పట్టభద్రుడా పయిలం...!?

by Ravi |   ( Updated:2024-05-19 01:01:04.0  )
పట్టభద్రుడా పయిలం...!?
X

ప్రస్తుతం తెలంగాణలో నల్గొండ - ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని ఉపఎన్నికకు ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే, గతంలో ఈ స్థానంలో ఎన్నికైన పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడం, మరోవైపు ఓటింగ్ ప్రక్రియ ముగిసిన ఎంపీ ఎన్నికల్లో సాధారణ ఓటర్ల తీర్పు ఏవిధంగా ఉన్నదో తెల్వకముందే ఈ ఎన్నిక రావడంతో.. మరీ ముఖ్యంగా ఇది పట్టభద్రుల ఓట్లకు సంబంధించినది కావడంతో రాజకీయ పార్టీలకు ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రుతతో పాటు ఏదో తెలియని అభద్రత ప్రధాన పార్టీల్లో కనబడుతుంది. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ సీటును కాపాడుకోవడానికి పట్టు నిలుపుకునే పనిలో తలమునకలై ఉంది.

నిరుద్యోగ ఎన్నికలు కావు..!

పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి చదువుకున్న వాళ్ళ తరపున తమ వాణిని సభలో వినిపించేందుకు, ప్రభుత్వం తీసుకువచ్చే పాలసీలు ముఖ్యంగా విద్యాపరమైన పాలసీలు తయారు చేసే విధానంలో, పట్టభద్రుల ప్రయోజనాలైన పాఠశాల, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో, పరిశోధన సంస్థల్లో నియామకాలు, మౌలిక వసతుల కల్పనల్లో తమ వంతు పాత్రను పోషిస్తూ, అతి ముఖ్యంగా విద్యా ప్రపంచానికి శాసనాలు చేసే ప్రక్రియల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఈ ఎన్నిక విద్యావంతుల ప్రయోజనాలు కాపాడేదిగా కాకుండా దురదృష్టవశాత్తు ఈ ఎన్నికను ‘నిరుద్యోగుల ఎన్నికలుగా’ ముద్ర వేయడం వెనుక అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ ప్రయోజనాలు తేటతెల్లమవుతుంది.

సాధారణ ఎన్నికల్లో ఓటర్లు అనేక ప్రలోభాలకు తలొగ్గి, మ్యానిఫెస్టోలోని మాయలకు మోసపోయి, రాజకీయ పార్టీలు ప్రజలను వాస్తవాలకు దూరంగా భ్రమల్లో, ఊహల్లో వాగ్దానాలు చేసి, కేవలం సంక్షేమ పథకాల మోజులో పడేసి, అభివృద్ధి అనే పదబందంతో పేక మెడలను నిర్మిస్తూ, ప్రజలకు మౌలిక అంశమైన విద్యను ప్రభుత్వాలు విస్మరిస్తే విద్యావంతుల తరుపున విల్లంబై విరుచుకుపడటానికి ఒక ప్రత్యేక గొంతుక ఈ స్థానం. పట్టభద్రుల్లో కేవలం నిరుద్యోగులు మాత్రమే ఉండరు అనేది తేటతెల్లం. ఈ స్థానంలో మూడు జిల్లాల్లో స్త్రీ పురుషులు కలిపి సుమారు 4.61 లక్షల ఓటర్లను 'నిరుద్యోగులు' అనే మానసిక రుగ్మతతో చూడడం తగదు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లు, స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న వాళ్ళు, చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలుగా నిలదొక్కుకునే వాళ్ళందరూ ఉన్నారు. ఉద్యోగులు అందరూ ఉంటారు.

ఓట్ల విధానం, కౌంటింగ్ ప్రక్రియ

ఈ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్ కూడా సాధారణ ఎన్నికల ‌లాగా కాకుండా విభిన్నంగా ఉంటుంది. ఓటరు తన ప్రాధాన్యత క్రమాన్ని అభ్యర్థికి కేటాయించిన కాలంలో తమ ప్రాధాన్యత సంఖ్యను వేయాలి, పోటీచేసిన అందరకీ తాము ప్రాధాన్యత క్రమాన్ని ఇవ్వవచ్చు కానీ మొదటి ప్రాధాన్యత (1) క్రమ సంఖ్యను సూచించకుండా మిగతా ప్రాధాన్యతలను సూచిస్తే ఆ ఓటు చెల్లదు. అదే విధంగా సంతకం కానీ, టిక్ మార్క్ కానీ, అభ్యర్థి క్రమ సంఖ్యపై రౌండప్ చేయడం వంటివి చేస్తే కూడా ఆ ఓటు చెల్లదు.

ఓట్ల లెక్కింపు విధానం కూడా కొంచెం తికమక పెట్టేదిగానే ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతం కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థి గెలిచినట్టుగా నిర్ధారిస్తారు. లేదంటే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి రౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఇందులో కేవలం ఒకటో ప్రాధాన్యత మాత్రమే ఇస్తే అవి అతనికే చెందుతాయి. ఆయా ఓట్లలో రెండో ప్రాధాన్యత ఏ ఏ అభ్యర్థులకు ఇచ్చారో వాటిల్లో కలుపుతారు. అప్పటికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే అందులో నుండి చివరి స్థానంలో ఉన్నవారిని ఎలిమినేషన్ చేస్తారు. ఈ 2వ రౌండ్‌లో రెండవ ప్రాధాన్యతలో నుండి మిగతా అభ్యర్థులకు వచ్చిన మూడో ప్రాధాన్యత ఓట్లను కలిపి మొత్తం కలిపి అలా మ్యాజిక్ ఫిగర్ వచ్చేంత వరకు లెక్కింపు ప్రక్రియ జరిగి గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు.

ప్రలోభాలకు లొంగకుండా.. ఎన్నుకోండి!

డిగ్రీలు చదివి ఓటు విలువ తెలుసుకుని ఆదర్శంగా ఉండాల్సిన పట్టబద్రులు గతంలో ఇదే స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో కేవలం 58% శాతం పోలింగ్ జరిగింది. అందులో 14,039 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 2021 ఎన్నికల్లో 76.41% శాతం పోలవగా అందులో 8,949 ఓట్లు చెల్లుబాటు కాలేదు. వరుసగా పోలింగ్ శాతం పెరగడం చెల్లని ఓట్లు తగ్గుతూ వస్తుండడం మంచి పరిణామమే కానీ.. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం ఎంత మేరకు బాధ్యతాయుతంగా పెరుగుతుందో.. అలాగే చెల్లుబాటు కానీ ఓట్ల సంఖ్య ఎంత మేరకు తగ్గడానికి ఎలక్షన్ కమిషన్ బాధ్యతగా ఎటువంటి చర్యలను చేపట్టి ఏవిధంగా ఓటర్లను చైతన్యపరుస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుత ఎన్నికల్లో అందరూ అభ్యర్థులు సమస్యలపై ప్రశ్నిస్తామని ప్రసంగాలు ఇస్తున్నారే.. కానీ, పరిష్కార మార్గాలు చూపుతామని ధైర్యంగా చెప్పగలిగేవారు లేకపోవడాన్ని మనం ప్రచారంలో భాగంగా చూస్తున్నాం. రాజకీయ పార్టీల ప్రాధాన్యతగా కాకుండా అభ్యర్థి యొక్క విద్యార్హత, విశ్వసనీయత, విలువలు, నిబద్ధత, పోరాట పటిమ లాంటివి పరిగణనలోకి తీసుకుని విద్యావంతులైన పట్టభద్రులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోకుండా, ప్రలోభాలకు లొంగకుండా, గారడి మాటలతో బురిడీ కొట్టించే తప్పుడు వ్యక్తిని ఎన్నుకోకుండా విద్యావంతుల తెలివైన తీర్పు కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తుంది.

ముఖేష్ సామల

అడ్వకేట్

97039 73946

Advertisement

Next Story