సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోండి!

by Ravi |   ( Updated:2025-02-22 01:15:52.0  )
సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోండి!
X

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే, నిరుద్యోగ పట్టభద్రులు, చదువుకున్న యువత తమ ఆవేదనలకు స్పందన ఆశించే వేదికగా ఊహించుకుంటారు. అయితే, గడచిన కాలంలో ఈ ఎన్నికలు గమ్యం తప్పి, చదు వుకున్న నిరుద్యోగ యువత ఆకాంక్షలకు దూరమై, ధనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ ఆశగాళ్ల ఆధిపత్య పోరుగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో సమానం అయ్యాయి. నిజమైన పట్టభద్రుని స్వరాన్ని వినిపించే ప్రయత్నం తగ్గిపోతుండగా, నిరుద్యోగ పట్టభద్రులు మౌన ఆవేదన గమనార్హంగా మారింది.

ఈ నేపథ్యంలో పట్టభద్రులు తమ భవిష్యత్తును ప్రభావితం చేసే ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి? ఎవరు నిజమైన అభ్యర్థులు? అనే ప్రశ్నలు ఇప్పటికే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చిన వారికి, నిరుద్యోగులను ఆర్థికంగా నష్టపరిచిన వారికి బదులు, నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలను నిజంగా అర్థం చేసుకునే వారికే మద్దతు ఇవ్వడంతో ఈ మౌన వ్యథను తొలగించేందుకు, నిజాయితీ గల అభ్యర్థుల గళాన్ని వినిపించే సమయం ఆసన్నమైంది.

నాయకుల కుయుక్తులను గమనించక..

ఈ ఎన్నికల్లో అసలైన నిరుద్యోగ పట్టభద్రుల పోరాటం కనుమరుగై, నాణ్యమైన విద్య కోసం తపనపడే వారి ఆకాంక్షలు నీరు గారిపోయి, ధనికుల ఆధిపత్య పోరుగా మారిపోయాయి. ఇలా, డబ్బుతో పదవులను ఆక్రమించేందుకు తహతహలాడుతున్న స్వార్థపరుల ఆటలో, అసలు నిరుద్యోగ పట్టభద్రులు అయోమయ పరిస్థితుల్లో నిస్సహాయులై మౌనం వహిస్తున్నారు. వారు పన్నే కుయుక్తులను గుర్తించక, వారి ప్రభావానికి లోనై ఓటు వేస్తూ, ఆ తర్వాత తమ భవిష్యత్తు చీకటిలో పడుతున్నట్టు గుర్తించలేకపోతున్నారు. ఏళ్లుగా పునరావృతం అవుతున్న ఈ తతంగంలో, ఇలాంటి అక్రమార్కులకు ఓటు ఎందుకు వేయాలి? అనే ప్రశ్నను తమలో తాము వేసుకోకుండా, భావనారహితంగా బలయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఈ అసమాన పోటీలో..

ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలను అనుభవిస్తూ, విధులకు ఎగనామం పెడుతూ, అదనపు ఆదాయ మార్గాల కోసం ఉద్యోగ శిక్షణ కేంద్రాలను నడిపి నిరుద్యోగుల దగ్గర సంపాదించిన కొందరు, ’ముంద స్తు ప్రణాళిక’తో నిరుద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి, ఇప్పుడు వారి ఓట్ల కోసం రంగంలోకి దిగుతున్నారు. తాత్కాలిక రాజీనామా నాటకాలతో ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆస్తులు కూడబెట్టుకుని, ఎన్నికల ముందు రాజీ నామా చేసి మళ్లీ పట్టభద్రుల సమస్యలపై ప్రేమ చూపిస్తున్నట్లు నటన చేస్తూ, అధికార ఆశలు నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో కొందరు ప్రైవేటు కళాశాలల యజమానులు నిరు పేద విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసి సంపద గడించిన వారు, ఆ ధనబలంతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ‘పార్టీ టికెట్’ కొనుక్కుని మళ్లీ పట్టభద్రుల ఓటు కోసం దూకుతున్నారు. వీరికి తోడు ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారులు, తమ సంపదను పెట్టుబడిగా వినియోగించి, పట్టభద్రుల ఓటు బ్యాంకును కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

టికెట్ కొన్నవారు పని చేస్తారా?

మొదట స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఆపై కొన్ని కోట్లకు పార్టీ టికెట్ కొనుగోలు చేసుకుని రెండోసారి నామినేషన్ వేస్తున్నారా? వాళ్లను మనం గెలిపించడమంటే ప్రజాస్వామ్యాన్ని తాకట్టుపెట్టినట్టే. ఇలాంటి మోసపూరిత రాజకీయాలను బహిష్కరించాలి. మాయ మాటలు చెప్పి డబ్బుకు టికెట్ కొనుగోలు చేసే వ్యక్తులను గుర్తించి జాగ్రత్త పడాలి. ఇలాంటి అభ్యర్థులు తాము గెలిచిన తర్వాత పట్టభద్రుల కోసం పని చేయరని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. టికెట్ల కొనుగోలు వెనుక ఉన్న డబ్బు వ్యవహారాన్ని అర్థం చేసుకొని, ఒక్కో పార్టీకి చెందిన కోట్ల రూపాయల విలువైన టికెట్ కొనుగోలు చేయగలిగిన వ్యక్తి నిజంగా ప్రజల సమస్యలు పరిష్కరించగలరా? ప్రజలకు సేవ చేస్తారా? లేక తమ పెట్టుబడిని వసూలు చేసుకునేలా అవినీతికి పాల్పడతారా? అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి.

రాజకీయ లాభాలు పొందడం కోసం..

ఇటీవల, నిరుద్యోగ పట్టభద్రులను మభ్యపెట్టి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ వ్యాపారం చేసే వ్యక్తులు రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న తీరు కనిపిస్తోంది. ఈ ధోరణి ప్రజాస్వామ్య విలువలకు హాని కలిగించడంతో పాటు, నిజమైన అభ్యర్థులకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది. మొదటగా వీరు స్వతంత్ర అభ్యర్థులుగా ప్రచారం మొదలు పెట్టి, విద్యావంతులుగా, నిరుద్యోగ యువత సమస్యలకు పరిష్కారం చూపుతామని ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తారు. యువతను ఆకర్షించి మద్దతు కూడబెడతారు. సామాజిక మాధ్యమాల్లో క్యాంపె యిన్‌లు, నిరుద్యోగ సమస్యలపై చర్చలు నిర్వహిస్తారు. నిజమైన అభ్యర్థులను తప్పుబట్టేలా ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగ పట్టభద్రులలో అసంతృప్తిని, బలహీనతలను అందిపుచ్చుకుని, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తారు. కానీ, తమ అసలు లక్ష్యం ప్రజా సమస్యలు పరిష్కరించడం కాదు, రాజకీయ లాభాలను పొందడమే.

‘స్వతంత్ర’ అభ్యర్థులను గుర్తించగలరా?

ఎన్నికల సమయంలో పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చుచేసి, ఆర్భాటపు ప్రచారాలతో, ప్రలోభాలు, మాయమాటలతో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో నిజాయితీ గల స్వతంత్ర అభ్యర్థులకు పోటీ చేయడం చాలా కష్టంగా మారింది. పెద్ద పార్టీల డబ్బు శక్తి కారణంగా, స్వతంత్ర అభ్యర్థులకు ప్రచార అవకాశాలు తగ్గిపోతాయి. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో వారిని గూర్చి కనీసం ప్రస్తావించరు. వీరికి సోషల్ మీడియా తప్ప వేరే మార్గం ఉండదు. పైగా, వారు ‘గెలిచే అవకాశం లేదు’ అనే అపోహ ఓటర్లలో ఉండడం, ప్రలోభాలు చేసి ప్రభావితం చేయలేకపోవడం ప్రధాన సమస్యలు.. అయితే, నిజంగా ప్రజా సేవకు అంకితమైన, అభివృద్ధికి కట్టుబడిన స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.. పట్టభద్రులు వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. నైతిక విలువలు, నిజాయితీ, ప్రజా సంక్షేమం కోసం నిలబడగలిగే అభ్యర్థులను గెలిపించేందుకు ముందుకు రావాలి. వాస్తవ హామీలు, ఆచరణలో పెట్టగలిగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే వారిని ఎంచుకోవాలి. విచ్చలవిడిగా కోట్ల రూపా యలు ఖర్చుచేసి ఎన్నికలను కొనుగోలు చేయాలనుకునే పార్టీల అభ్యర్థుల ముందు, స్వతంత్ర అభ్యర్థుల పరిస్థితి గమనించాల్సిన అవసరం ఉంది. పట్ట భద్రులు అరచేతిలోని సెల్‌ఫోన్ ద్వారా చురుగ్గా ఆలోచించి, తేడాను గుర్తించి, నిజమైన సేవకులను గెలిపించాలని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

ఈ ఓటు భవిష్యత్తును నిర్ణయించేది!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమూల్యమైనది. అయితే, కొంతమంది నేతలు ఓటుకు నోటు, మందు, విందు, తప్పుడు హామీలు, ప్రలోభాలతో పట్టభద్రులను మభ్యపెడుతున్నారు. కాబట్టి, పట్టభద్రులు బుద్ధిపూర్వకంగా ఓటు హక్కును వినియోగించాలి. డబ్బు పెట్టుబడిగా చూసే వారు గెలిచిన తర్వాత ప్రజాసేవ కంటే వసూలుపై దృష్టి పెడతారు. ఓటును అమ్ముకున్నవారు తర్వాత న్యాయం అడిగే హక్కును కోల్పో తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, నైతిక విలువలతో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, పట్టభద్రులకు విలువనిచ్చే,సజీవంగా మార్చే సమర్థ నాయకత్వాన్ని చూపగల అభ్యర్థిని ఎంచుకోవడం ప్రతి పట్టభద్రుడి బాధ్యత.

నంగె శ్రీనివాస్,

విద్య, సామాజిక విశ్లేషకులు,

94419 09191

Next Story