నివేదన:ఓటరుగానే ఇంకా ఎన్నాళ్లు?!

by Ravi |   ( Updated:2022-09-03 18:35:01.0  )
నివేదన:ఓటరుగానే ఇంకా ఎన్నాళ్లు?!
X

బీసీలు ప్రతి రంగంలో సగం వాటా కావాలని దేశవ్యాప్తంగా పటిష్టమైన ఉద్యమాలు చేయాలి. ఇప్పటి వరకు కేవలం విద్య, ఉపాధి రంగంలో రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంతకు రెట్టింపు ఉద్యమాలు చేయాలి. అప్పుడే బీసీలకు నిజమైన గుర్తింపు దొరుకుతుంది. రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా, హక్కులు లభిస్తాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా బీసీల రాజకీయ రిజర్వేషన్లు పై పార్లమెంట్‌లో చర్చించడానికి వివిధ పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో? బీసీలారా ఆలోచించండి.

75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో రాజ్యాంగపరంగా రిజర్వేషన్ అనుభవిస్తున్నారనే అపవాదును మోస్తూ కూడా నేటికి కూడా పూర్తిస్థాయిలో అధికారం అనుభవించలేకపోతున్నారు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాలవారు. అగ్రవర్ణ కులాల వారు నిమ్మ వర్గాల వారిని ఓటర్లుగా చూశారే తప్ప లీడర్లుగా చూడలేదు. అందుకే వారు జనాభాలో అతి తక్కువ శాతం గా ఉండి కూడా రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. దేశ జనాభాలో 93 శాతంగా ఉన్న నిమ్మ వర్గాల వారు అనుభవిస్తున్న అధికారం ఒక శాతం మాత్రమే. జనాభా దామాషా ప్రకారం వారు ఎంత మేర వారు ఉండాలి? వారి అధికారాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? అందులో 50 శాతంగా ఉన్న బీసీలు ఎంత మేరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.

బీసీ కులగణన ఎప్పటినుంచో ఉన్న ప్రధాన డిమాండ్. నేటికీ అది అమలుకు నోచుకోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు లేకపోవడం అనేది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధం. బీసీ వర్గానికి చెందిన వారు ఇంకా మధ్యవర్తులు, ఓటర్లు అనే ఆధిపత్య కులాలు అనుకుంటున్నాయి. వారికి అనుగుణంగానే మన బీసీ నాయకులు ప్రవర్తిస్తుంటారు. అందుకే బీసీల నుంచి గెలిచిన ఎంతో మంది లీడర్లు ఉన్నా కనీసం రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం లేదు. గట్టిగా అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారు. అగ్రవర్ణ నాయకులు మాత్రం తమకు అవకాశం వచ్చిన ప్రతీసారి రాజ్యాంగం గురించి, హక్కుల గురించి మాట్లాడుతూ సొంతంగా నిర్ణయం తీసుకోనే అధికారం బీసీ వర్గాల వారికి ఇవ్వడం లేదు.

ఐక్యంగా లేకపోవడంతోనే

ఓటరు జాబితాలో మెజారిటీగా ఉన్న బీసీలు నేతలు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఎందుకని కచ్చితంగా తమకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేయరు? ఎందుకని మెజారిటీ వర్గాల మద్దతును పొందలేకపోతున్నారు? పోనీ సొంతంగా ఎందుకని పార్టీని నిర్మించలేక పోతున్నారు? ఎవరైనా పార్టీ పెడితే ఎందుకని అందరూ మద్దతు ఇవ్వలేకపోతున్నారు? ఓసారి గట్టిగా ఆలోచించుకోవాలి. బీసీలలో కొన్ని కులాలవారు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా ఎదిగారు.

ఇప్పటికీ చాలా రంగాలలో కనీసం ప్రాతినిధ్యం లేని కులాలు చాలా ఉన్నాయి. విద్యకు, ఉపాధికి దూరంగా, రాజకీయంగా ఎదగలేనంత దూరంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా బాగా వెనుకబడిన కులాలూ ఉన్నాయి. వీరిని ఎదిగిన కొన్ని ఓబీసీ కులాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు తమతో సమానంగా చూడలేకపోతున్నారు. అందుకే ఐక్యంగా ఉద్యమించి చట్టసభలలో వాటాను, అధికారాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ఓబీసీల నుంచి వచ్చిన పార్టీలు ఇతర సామాజిక వర్గాల నుంచి బలమైన మద్దతును పొందలేకపోతున్నాయి. నాయకులు లక్షలాది బీసీ విద్యార్థులు, యువతను సరైన దారిలో నడిపించలేకపోతున్నారు. అధికార దాహంతో అగ్రకులాల అధికార పార్టీలకు కొమ్ముకాసే కొందరు నాయకుల వలన ఓబీసీల రాజకీయ భవిష్యత్ కనుమరుగైపోతున్నది.

50 శాతం రావాల్సింది

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 340 ద్వారా బీసీ కులాలను గుర్తించడానికి ఒక కమిషన్ వేయాల్సిందిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో అంబేద్కర్ రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లారు. దాంతో ఆందోళన చెందిన ప్రభుత్వం 'కాకా కాలేల్కర్' అనే ఒక పూనా బ్రాహ్మణుడు చైర్మన్‌గా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. సదరు కమిషన్ 2,218 కులాలను బీసీ కులాలుగా గుర్తిస్తూ ఒక రిపోర్టును రాష్ట్రపతికి పంపింది. కానీ, రిజర్వేషన్లు రాలేదు.

రెండోసారి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్‌కి చెందిన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఆ కమిషన్ 3,743 కులాలను బీసీ కులాలుగా గుర్తించింది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. బీసీ వ్యతిరేక శక్తులు ఉద్యమించడంతో 50 శాతంగా రావాల్సిన రిజర్వేషన్లు 27 శాతానికే పరిమితమయ్యాయి. బీసీలు కలిసి ఉన్నారు కానీ, ఒకటిగా లేరు. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, రాజకీయపరంగా ఎందుకు ఇవ్వడం లేదో ఆలోచించాలి.

ఎందుకో ఆలోచించండి

చట్టసభలలో బీసీలకు రావాల్సిన సీట్లు పార్లమెంటులో 270, రాజ్యసభలో 120. ఓసారి ఆలోచించండి అధికారం ఎవరి చేతిలో ఉందో? వీరికి తోడుగా ఎస్‌సీ, ఎస్‌టీ, ఇతర సామాజిక వర్గాలు కలిస్తే అధికారం ఎటు పోతుంది? వీటి నుంచి బలవంతంగా అగ్రకులాలు అధికారాన్ని తీసుకోగలరా? బీసీలు ప్రతి రంగంలో సగం వాటా కావాలని దేశవ్యాప్తంగా పటిష్టమైన ఉద్యమాలు చేయాలి. ఇప్పటి వరకు కేవలం విద్య, ఉపాధి రంగంలో రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అంతకు రెట్టింపు ఉద్యమాలు చేయాలి. అప్పుడే బీసీలకు నిజమైన గుర్తింపు దొరుకుతుంది. రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా, హక్కులు లభిస్తాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా బీసీల రాజకీయ రిజర్వేషన్లు పై పార్లమెంట్‌లో చర్చించడానికి వివిధ పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో? బీసీలారా ఆలోచించండి.

నల్లవెల్లి భరత్

తెలంగాణ పట్టభద్రుల నిరుద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి

90307 72037

Advertisement

Next Story