- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాగైతేనే.. కమిటీ ఉద్దేశ్యం నెరవేరుతుంది!
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ (వ్యవస్థ) లోని లోపాలను సవరించడానికి, అందులోని సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించడానికి ప్రస్తుత ప్రభుత్వం ధరణి అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. ధరణిలోని లోపాలు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను ఇదివరకే పలు సంఘాలు, అనుభవం గల రెవెన్యూ అధికారులు, గత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టడం వల్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి..
అయితే, ప్రస్తుత ధరణి అధ్యయన కమిటీ మొట్టమొదట అసలు 'ధరణి'ని కొనసాగించాలా లేదా అనే విషయంపై స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ధరణి వ్యవస్థను కొనసాగించవచ్చు అనుకున్నప్పుడు దానికి బదులుగా వేరే పటిష్టమైన, ప్రజలకు (రైతులకు, భూ యజమానులకు) అందుబాటులో ఉండే విధంగా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విధంగా అట్టి వ్యవస్థ ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ ధరణి వ్యవస్థనే కొనసాగించాలనుకుంటే అందులోని సమస్యలకు ఇదివరకే గత ప్రభుత్వం T.Modules పేరుతో సవరించుకోవడానికి Online లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ, అవి అన్నీ కూడా కలెక్టర్ చేతిలో ఉంచడం (అసలు కొత్త చట్టం 2020లో ధరణి (Electronic Pahani)లో ఎవరికీ కూడా మార్పులు, చేర్పులు చేయడానికి వీలు లేనప్పటికీ), వాటిని జిల్లా కలెక్టర్లు పరిష్కరించకపోవడంతో ధరణి వ్యవస్థలో, సవరించడానికి వీలు లేని పరిస్థితి దాపురించింది.
కోట్లలో అక్రమ సంపాదన
ధరణి అధ్యయన కమిటీ మొదట ఎక్కువగా ఏ మాడ్యూల్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెండింగులో ఉన్నాయో వాటిపై మొదట దృష్టి కేంద్రీకరించవలసి వస్తుంది. ఉదా. T.M- 15 మాడ్యూల్ ప్రొహిబిటెడ్ లిస్టులో తమ భూములు అన్యాయంగా చేర్చబడి ఉంటే వాటిని తొలగించడానికి భూ యజమానులు నానా తిప్పలు పడుతున్నారు. గత ప్రభుత్వం ఈ మాడ్యూల్ ద్వారా తమ సమస్య పరిష్కారానికి, కొంత మంది జిల్లా కలెక్టర్లు, భూమి ధరలో పర్సంటేజ్ ప్రకారం అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారన్న వార్తలు రావడమే కాకుండా, వారికి అది ఒక 'అక్షయ పాత్ర'లాగా ఉపయోగపడింది. అదేవిధంగా T.M- 33 మాడ్యూల్‌లోని సమస్యలు రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించాలన్న ఆదేశాల వల్ల, కింది స్థాయి నుండి (తహసీల్దార్ నుండి) జిల్లా స్థాయికి అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనుకూలమైన నివేదికలు పంపించడానికి సామాన్య రైతు వశం కాలేదు. దీంతో అట్టి సమస్యలు అలాగే ఉండిపోయాయి.
ముందు వీటిని పరిశీలించండి!
ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా ఒక్కొక్క మాడ్యుల్ లోని సమస్యలు భూయజమానుల ప్రమేయం లేకుండా వీలయితే 'సుమోటో'గా పరిష్కరించే విధంగా కమిటీ అధ్యయనం చేయాల్సి వస్తుంది. అందుకు గానూ, కమిటీలో కొంతమంది రైతునాయకులకు చోటు కల్పించవలసి వస్తుంది. చట్టాల గురించి తెలిసిన వారే కాకుండా ప్రాక్టికల్‌గా సమస్యలను చూసిన వారిని కమిటీలో చోటు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ధరణి అధ్యయన కమిటీ మొదట, అసలు ధరణి పోర్టల్‌కి రెవెన్యూ రికార్డులను అప్‌లోడ్ చెయ్యక ముందు రెవెన్యూ రికార్డులను ఏ విధంగా అప్‌డేట్ చేశారు అనే విషయాలను కూడా పరిశీలించవలసి వస్తుంది. ధరణి పోర్టల్ లోకి అప్‌లోడ్ చేయకముందు ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన తాజా పహాణిలను ఒక్కొక్కటి 5 కాపీలను ప్రింట్ తీసి ఉంచారన్న విషయమై కమిటీ ఆరా తీయాలి. అది ధరణిలో ఎటువంటి మార్పులు, చేర్పులైనా సరే లీగల్‌గా చేశారా లేదా? అన్న దానికి బేస్ రికార్డ్ అవుతుంది. తదనుగుణంగా అధికారులపై చర్యలు తీసుకోవచ్చు.
చేయని తప్పుకు అధికారుల బలి
ధరణిలో సమస్యలు ఏ విధంగా దృష్టికి వచ్చాయో, ఆ విధంగా మాడ్యూల్‌ను గత ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఎటువంటి రాతపూర్వక సూచనలు లేకుండా ప్రవేశపెట్టేది. అందులో ఒకటి ‘TM-26’ కోర్టు కేసుల ఇంటిమేషన్. వివిధ కోర్టులలో ఇచ్చిన అదేశాలను పై మాడ్యూల్‌లో ఆప్‌లోడ్ చేస్తే, దానిపై జిల్లా కలెక్టర్ తగు చర్య తీసుకుంటే తప్ప అది అమలులోకి రాదు. ఉదా: ఇటీవల తెలంగాణ హైకోర్టు వారు మహేశ్వరం మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక సర్వే నెంబర్‌పై ఎటువంటి రిజిస్ట్రేషన్ చెయ్యవద్దని సంబంధిత తహసీల్దార్ అదేశాలు జారీ చేయడం జరిగినది. అయితే వాటిని TM-26 మాడ్యూల్‌లో పిటిషనర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి వాటిని బ్లాక్ చేయకపోవడంతో వాటికి స్లాట్ బుక్ కావడంతో లాగిన్‌లో ఉన్న తహసీల్దార్ (కొత్త చట్టం 2020లో స్లాట్ బుక్ అయితే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి అన్న నిబంధనతో) వాటిపై రిజిస్టేషన్ చేయడంతో కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విధమైన మాడ్యూల్ వలన చేయని తప్పులకు కింది స్థాయి అధికారులు కోర్టు ముందు నిలబడాల్సి వస్తుంది.
కలెక్టర్ ఆదేశాలే అమలుకావు
అలాగే ఒక స్పెషల్ ట్రిబ్యునల్ (కలెక్టర్, అడిషినల్ కలెక్టర్‌తో కూడినది) ROR చట్ట ప్రకారం ఏమైన తీర్పులు ఇచ్చినట్లయితే వాటిని వేరుగా అమలు చేసే పద్ధతి కొత్త చట్టం 2020లో లేదు. కలెక్టర్ ఇచ్చిన తీర్పును తిరిగి TM-26 లో అప్లోడ్ చేస్తే తిరిగి అదే కలెక్టర్, తీర్పును అమలు చేయమని తహసీల్దార్‌కు అదేశాలు ఇవ్వవలసి వస్తుంది. అంటే ఒక జిల్లా అధికారి జారీ చేసిన తీర్పును, తిరిగి అమలు చేయమని తానే తిరిగి TM-26 లో ఆదేశాలు ఇస్తే తప్ప అది అమలులోకి రాలేదు. కానీ ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో స్పెషల్ ట్రిబ్యునల్ ఒక భూమి విషయంలో పట్టాదారు చనిపోయినందున ‘సక్సెషన్’ చెయ్యమని తహసిల్దార్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని అమలుకు పట్టాదారు వారసులు TM-26 లో అప్లై చేస్తే అప్పటి జిల్లా కలెక్టర్ (తీర్పు ఇచ్చిన కలెక్టర్ బదిలీ అయినందున) ఒక స్పెషల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలును ‘రిజెక్ట్’ చేయడం జరిగింది. పట్టాదారు వారసులు లేరు అనేదే దానికి కారణం. ఒక స్పెషల్ ట్రిబ్యునల్ (జిల్లా కలెక్టర్‌తో కూడినది) ఇచ్చిన ఆదేశాలు, అదే జిల్లా కలెక్టర్ అమలు చేయకపోవడం, ధరణి పోర్టల్‌లో (కొత్త చట్టంతో లేనప్పటికి) ఆశ్చర్యకరమైన విషయం. అంటే కక్షిదారులు కేసులో తమకు అనుకూలంగా తీర్పు పొందినప్పటికీ, దానిని అమలు చేసుకోవడానికి తిరిగి అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం ధరణి పోర్టల్ ప్రత్యేకత.
ఈ విధంగా ప్రతి మాడ్యూల్‌లోని అంశాలను అధ్యయన కమిటీ కూలంకుషంగా పరిశీలించి వాటిని సులువైన రీతిలో పరిష్కారాలు కనుగొని కింది స్థాయి అధికారుల వరకు వికేంద్రీకరణ చేస్తే తప్ప ధరణి అధ్యయన కమిటీ ఉద్దేశ్యం నెరవేరదు. కాబట్టి కమిటీ తగు చర్యలు తీసుకొని భూ యజమానులు ధరణి పోర్టల్ బాధల నుండి విముక్తి కలిగిస్తారని ఆశిస్తూ..
సురేష్ పొద్దార్
విశ్రాంత సంయుక్త కలెక్టర్
80080 63605