా మారింది. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే 80% అక్షరాస్యత ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు రాబట్టాలి. నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. అందరికీ విద్య చేరువ కావాలంటే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలి. బాలికా విద్యను ప్రోత్సహించాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సృజన శక్తికి పెద్దపీట వేయాలి. సాంకేతికత అందిపుచ్చుకుని ఉపాధ్యాయులకు శిక్షణ అందించాలి. ఉపాధి ఆధారిత ఉన్నత విద్యా కోర్సులను తీసుకురావాలి. అప్పుడే దేశం విజ్ఞాన భాండాగారంగా వెలుగొందే అవకాశం ఉంటుంది.
బడ్జెట్‌లో విద్యా కేటాయింపులు..
2024-25 రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో విద్యకు కేటాయింపులు చాలా తక్కువనే చెప్పవచ్చు. అక్షరాస్యత పెంపు మందగమనంలో కొనసాగడానికి నిధుల కొరత కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బడ్జెట్ మొత్తం రూ. 2.91 లక్షల కోట్లు కాగా దీనిలో విద్యకు రూ. 21,292 కోట్లు మాత్రమే కేటాయించారు. మహారాష్ట్రలో రూ. 80,437 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో రూ. 75,165 కోట్లు, రాజస్థాన్‌లో రూ. 49,627 కోట్లు, తమిళనాడులో రూ. 43,799 కోట్లు, పశ్చిమబెంగాల్‌లో రూ. 43,466 కోట్లు కేటాయించడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్.ఎస్.ఓ) విడుదల చేసిన 2023 సంవత్సర లెక్కల ప్రకారం పై రాష్ట్రాలు వరుసగా 84.8%, 73%, 69.7%, 82.9%, 80.5% అక్షరాస్యత రేట్లు సాధించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత అక్షరాస్యత రేటు మాత్రం 72.8%. బడ్జెట్‌లో విద్యా కేటాయింపులు పెంచడం ద్వారానే రాష్ట్ర అక్షర్యాస్యతలో మిగిలిన గ్యాప్‌ని తొలగించగలం.
విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని..
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా రూ.1,100 కోట్లతో రాష్ట్రంలోని 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సౌకర్యం, నూతనంగా రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు, రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో నైతిక విలువల బోధనకు కేరళ తరహా వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు, జిల్లా కలెక్టర్లకు తరచు విద్యాసంస్థలు తనిఖీలు చేసేలా ఆదేశాలు, రూ. 5 వేల కోట్లతో 30 కాంప్లెక్స్‌ల్లో 120 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యంగ్ ఇండియా పేరుతో) భవనాల నిర్మాణం చేపట్టడం వంటి పలు చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత సాధించిన జిల్లాగా హైదరాబాద్ (83.24%) ఉండగా జోగులాంబ గద్వాల జిల్లా 49.87%తో అతి తక్కువ అక్షరాస్యత సాధించిన జిల్లాగా నిలిచింది. రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత 57.30% కాగా పట్టణ అక్షరాస్యత 81.09%. విద్యారంగంలో ఇంకా ఎదురవుతున్న సవాళ్లని వాటి పరిష్కారానికి మనం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది ఈ అక్షరాస్యత దినోత్సవం. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించేలా మంచి నిర్ణయం తీసుకుంటాయని కోరుకుందాం.
డా. షేక్ జాన్ పాషా
ప్రభుత్వ అధ్యాపకులు
73868 47203