ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. జగనన్నో... జగనన్న ..

by Ravi |   ( Updated:2023-04-05 00:46:14.0  )
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. జగనన్నో... జగనన్న ..
X

ఆంధ్రప్రదేశ్‌‌లో గడపగడపకు వెళ్లినా, ఏ తాతను, ఏ అవ్వనడిగినా, ఏ అక్కను, ఏ అన్నను పలకరించినా... వారి మాటల్లోని బాధను, రెండు మాటల్లో కూడగడితే ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. జగనన్నో...జగనన్న’’ అనే వినపడుతున్నది! కారణం, గత నాలుగేళ్ల వైస్సార్సీపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కరెంటు వంటి అత్యవసరాలు మొదలు పప్పు నుంచి ఉప్పు వరకు నిత్యావసరాల ధరలన్నీ ఆకాశం వైపే పరుగులు తీస్తున్నాయి. బటన్‌ నొక్కి కుడిచేతితో పది రూపాయిలు ఇవ్వటం, ధరలు పెంచి ఎడమ చేయితో వంద రూపాయిలు లాక్కోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది. జగనన్న అమ్మఒడి, జగనన్న దీవెన, జగనన్న కానుక అంటూ పథకాల గురించి చెప్తే సరిపోదు, జగనన్న కంది పప్పు, జగనన్న బియ్యం, జగనన్న నూనె, జగనన్న పంచదార, జగనన్న కరెంటు బిల్లు, జగనన్న పెట్రోల్‌, జగనన్న డిజిల్ మొదలైన నిత్యవసరాల పెరిగిన ధరల గురించి కూడా చెప్పుకుంటే పారదర్శకంగా, ఆదర్శంగా ఉంటుంది!

గన్‌ మోహన్‌ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉండి, పాదయాత్ర చేస్తున్నప్పుడు నాటి టీడీపీ ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టనుందని అందులో భాగంగానే పెట్రోల్‌ ధరలు, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యవసరాల ధరలన్నీ పెంచేస్తున్నారని ఊరు, వాడ ప్రచారం చేశారు. నేను వస్తున్నాను, వచ్చాక తగ్గిస్తానని ప్రతి ఊరి చౌరస్తాలో హామీ ఇచ్చుకుంటూ వెళ్లారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి, మడమ తిప్పి... రోజురోజుకీ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని చెప్పి, ధరల్ని పరుగులు పెట్టిస్తున్నారు.

2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి కేజీ బియ్యం ధర 38 రూపాయలు కాగా, ఇప్పుడు అది 55 రూపాయిలకు పెరిగింది. నాడు 80 రూపాయిలు ఉన్న కేజీ వంట నూనె ధర ఇప్పుడు 200 రూపాయలకు చేరింది. నాడు 75 రూపాయలు ఉన్న కేజీ కందిపప్పు నేడు 120 రూపాయలు అయ్యింది. నాడు 52 రూపాయలు ఉన్న పెసరపప్పు నేడు 150 రూపాయలకు పెరిగింది. 65 రూపాయలు ఉన్న సెనగపప్పు 75 రూపాయలు అయ్యింది. నాడు 26 రూపాయలు ఉన్న పంచదార దాదాపు రెట్టింపయింది. 48 రూపాయలు ఉన్న బెల్లం, 80 రూపాయలు అయ్యింది. నాడు 120 రూపాయలు ఉన్న చింతపండు 400 రూపాయల మార్క్‌ తాకింది. ఇక, కూరగాయల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాడు 200 రూపాయలు పట్టుకొని మార్కెట్‌‌కి వెళ్తే సంచినిండా వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి, నేడు 500 కూడా సరిపోవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అల్లం నుంచి బెల్లం వరకూ ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువు ధరను జగన్‌ మోహన్‌ రెడ్డి మడిమ తిప్పి మరీ పెంచేశారు.

పగబట్టిన ప్రభుత్వాలు..

ఇక, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు చూస్తే అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పగబట్టినట్టే పెంచుకుంటూ పోతున్నాయి. 2019లో 76 రూపాయలు ఉన్న పెట్రోల్‌ ధర, ఇప్పుడు 110 రూపాయలు దాటింది. 65 రూపాయలు ఉన్న డీజిల్‌ ధర వంద రూపాయిలయ్యింది. 730 రూపాయలు ఉన్న ఎల్పీజీ గ్యాస్‌ ధర 1062 రూపాయలు అయ్యింది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ధరలు ప్రతీనిత్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈ ధరలపై ఈ నాలుగేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యమం కూడా చేసిన పాపాన పోలేదు. కేసుల భయంతో టీడీపీ నేతలు ఈ ధరల పెంపుపై ఒక్క మాట మాట్లాడకపోవడం ప్రజలను మోసగించడమే.

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2019 లో అధికారంలో వచ్చేనాటికి పేదవారికి ఇంటికి 200 నుంచి 300 రూపాయల కరెంటు బిల్లు వస్తే, ఈ రోజు అది 500 నుంచి 800 వరకు చేరింది. వీటన్నింటికి తోడు జగనన్న పెంచిన ఇంటి పన్ను, కొత్తగా వేసిన చెత్త పన్ను అదనం. 10 వేలకు వచ్చే లారీ ఇసుకకు, ఇప్పుడు 40 వేలు పెడితే గానీ రావడం లేదు. సంపూర్ణ మద్య నిషేధం పేరిట అధికారంలోకి వచ్చి, అది అమలు చేయకుండా 60 రూపాయిల క్వార్టర్‌ మద్యం, ఏకంగా రూ. 160 అమ్ముతూ వ్యాపారానికి తెరలేపింది. పైగా అది ఏ బ్రాండో అర్థం కాదు. అది ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న లిక్కరో, చీప్‌ లిక్కరో కూడా తెలియదు.

‘‘ఆఖరికీ పేదవాడికి అందుబాటు రేటులో వినోదం అందించాలని సినిమా టికెట్‌ ధరలు తగ్గిస్తే, అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఇలాంటి వాళ్లంతా యాంటీ పూర్‌’’ అని కామెంట్‌ చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి,

ఆ నిర్ణయం తీసుకున్న మూడు నెలలకే, యూటర్న్‌ తీసుకొని అమాంతం టికెట్‌ ధరలు పెంచేశారు. పేదల కోసం టికెట్‌ ధరలు తగ్గించామని చెప్పిన ప్రభుత్వం, మళ్లీ ఎందుకు పెంచింది? మూడు నెలల్లోనే పేదలంతా ధనవంతులయ్యారా? దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించిన జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే క్లాస్‌ వార్‌ గురించి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అందుకు, ఆయన పేదవాళ్ల నిత్యావసరాల విషయంలో తీసుకుంటున్న తుగ్లక్‌ నిర్ణయాలే నిదర్శనం.

లాభనష్టాల లెక్కలొద్దు..

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా ఇష్టారీతిన ఈ నిత్యావసరాల ధరల పెరుగుదల వల్ల సామాన్యుల నెల ఖర్చు 50 శాతం పెరిగింది. కానీ, వారి ఆదాయం మాత్రం 20 శాతం కూడా పెరగని దుస్థితి! నీళ్లు, రోడ్లు, రవాణా సౌకర్యాలు, కరెంటు, ఇంధనం, వంటనూనె మొదలైనవన్నీ ప్రజా అవసరాలు. వీటిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల ప్రథమ బాధ్యత. కానీ, రాష్ట్రంలో పోలవరం లాంటి సాగునీటి ప్రాజెక్టులకు దిక్కులేదు. గుంతలు పడ్డ రోడ్లను కనీసం పూడ్చే గతి లేదు. ఆర్టీసీ బస్సెక్కితే చార్జీల మోత మోగిస్తున్నారు. నెలనెలా కరెంట్‌ బిల్లు ముట్టుకుంటేనే షాక్‌ కొడుతున్నాయి.

ప్రజల కనీస అవసరాల విషయంలో ప్రభుత్వం లాభనష్టాలను చూడకూడదు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి వ్యాపార దృక్పథం లేకుండా వాటిని ప్రజలకు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. వీటిని అందించే సంస్థలకు లాభాలు వస్తేనే ప్రజలకు అందిస్తామంటే కుదరదు. నీటి సరఫరా వ్యవస్థను నిర్వహించే సంస్థకు లాభం వస్తేనే నీళ్లు ఇస్తామని, కరెంట్‌ పంపిణీ సంస్థలకు లాభం వస్తేనే కరెంట్‌ ఇస్తామని, ఆర్టీసీ లాభాలు తేస్తేనే బస్సులు నడుపుతామని ప్రభుత్వాలు అనడానికీ వీల్లేదు. వాటి నిర్వహణ ఖర్చుల కోసం కొంత వరకు పన్నుల రూపంలో వసూలు చేసుకోవచ్చుగానీ, లాభం వస్తేనే ఇస్తామంటే కుదరదు.

కరెంటు, వంట గ్యాస్‌ వంటి తప్పనిసరి ప్రజావసారాలు, ఐస్‌ క్రీం, కారులాంటి విలాస వస్తువులు కాదు. కొనుక్కోగలిగిన వాళ్లు కొనుక్కుంటారు, లేనివాళ్లకు దక్కవనే వస్తువులు కాదివి. ప్రజా అవసరం అంటున్నామంటే నిరంతరం ప్రభుత్వం వాటిని ఫ్రీగా ఇవ్వాలని కూడా కాదు. ఆ ఉమ్మడి ఆస్తి ఉత్పత్తికి అయ్యే ఖర్చును రాబట్టుకోవడం ఆ రంగం నుంచి సాధ్యం కాకపోయినా, ఇతర రంగాల నుంచి వచ్చిన పన్నులను ఆ రంగానికి సబ్సిడీ రూపంలో తరలించడం ప్రభుత్వ బాధ్యత. ఇవ్వగలిగినవాళ్ల నుంచి ఎక్కువగా వసూలు చేసి, ఇవ్వలేనివాళ్లకు చవకగా సరఫరా చేయొచ్చు. దీనినే క్రాస్‌ సబ్సిడీ అంటాం. మొత్తంగానే కొంత సబ్సిడీ ఇతర ఆర్థిక రంగాల నుంచి తరలించి ఇవ్వొచ్చు. ఇలా కాకుండా అందరూ సమానంగా భరించాలనడం ప్రజా అవసరాల విషయంలో తప్పే అవుతుంది. ఎందుకంటే, ప్రభుత్వం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే గానీ, వ్యాపారం చేయడానికి కాదు!

ఇది వ్యాపార బుద్ధి కాదా?

సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉన్నప్పుడే రాష్ట్రంలో తలసరి ఆదాయం మెరుగవుతుంది. పరిశ్రమలు రాక, అభివృద్ధి లేక రాష్ట్రం తలసరి ఆదాయం మెరుగుపడని వేళ, మింగుడుపడని విధంగా జగన్‌ ప్రభుత్వం పెంచుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఐదు కోట్ల ఆంధ్రులను మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టి ధరలు తగ్గించడానికి తక్షణ ప్రణాళికలు రూపొందించకపోతే, రాబోయే ఎన్నికల్లో ప్రమాదకరమైన ప్రజా నిర్ణయం ఎదుర్కోవడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉండాలి.

- సుంకర పద్మశ్రీ

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఏపీసీసీ

9848654450

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed