ప్రభుత్వ టీచర్లపై బైండోవరా?

by Ravi |   ( Updated:2023-03-28 01:01:10.0  )
ప్రభుత్వ టీచర్లపై బైండోవరా?
X

తప్పు చేసి ఒకసారి శిక్ష అనుభవించినప్పుడు అదే తప్పుకు మళ్ళీ శిక్ష వేయరాదు. భారతదేశ అత్యున్నత స్థాయి చట్టాల సంకలనం రాజ్యాంగం చెబుతున్న మాట ఇది! తరచూ నేరాలకు పాల్పడే దోషులను కట్టడి చేయడానికి పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అదే కోణంలో ఇప్పుడు మరి నాలుగడుగులు ముందుకేసి అత్యుత్సాహం చూపారు ఒక విద్యాశాఖ అధికారి. ఉపాధ్యాయులను నేరగాళ్లుగా ముద్రవేసి పోలీసులకు అప్పగించబూనడం సామాజిక ద్రోహం. నంద్యాలలో గత ఏడాది పదో తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షా పత్రాలను లీక్ చేశారనే నెపంపై ఎనిమిది మందిని గుర్తించింది. వారిపై పలు రకాలైన చర్యలు అమలయ్యాయి. మళ్లీ ఇప్పుడు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఆ సదరు టీచర్లు పరీక్షలు జరిగినన్ని రోజులూ స్థానిక పోలీసు స్టేషన్లో ఉండాలని బైండోవర్ చేయడం నీతి బాహ్య చర్య. పైగా నాకు ఉపాధ్యాయుల పట్ల ఎనలేని గౌరవం ఉందంటూ, పోలీసు స్టేషన్ లో వద్దు... ఎమ్మార్వో కార్యాలయంలో ఉంటే చాలు అని సంబంధిత గౌరవ మంత్రిగారు ముక్తాయింపు ఇచ్చారు. ఎమ్మార్వో కార్యాలయం అంటే మెజిస్టీరియల్ పవర్స్ ఉండేది. పోలీస్ స్టేషన్ కంటే అధిక గ్రావిటీ ఉండేది. పోలీస్ స్టేషన్ అంటే. కేవలం విచారణ స్థాయి కలిగింది. ఎమ్మార్వో కార్యాలయం శిక్షను ఖరారు చేసే స్థాయిగల న్యాయస్థానం. మరి ఈ చర్యలు సహేతుకమేనా? ఈ విధానం రాజ్యాంగ బద్దమా? గతంలో ఒక మంత్రికి చెందిన విద్యా సంస్థ నుంచి ప్రశ్నపత్రాలు బయటకు పొక్కాయి. సాధారణ చర్యలతో కేసు మూసేసారు. కానీ ఉపాధ్యాయులను మాత్రం వేపుకు తింటున్నారు.

ఎవరో గడ్డి తినేవారు తప్ప ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారెవరూ అలాంటి చర్యలకు పాల్పడరు. ఉపాధ్యాయ వృత్తి చాలా సున్నితమైనది. గౌరవప్రదమైనది. సమాజానికి మార్గనిర్దేశం చేసేది. విలువలకు నిలయమైనది కూడా! అలాంటి వృత్తికి చేజేతులా ప్రభుత్వమే కళంకమాపాదిస్తుంటే స్పందించాల్సిన వారు చోద్యం చూస్తున్నారు. ప్రతిఘటించాల్సిన గొంతుకలు మూగనోము పాటిస్తున్నాయి. భారత శిక్షాస్మృతిని ఉపాధ్యాయులపై ప్రయోగించడం అనైతికం. అక్కడి జిల్లా విద్యాశాఖాధికారి చర్యలను ఏపిటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది.

మోహన్ దాస్,

ఏపిటిఎఫ్ 1938.

94908 09909

Advertisement

Next Story

Most Viewed