- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడుస్తున్న చరిత్ర:ఫ్రీకి తోడుగా డిస్కౌంటు స్కీములు
తమ పబ్బం గడుపుకోవడానికి సజావుగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నాయకులు చిక్కులలోకి తోస్తున్నారు. 1990లో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పంటరుణాల మాఫీ మొదలైంది. అప్పుడు దేశవ్యాప్తంగా మాఫీ చేసిన మొత్తం రూ.10 వేల కోట్లు. అదే మంత్రాన్ని 2009 ఎన్నికలలో కాంగ్రెస్ రెండోసారి గెలవడానికి ఆనాటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం 2008లో ఉపయోగించారు. అప్పుడు పడ్డ భారం రూ.60 వేల కోట్లు. బడ్జెట్ కేటాయింపులో నాలుగు విడతలుగా చెల్లిస్తామని బ్యాంకులకు హామీ ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం ఆఖరి విడతను మీ లాభంలో మినహాయించుకోండని అంది. క్రమంగా రైతుల రుణ మాఫీ ప్రతిసారి ఎన్నికలలో తప్పనిసరి హామీ అయిపోయింది. 'బ్యాంకు అప్పులు కట్టకండి. ఎన్నికలలో గెలిచాక మా ప్రభుత్వమే మీ అప్పులు తీర్చుతుంది' అనడం మామూలై పోయింది.
రతన్ టాటా అన్నట్లుగా ఈ మధ్య ఒక పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. 'మద్యం అమ్మకాలకు ఆధార్ కార్డు లింకు చేయాలి. అలా సేకరించిన ఆధార్ నంబర్లవారికి ప్రభుత్వ ఆహార సబ్సిడీ తీసివేయాలి. ఎంత ధర పెంచినా లిక్కర్ కొనుక్కునే స్థోమత ఉన్నవారికి ఉచిత పథకాలు ఎందుకు? ఉచితాలతో మిగిలిపోయిన సొమ్మును తాగుడుకు ఖర్చు పెడుతున్నారు.' అనే మాటలు ఆ పెద్దమనిషి అన్నట్లు దాదాపు అంతటికి చేరింది. చివరకు అది ఆయన దాకా వెళ్లింది.
'ఇది ఫేక్ న్యూస్. ఈ మాట నేను అనలేదు' అని రతన్ టాటా మీడియాకు తెలియజేసినా ఆ పోస్టు వైరల్ మాత్రం ఆగినట్లు లేదు. దానికి కారణం ఆ మాట ఎవరు అనినా చదివినవారు మాత్రం భలేగా ఉంది అనుకుంటారు. ప్రభుత్వ ఫ్రీలపై అది మాంచి వ్యంగ్యబాణం అని ఒప్పుకోవలసిందే. ఉచితాలు కుప్పలు తెప్పలైతే మన బతుకులు 'శ్రీలంకే' అని ఉన్నతాధికారులు ఏకంగా ప్రధాని మోడీతోనే విన్నవించుకున్నారు. ఎన్నికలలో లబ్ధి కోసం రాజకీయ నాయకుల ఉచిత పథకాలు రాన్రాను దేశ ఆర్థిక పరిస్థితికి గండి కొడతాయని ఆర్థికవేత్తలు మొత్తుకోబట్టి చాలా ఏండ్లే అవుతోంది. నాయకులు మాత్రం చెవిన పెట్టినట్లు కనిపిస్తలేదు. ఆర్థిక పరిపుష్టితో ఉన్న చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉచితాలు, రాయితీల వల్ల ఆర్థికంగా దెబ్బ తిని, అప్పులపాలై చివరకు తమ ఉద్యోగులకు వేళకు జీతాలివ్వలేని స్థితికి దిగజారిపోయాయి.
వైఎస్ పాదయాత్రతో
మన రాష్ట్రంలోని విద్యుచ్ఛక్తి శాఖనే తీసుకుంటే ప్రస్తుతం అది అప్పు తెచ్చి జీతాలు చెల్లిస్తోంది. కారణం వెతకాలంటే, 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో రైతులతో ఆయన 'కరెంటు బిల్లు చెల్లించకండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తొలి సంతకం కరెంటు బిల్లుల బకాయిలు మాఫీ ఫైలుపై చేస్తాను' అన్నారు. అన్నట్టుగానే చేశారు. అప్పటివరకు పేరుకు పోయిన రూ.1192 కోట్లను మాఫీ చేశారు. అలా చేసినప్పుడు అంతే సొమ్మును విద్యుచ్ఛక్తి శాఖకు చెల్లిస్తే బాగానే ఉంటుంది. కానీ, అలా జరగలేదు. 2004-05 లో రాష్ట్ర వ్యవసాయానికి అయిన కరెంటు ఖర్చు రూ.436 కోట్లు మొదలు ఈ మాఫీ అట్లాగే కొనసాగుతోంది. ఆ భారం ఇప్పుడు రూ.వేల కోట్లలోకి చేరింది. ప్రభుత్వం విద్యుచ్ఛక్తి శాఖకు చెల్లించవలసిన సబ్సిడీ బకాయిలు రూ.20 వేల కోట్ల దాకా ఉంటాయి. అందులో కొంతైన చెల్లించమంటే ఎక్కడైనా అప్పు తెచ్చుకోండి గ్యారంటీ ఉంటామంటోంది ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో కరెంటు శాఖ కష్టాలు గట్టెక్కేలా లేవు.
తప్పనిసరిగా మారిన హామీ
ఇలా తమ పబ్బం గడుపుకోవడానికి సజావుగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నాయకులు చిక్కులలోకి తోస్తున్నారు. 1990లో వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పంటరుణాల మాఫీ మొదలైంది. అప్పుడు దేశవ్యాప్తంగా మాఫీ చేసిన మొత్తం రూ.10 వేల కోట్లు. అదే మంత్రాన్ని 2009 ఎన్నికలలో కాంగ్రెస్ రెండోసారి గెలవడానికి ఆనాటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం 2008లో ఉపయోగించారు. అప్పుడు పడ్డ భారం రూ.60 వేల కోట్లు. బడ్జెట్ కేటాయింపులో నాలుగు విడతలుగా చెల్లిస్తామని బ్యాంకులకు హామీ ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం ఆఖరి విడతను మీ లాభంలో మినహాయించుకోండని అంది. క్రమంగా రైతుల రుణ మాఫీ ప్రతిసారి ఎన్నికలలో తప్పనిసరి హామీ అయిపోయింది. 'బ్యాంకు అప్పులు కట్టకండి. ఎన్నికలలో గెలిచాక మా ప్రభుత్వమే మీ అప్పులు తీర్చుతుంది' అనడం మామూలై పోయింది. ఏడాది రెండేండ్ల ముందు నుంచే ఈ ప్రచారం మొదలవ్వడంతో బ్యాంకుల అన్ని రకాల వసూళ్లు కుంటుపడుతున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా పంట అప్పు మాఫీ అవుతుందనే ఆశతో భూయజమానులు అవసరం ఉన్నా లేకున్నా బ్యాంకులలో పంట అప్పు తీసుకోని సొంతానికి వాడుకొని చెల్లించడం మరిచిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్నికల హామీ ప్రకారం బ్యాంకులకు చెల్లించగానే మళ్లీ అప్పు కోసం బ్యాంకుకు వెళుతున్నారు.
ఉచితాలు మంచివే అయినా
2004-14 మధ్యన ఉమ్మడి రాష్ట్రంలో పేదల కోసం 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నిర్మించింది. కొన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు ఇళ్లను పూర్తిగా ఉచితంగా ఈయకుండా కొంత భాగాన్ని సొంతంగా భరించమంది. అలా సాధ్యం కానివారికి సొసైటీలు లేదా బ్యాంకుల నుండి అప్పు ఇప్పించింది. ఇళ్లలోకి వెళ్లినవారిలో కొందరు ఆ అప్పు కిస్తీలు కూడా కడుతున్నారు. ఆ అప్పు మొత్తాన్ని అనగా రూ.3920 కోట్లను 2016లో ప్రభుత్వం మాఫీ చేసింది. నిజానికి ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలలో సామాన్య ప్రజలకు మేలు చేసేవి ఉన్నా ప్రభుత్వ ఖజానా భరించలేక పోతున్నదన్న విషయం దాచలేని నిజం. తలకు మించిన ఉచితాల భారం రాష్ట్రాన్ని అప్పులలో ముంచుతుంది. సమర్థవంతంగా ఉన్న వ్యవస్థలు కోలుకోని దెబ్బ తింటాయి.
అప్పుల భారం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితి లేక ప్రభుత్వాలు రాబడి పెరగడం కోసం ఇప్పుడు డిస్కౌంట్ పథకాలను ఆశ్రయిస్తున్నాయి. రేపటి రూపాయి కన్నా నేటి ఆఠానా, పావలాయే మహాభాగ్యమని స్థితి కనబడుతోంది. చాలామంది గృహస్తులు పట్టించుకోని ఆస్తిపన్ను వసూలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. కరోనాకు ముందు రెండేళ్లుగా టాక్స్ పై నెలవారీగా రెండు శాతం పెనాల్టీ వేయడంతో కట్టేవారు సకాలంలో కట్టడం మొదలైంది. ఇప్పుడు దానికి రివర్స్‌గా ప్రభుత్వం 2022-23 సంవత్సరపు ఆస్తి పన్ను ఏప్రిల్‌లో కడితే ఐదు శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఇది ఎవరూ ఊహించని రాయితీయే. పన్ను చెల్లించేవాడి కన్నా చెల్లించనివాడికే తొందరెక్కువుంది. తక్షణం ఖజానాకు డబ్బు జమకావాలంటే ఇలాంటి రాయితీలు తప్పవు మరి. జీహెచ్ఎంసీ పరిధిలోనే తొలి రెండు రోజులలో రూ.14 కోట్లు ఆస్తి పన్ను జమైందని తెలుస్తోంది.
చాలాన్ వసూలు
ఇలాంటిదే ఈ మధ్య మరో డిస్కౌంట్ పథకం మోటారు వాహనాల ట్రాఫిక్ చాలాన్‌ల వసూళ్లపై ప్రకటించి రాష్ట్రప్రభుత్వం మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. మార్చి ఒకటిన మొదలైన ఈ రిబేట్ స్కీమ్ ఏప్రిల్ 15న ముగిసింది. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న ఈ చలానాలకు రాయితీతో చెల్లించే అవకాశం ప్రభుత్వం వాహనదారులకు కల్పించింది. దీని వలన నెలన్నర వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.302 కోట్లు ప్రభుత్వ ఖజానాలో పడ్డాయి. ఈ రాయితీ ప్రకారం రెండు, మూడు చక్రాల వాహనదారులు పెనాల్టీలో 30 శాతం చెల్లిస్తే మిగితాది మాఫ్ అన్నమాట. అదే నాలుగు చక్రాల చిన్నా, భారీ వాహనాలకు 50 వాతం చెల్లిస్తే చాలు. మాస్కు ధరించనివారికి విధించిన వేయి రూపాయల జరిమానాను వందకు కుదించారు.
నిజానికి ఈ పెనాల్టీ సొమ్ము మొత్తం రూ.1015 కోట్లు అయినా డిస్కౌంట్ వల్ల రూ.302 కోట్లకు తగ్గింది. దంచినమ్మకు బుక్కిందే కూలి అన్నట్లు ట్రాఫిక్ అధికారులకు కొంత సంతృప్తి మిగిలింది. మొత్తం పెండింగ్ చలానాలు ఐదు కోట్లు కాగా మూడు కోట్ల చలానాలు వసూలు అయ్యాయి. మిగితా రెండు కోట్ల చలానాలకు ఎంత డిస్కౌంట్ ఇస్తారో చూడాలి. ఈ రకంగా మన ప్రభుత్వాలు దొరికినంత అప్పులు. అవసరానికి ఉచితాలు, ఖర్చులకోసం డిస్కౌంట్లు ఇంధనంగా సాగుతున్నాయి. మూడింటిలో లొసుగులున్నాయి. వాటిని సమన్వయం చేసుకొనే సమయం ఇంకా దాటిపోలేదు. పరిస్థితులు ఇలాగె ఉంటే రాబోయే కాలంలో వచ్చినకాడికి అమ్ముకున్నట్లుగా మరిన్ని రాయితీలు సర్కారు ప్రకటించక తప్పదేమో. ఎందుకంటే ఖజానాకు తక్షణ ధనకళ అవసరం.
బి.నర్సన్
9440128169