పూజా సమయంలో తప్పుచేస్తే- ఏం జరుగుతుంది

by Ravi |   ( Updated:2023-01-29 02:25:33.0  )
పూజా సమయంలో తప్పుచేస్తే- ఏం జరుగుతుంది
X

నం నిత్యం భగవంతునికి పూజలు, పునస్కారములు ఆచరిస్తూ, ఆయన అనుగ్రహం పొందడానికి ఎన్నో తాపత్రయాలు పడుతుంటాము... ఒక్కసారి ఈ కథనం చదివితే, మనం పూజ భక్తితో నిర్వహిస్తున్నామా, లేక అనవసరమైన చాదస్తంతో, ఆర్భాటాలు చేస్తున్నామా అనేది అర్థం అవుతుంది ...

ఏది భక్తి

ఒక్కోసారి మనకు అర్థంపర్థం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి... పూజా నియమాలు తెల్సుకోవడం మంచిదే, పూజలో దొర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కానీ, వాటికోసం పూజనే మానివేయడం తప్పు...

దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి !

భక్త కన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి... (జింక మాంసం..) ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు, కానీ... దేవుడు ఛీ నీచుడా... నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు. నువ్వు స్నానం చేసావా ముందు, విభూది కూడా పెట్టుకోలేదు., దూరం జరుగు అనలేదు, పరమ సంతోషంతో స్వీకరించాడు... ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు.. శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు, నువ్వు భక్తితో ఏది పెట్టిన భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించాలి...

గజేంద్ర మోక్షంలో గజరాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు..

పైగా తాను నిత్యం ధరించే శంకు చక్రాలను ధరించకుండా, లక్ష్మీ దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు... అంతే కాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు, ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకొచ్చానా... నీ చావు నువ్వు చావు అనలేదు.. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి.. ఆపదలో ఉన్నవాణ్ణి, ఆర్తితో పిలిచినవాడిని, నీవు తప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే.. అప్పుడు శ్రీహరి ఏ రూపంలో అయినా సరే, ఏ సమయంలోనైనా సరే వచ్చి కాపాడతాడు, అదే ఆయన నైజం...

ద్రౌపది వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండలేనప్పుడు అన్నా శ్రీ కృష్ణా అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా... నిన్ను ముట్టుకోకూడదు మూడు రోజులు తరువాత పిలిస్తే వస్తాను, అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే, భక్తితో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు అని శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపంలో స్వామి పలుకుతాడు... ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది... మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే...

ఇక మన చాదస్తం...

దేవునికి ఇటు ముఖం ఉండాలి, అటు ముఖం ఉండాలి అని కొందరు, ఇవి నైవేద్యంగా పెట్టరాదు, అది పెట్టాలి అని కొందరు, (వీరికెప్పుడైన దేవుడు కనిపించి ఇది వద్దు అని చెప్పినట్లుగా చెబుతారు... ) పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఏ దిక్కుకు తిప్పాలి... ఏ నూనెతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభంలోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే, ఇంకా మనం భగవంతుడుని ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతులం కావాలి..

అందుకే ఎప్పుడైనా భక్తుడు అనేవాడు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి... భగవంతునికి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు... ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అంటే ఆయన చిరునవ్వుతో మన్నిస్తాడు.. తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏది దాయటం కుదరదు గాక కుదరదు...స్వస్తి..

తిరుమల మనోహర్ ఆచార్య

99890 46210

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read..

కథా సంవేదన:పెట్టె విప్పడం


Advertisement

Next Story

Most Viewed