ఎగ్జిట్ పోల్ విశ్వసనీయతకు షాక్...!

by srinivas |   ( Updated:2024-06-18 00:15:40.0  )
ఎగ్జిట్ పోల్ విశ్వసనీయతకు షాక్...!
X

ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని కొన్ని సార్లు ఖచ్చితమైనవిగా మారకపోయినా, ఎక్కువ సందర్భాల్లో అవి ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలకు దాదాపు దగ్గరలో వుండడం ఓ ఆనవాయితీగా కొనసాగేది. ఐతే ఈ సాంప్రదాయానికి భిన్నంగా పద్దెనిమిదవ లోకసభకు జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఎన్నికల వ్యూహకర్తలతో పాటు ప్రముఖ పత్రికలూ, ప్రసార సాధనాలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఘోరంగా విఫలమవడం తెలిసిందే. తమ అంచనాలకు ప్రాతిపదికలుగా ఏయే అంశాలను పరిగణన లోనికి తీసుకున్నారో గానీ ఎగ్జాక్ట్ ఫలితాల వెల్లడి తర్వాత సదరు అంచనాలన్నీ సత్యదూరమైనవిగా రుజువయ్యాయి. దీంతో ఎగ్జిట్ పోల్ విశ్వసనీయతే ప్రశ్నార్థకమైపోయింది.

ఎగ్జిట్ పోల్ అంచనాలను ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు తలకిందులు చేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల వ్యూహకర్త ఎన్నికల ఫలితాల సరళిని అంచనా వెయ్యడంలో వైఫల్యం చెందినందుకు బాధగా వుందంటూ పశ్చాత్తాపపడడం, మరో ప్రముఖ పత్రికా సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి టెలివిజన్ ఛానెల్లో వెక్కివెక్కి ఏడ్వడం, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకూ, సినిమా రంగంలో సెలబ్రిటీలకూ జోస్యం చెప్పే ఓ ప్రముఖ జ్యోతిష్యుడు ఇక నుండి ఎన్నికల్లో గెలుపు, ఓటములకు సంబంధించిన అంచనాల జోలికి వెళ్లనని లెంపలేసుకోవడంతో పాటు, ఇతర అనేక చిన్నా, పెద్ద సర్వే సంస్థల అధిపతులు మీడియాకు అందనంత దూరంలో అజ్ఞాతంలోకి వెళ్ళడం కొసమెరుపు.

సెఫాలజీ వైఫల్యమేనా?

ఎన్నికలలో కౌంటింగ్ తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లతో గెలిచి అధికారాన్ని చేపడుతుందో, ఏ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్షంలో కొనసాగుతుందో సంభావ్యతా సిద్ధాంతం ఆధారంగా అంచనా వేయడానికి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనమే ఎగ్జిట్ పోల్. ఈ ప్రక్రియను గతంలో ఆయా రాజకీయ పార్టీల పెద్ద నేతలకు వారికి భవిష్యత్తును తెలియ జేసే స్వాములూ, జ్యోతిష్కులూ చేపట్టే వారు. ఐతే ఈ మధ్య కాలంలో ఎన్నికల వ్యూహకర్తలూ, సెఫాలజిస్టులతో పాటు, వివిధ మీడియా సంస్థలు ఈ ప్రక్రియలో పాలుపంచుకోవడం విశేషం. ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్‌తో పాటు పోలింగ్‌లో పాలుపంచుకున్న ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుండి తిరిగి ఇండ్లకు వెళ్ళే క్రమంలో వారిలో కొంతమందిని శాంపిల్‌గా తీసుకుని వారి హావభావాలను, అభిప్రాయాలను శాస్త్రీయంగా పరిశీలించి, విశ్లేషించి, మదించి తద్వారా వారు ఏ రాజకీయ పార్టీకి తమ ఓటును వేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించే ఓ నిష్పక్షపాతమైన, శాస్త్రీయమైన అధ్యయన విధానమే ఎగ్జిట్ పోల్.

మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు 'అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే భాజపా నినాదాన్ని సమర్థిస్తూ ఆ పార్టీ స్వంతంగా 350 పై చిలుకు స్థానాలలో గెలుపొందుతుందని, అదే విధంగా ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు ఇతర హిందీ బెల్టులోని కీలక రాష్ట్రాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడమే కాకుండ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సైతం అంచనాలకు మించి ఆశ్చర్య కరమైన ఫలితాలను సాధిస్తుందని ఘంటాపధంగా చెప్పడం గమనార్హం. తీరా ఓట్ల లెక్కింపు జరిగి వెల్లడయిన ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు... ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేసేశాయి

తప్పు అంచనాలకు కారణాలేమిటి ?

ఈ అనూహ్యమైన అంచనాలకు కారణమేమిటి? అధికార పార్టీ బలప్రయోగమా? అంబానీ, ఆదానీల నిర్వహణలో కొనసాగుతున్న ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థల అనుచిత ప్రభావమా? లేదా మనదేశాన్ని గత పదేళ్లుగా పాలించిన పాలకపక్ష నాయకుడు తమ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను సాధారణమైన మనిషిని కాదని, ఆ దేవుడి చేత దేవ లోకంలో ప్రత్యేకంగా సృష్టించబడి ఈ దేశ ప్రజల కోసం కానుకగా పంపించబడిన దేవదూతనని చేసిన ప్రకటన కారణమా? లేదా అయోధ్యలో బాల రాముడి ప్రతిష్టాపన కన్నా ముందూ, తర్వాత అయోధ్య నుండి దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు పంపించిన అయోధ్య రాముడి అక్షింతలే నాలుగు వందలకు పైగా ఎంపీ స్థానాలను గెలిపిస్తాయనే అచంచల విశ్వాసమా? హిందువుల బంధువుగా తన విశ్వరూపాన్ని చూసి ముగ్దుడైన పూరీ జగన్నాథుడే తనను అభిమానిస్తాడు, ఆరాధిస్తాడంటూ దేవుడి కన్న తానే గొప్ప వాడినంటూ దేశ ప్రధాని ఒడిశాలో ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకున్న విభ్రాంతికర సంఘటన ప్రేరేపితమా? ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేస్తే ఈ దేశ సంపదనంతా ముస్లింలకే పంచి పెడతాయనీ, చివరకు మీ భార్యల తాళి బొట్లను సైతం అమానవీయంగా లాక్కుంటాయంటూ చేసిన ఎన్నికల ప్రసంగాల్ని విశ్వసించి దేశంలోని హిందువులంతా కట్టగట్టుకుని బీజేపీని, దాని మిత్ర పక్షాలను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారనే అతి నమ్మకమా?))

స్టాక్ మార్కెట్ ఘోరపతనం

ప్రధానంగా ఎన్డీఏ కూటమికి ఈసారి 400కి పైబడిన సీట్లు వస్తాయన్న ప్రచార ఊదర పట్ల కోట్ల సంఖ్యలో రిటైల్ మదుపరులు ఆకర్షితులై లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. తదనంతరం 48 గంటల లోపే ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులై దేశ స్టాక్ మార్కెట్ కుప్పకూలటం జరిగింది. దీన్ని డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు అభివర్ణించడం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనిపై జాయింట్ పార్ల మెంటరీ కమిటీతో సమగ్ర విచారణ జరిపించాల్సిందే అంటూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి ఇండియా కూటమి నాయకులు చేస్తున్న డిమాండ్ పట్ల కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొలువు తీరబోతున్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

డాక్టర్ నీలం సంపత్,

విశ్రాంత ప్రిన్సిపాల్

98667 67471

Advertisement

Next Story

Most Viewed