ధరణిని తిరగదోడితేనే పరిష్కారం!

by Ravi |   ( Updated:2024-02-03 01:00:58.0  )
ధరణిని తిరగదోడితేనే పరిష్కారం!
X

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై వచ్చిన ఆరోపణలు ఎక్కువగా నిషేధిత జాబితాలోకి తమ పట్టా భూములు చేర్చడంపై వచ్చినవే అనడంలో సందేహమే లేదు. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా అంటే ఏమిటి, వాటిపై కాలానుగుణంగా వెలువరించిన హైకోర్టు తీర్పులు, అందుకు అనుగుణంగా ప్రభుత్వం వారు జారీ చేసిన మార్గదర్శకాలను పరిశీలించాలి.

రిజిస్ట్రేషన్ చట్టం 1908 లో యాక్ట్ ఆఫ్ 1999 ప్రకారం ఏవైనా ఆస్తులు (భూములు) పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉంటే అట్టివాటిని రిజిస్టర్ చెయ్యకుండా తిరస్కరించవచ్చని సెక్షన్-22-ఏ నిబంధనను చట్టంలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సెక్షన్ 22-ఏ (1) (ఎ)లోని క్లాజెస్ ఏ నుండి ఇ వరకు పేర్కొన్న భూములపై రిజిస్ట్రేషన్‌లపై నిషేధం విధించారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే

ప్రభుత్వాలు తమకు చెందిన భూములపై ఇతరులకు హక్కు కల్పించకుండా, వాటిని పరిరక్షించేందుకు, చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి లావాదేవీలూ జరగకూడదనే ఉద్దేశంతోటే పై నిబంధనలు విధించారు. అయితే వీటిని వ్యతిరేకిస్తూ, చాలామంది హైకోర్టును ఆశ్రయించినా, కోర్టు ఈ నిబంధనలనే సమర్థించింది.

అయితే యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత సెక్షన్ 22-ఏకు సంబంధిత జాబితాను జిల్లా కలెక్టర్లు రూపొందించి, వాటిని డ్రాఫ్ట్ పబ్లికేషన్ ద్వారా అభ్యంతరాలను కోరినారు. కానీ వాటిని ఫైనల్ గా నోటిఫై చేయకపోవడం, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లోని భూములపై రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ నిరాకరించడం, వాటిపై కలెక్టర్ల నుంచి ఎన్ఓసీ కావాలని కోరడంతో న్యాయంగా ఉన్న తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో ఎన్ఓసీ కోసం ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. నిషేధిత జాబితా సరి అయినదా లేదా అన్న విషయం, అటు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కాని, ఇటు రిజిస్ట్రేషన్ విభాగం వారు పట్టించుకోవడంతో, వాటికి సంబంధించిన యజమానులు నానా తంటాలు ఇప్పటికీ పడుతున్నారు.

భూమి అమ్ముకోలేని వారి గోస

ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2017లో చేపట్టిన ల్యాండ్ రికార్డ్ ఆప్డేషన్‌లో తమ శాఖకు చెందిన భూముల వివరాలను ప్రోహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టమని, అంతేగాక, ఆ శాఖకు చెందిన భూములుగా రెవెన్యూ రికార్డ్స్ అప్‌డేట్ చేయమని, దేవదాయశాఖ, వక్ఫ్ బోర్డ్, భూదాన్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు జాబితాను మాత్రమే పంపడం, వాటిని యధావిధిగా ప్రోహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. LRUPలోని జాబితాను ఎవ్వరు సూపర్‌వైజ్ చేయకపోవడంతో యధావిధిగా ధరణి పోర్టల్‌కు ఆప్లోడ్ చెయ్యడం దానికి CAR లోని జాబితాను కూడా ట్యాగ్ చేయడంతో నిషేధిత జాబితా మరింత గందరగోళానికి దారి తీయడం జరిగింది. ప్రభుత్వం సేకరించిన వాటిని తిరిగి పట్టా భూములుగా నమోదు చేయడం ఈ విధంగా రకరకాలుగా నిషేధితపు జాబితా తయారు చేయడం, న్యాయపరంగా ఉన్న అన్యాయంగా చేర్చిన వాటిని తొలగించడానికి రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అవసరానికి భూమి అమ్ముకోవడానికి వీలు లేకపోవడంతో భూ యజమానుల గోస అంతా ఇంతా కాదు. అందుకే ధరణి పోర్టల్‌లో సుమారు 30 శాతం నుండి 40 శాతం వరకు నిషేధిత జాబితాకు సంబంధించినవి ఉంటాయి.

నిషేధిత జాబితా- పరిష్కార మార్గాలు

ధరణిలో సాంకేతిక పరంగా జరిగిన లోపాలు ప్రతి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా ఈ లోపాలను సరిచేయడానికి సుమోటోగా జిల్లా స్థాయిలోకాక కమిటీ వేసి, రికార్డ్‌లను పరిశీలించి, తామే వాటిని తొలగిస్తూ ఒక స్పీకింగ్ ఆర్డర్‌ ద్వారా) ధరణి పోర్టల్‌లో మార్పులు చేయవచ్చు. లేదా అట్టి గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి, అవి ఏ డాక్యూమెంట్స్‌ను బేస్ చేసుకొని (అన్ని శాఖల వారు) నిషేధితపు జాబితాలోని చేర్చడం జరిగినది. అన్ని విషయాలు బాధితులకు వివరించి వాటిపై డాక్యూమెంట్స్ ఆధారంగా బాధితుల నుంచి స్వీకరించి, వాటికి సంబంధిత తహసీల్దార్, R.D.O, అడిషినల్ కలెక్టర్‌లతో కూడిన కమిటీ పరిశీలించి, తగు నిర్ణయం తీసుకొని జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసి నిజంగానే అది తప్పుగా నమోదు అయితే IGRS వారితో వాటిని తొలగించడానికి ధరణి పోర్టల్‌లో కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొనలేకపోతే అది కూడా ఒక speaking order ద్వారా తెలియజేయాలి. వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్‌ని ఏర్పర్చి వారికి రెఫర్ చేసుకునే వీలుగా అవకాశం కల్పించాలి. దీని వలన ధరణిలో సుమారు 30-40 శాతం వరకు ఉన్న సమస్యలు తొలిగిపోతాయని ఆశాభావం.

-సురేష్ పొద్దార్

విశ్రాంత సంయుక్త కలెక్టర్

80080 63605

Advertisement

Next Story

Most Viewed