- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్దర్' అవార్డు స్వాగతించాలి... కానీ,
'గదర్' అంటే తిరుగుబాటు. ఆయనే స్వయంగా పెట్టుకున్న పేరు 'గదర్' కాస్త 'గద్దర్‌గా' మారిపోయింది ఉచ్చరించే క్రమంలో. ఎలా పలికినా మనం తీసుకునే అర్థం మాత్రం తిరుగుబాటు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గద్దర్ జయంతి నాడు 'నంది' స్థానంలో 'గద్దర్' పేరుతో సినిమా, టీవీ, నాటక రంగాలకి అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినారు. ఆ ప్రకటన విని మేమంతా హర్షించాం.
రాష్ట్ర ప్రతీకతో అవార్డులిస్తే..
గద్దర్‌కి గత ప్రభుత్వంలో దొరకని గౌరవం ఇప్పుడు దొరుకుతుందని సంతోషిస్తున్నాం. అయితే, అన్ని రంగాలకు అన్ని కళా ప్రక్రియలకు గద్దర్ పేరుతో అవార్డులిస్తే గద్దర్ ఖ్యాతి పలుచబడి పోతుందేమోననే భావన కలుగుతున్నది. గద్దర్ జానపద విప్లవ వాగ్గేయకారుడు. కాబట్టి గద్దర్ మార్గదర్శకంలో జానపద విప్లవ వాగ్గేయకారుడికి గద్దర్ అవార్డు దక్కితే, ఆ అవార్డు పొందిన కళాకారుడికి, గద్దర్‌కి గౌరవంగా ఉంటుంది. గద్దర్ స్ఫూర్తి ఎల్లకాలం కొనసాగుతుంది. సినిమా, టీవీ, నాటక రంగాలలో వివిధ శాఖలకు, వివిధ మార్గదర్శకులు ఉండి ఉంటారు, కాబట్టి అందరికీ కలిపి ఇచ్చే అవార్డులకు ఏదైనా రాష్ట్ర ప్రతీకతో నామకరణం చేస్తే బాగుంటుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 'నంది' పేరుతో అవార్డులు ఇచ్చేవారు, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో 'నంది' పేరుతోనే అవార్డులు ఇస్తున్నారు, కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అవార్డులకు 'నంది' జాగలో 'పాలపిట్ట' లేదా 'జింక' లేదా ఏదైనా రాష్ట్ర ప్రతీకతో అవార్డులిస్తే సబబుగా ఉంటుంది.
ఈ అవార్డును వీరికే పరిమితం చేసి..
నిరంతర సాధన, కఠోర పరిశ్రమ తర్వాత ఒక స్థాయికి చేరిన కళాకారుడికి, ఆ కళా ప్రక్రియలో ఉన్న దిగ్గజం పేరుతో అవార్డు దక్కితే, ఆ అవార్డు పొందిన కళాకారుడి అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది. ఉదాహరణకు, క్లాసికల్ డాన్సర్‌కి నటరాజ రామకృష్ణ, వెస్ట్రన్ మ్యూజిక్‌లో మైఖేల్ జాక్సన్ అలా ఫోక్ మ్యూజిక్‌లో గద్దర్ పేరుతో ఒక జానపద విప్లవ వాగ్గేయకారుడికి అవార్డు దక్కితే చాలా సముచితంగా ఉంటుంది. ఆ వాగ్గేయకారుడు సినిమా, టీవీ లేదా బయట ప్రదర్శనలు ఇచ్చేవాడైనా పరవాలేదు. తన జానపద కళతో జనాలను చైతన్యపరిచే గద్దర్ మార్గదర్శకంలో ఎదిగినవాడై ఉండాలి. మన కేంద్ర ప్రభుత్వం రచయితలకు జ్ఞానపీట్, సామాజిక సేవ చేసిన వారికి, మన దేశ ప్రతీక అయిన పద్మముతో, పద్మ అవార్డ్స్ ఇస్తున్నట్టుగా, మొత్తం సమూహానికి రాష్ట్ర ప్రతీకతో అవార్డుల నామకరణం చేస్తే బాగుంటుంది. 'గద్దర్ అవార్డు' ను పరిమితం చేసి, గద్దర్ లాంటి భావజాలం ఉన్న విశిష్ట కళాకారుడికి ఇస్తేనే అది అత్యుత్తమ అవార్డుగా పరిగణించబడుతుంది.
కొన్ని రాష్ట్రాలలో జానపద కళలు కనుమరుగై పోతున్నాయి, కావున జానపద పితామహుడైన గద్దర్ పేరుతో, మన రాష్ట్రంలో జానపద కళలకు సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం స్థాపిస్తే, అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఏది ఏమైనా, గద్దర్నీ ఇలా గౌరవించాలని ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు.
- సయ్యద్ రఫీ
(చిత్ర దర్శకుడు)