- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇదీ సంగతి: సింగరేణికి కష్టం వచ్చింది!
వేలంలో కాకుండా గతంలో మాదిరి బ్లాకులను కేటాయించాలని సింగరేణి డిమాండ్ చేసింది. అయినా పెడచెవిన పెట్టిన కేంద్రం సింగరేణి కోరిన తెలంగాణలోని ఒక బ్లాక్‌ను ప్రైవేట్ సంస్థకు కేటాయించి, మిగిలిన మూడు బ్లాకులను వేలంలో పెట్టింది నిజం కాదా? దీనిని ప్రైవేటీకరణ కాకుండా ఏమంటారు? ఇలా లాభాలలో ఉన్న బొగ్గు సంస్థను ప్రైవేటీకరించడం న్యాయమా? సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నది. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు అడుగుతున్నారు. బుద్ధిజీవులు, కార్మికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో రకాలుగా తెలంగాణకు నష్టం కలిగించే కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మా బొగ్గు బ్లాకులు మాకే ఇవ్వాలి. కార్మికుల మనోభావాలను గౌరవించాలి.
సింగరేణిని ప్రభుత్వ రంగంలోనే ఉండే విధంగా కాపాడుకుందాం. సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిది. తెలంగాణ నిరుద్యోగులకు కొంగు బంగారం. అలాంటి సింగరేణికి(Singareni) కష్టం వచ్చింది. కేంద్రం విధానాల కారణంగా ఇప్పటికే రైల్వే, పోర్ట్, ఎయిర్ పోర్ట్, బీఎస్ఎన్ఎల్, ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మనకు కాకుండా పోయాయి. కేంద్రం ఇప్పుడు బొగ్గు సంస్థలను దెబ్బ తీసే పనిలో పడింది. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విధంగానే 'ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి' అన్నట్టుగా తయారైంది పరిస్థితి. 2025 నాటికి బొగ్గు సంస్థలను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలు సాగుతున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసేది మన దేశమే.
దేశంలోని 82 శాతం విద్యుత్ ఉత్పత్తికి అవసరం అయిన బొగ్గును సరఫరా చేస్తున్న కోల్ ఇండియాను(Coal India) బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో నిర్వీర్యం చేస్తున్నది. ఇప్పటికే 33 శాతం షేర్‌లను అమ్మేసారు. ఇప్పుడు తాజాగా 10 నుంచి 15 శాతం అమ్మాలనుకుంటున్నారు. పైకి 5 నుంచి 10 శాతం అంటున్నా నిజానికి 15 శాతం అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనితో మొత్తం 48 శాతం ప్రైవేటీకరణ అన్నమాట. కోల్ ఇండియా, సింగరేణి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలలో 20 యేండ్ల నుంచి లాభాలలో ఉన్నాయి. అసలు ప్రభుత్వ రంగం అంటేనే మంచి అభిప్రాయం లేని పీఎం నరేంద్ర మోడీ నజర్ బొగ్గు సంస్థల మీద పడింది.
కోట్లు గడించేందుకేనా?
2015లో కోల్ ఇండియాలో 10 శాతం షేర్‌లు అమ్మి రూ.2,300 కోట్లు గడించే ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు కొత్తగా మరో 10 నుంచి 15 శాతం అమ్మకానికి రెడీ అవుతున్నారు. దీని ద్వారా రూ.5,300 కోట్లు ఆర్జించాలనుకుంటున్నారు. 500 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనుకుంటున్నారు. వేలంలో బ్లాకులు తీసుకున్నవారు గతంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఎక్కువ ఖర్చు అవుతుందని అంటే బడ్జెట్‌లో రూ. 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అదే కోల్ ఇండియా, సింగరేణికి బ్లాకులకు కేటాయించినపుడు సొంత నిధులతోనే వసతులు సమకూర్చుకునేవారు. మరి ప్రైవేట్‌వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడాన్ని ఏమనాలి? నిజానికి కార్పొరేట్‌లు ఏ రోజు నుంచి అయితే పెట్టుబడులు పెడుతారో, అదే రోజు నుంచి లాభాలు ఆశిస్తారు.ఇప్పుడు బొగ్గు బ్లాకుల విషయంలోనూ అదే జరుగుతోంది.
కోల్ ఇండియాలో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న 160 గనులను 'నేషనల్ అసెట్ మానిటైజేషన్ పాలసీ' కింద ప్రైవేట్‌వారికి ఇచ్చేసే ఆలోచన కూడా కేంద్రానికి ఉందని, ఆ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఇప్పటికే 20కి పైగా గనులను ప్రైవేట్‌కు ఇచ్చేసారు. కేంద్రం అన్ని దిక్కులా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్నదనడానికి ఇది సంకేతం.
Also read: సింగరేణికి సదా అన్యాయం!
కార్మికుల హక్కులకు గండం
2030 నాటికి దేశానికి 1.3 బిలియన్ నుంచి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. అంటే, ఇప్పుడు చేస్తున్న ఉత్పత్తికి మరో 63 శాతం అదనంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇదంతా ప్రైవేట్‌వారికి ఇచ్చేసే కుట్రకు తెర లేపింది కేంద్రం. రానున్న రోజులలో కొత్తగా వచ్చే ప్రాజెక్టులన్నీ ఔట్ సోర్సింగ్‌లోనే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. పరిశ్రమలను పరిశ్రమలుగా చూసే పరిస్థితి ప్రస్తుతం లేదు. బొగ్గు సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ఉంచడం సబబు.
ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఉండవు. వేజ్‌బోర్డులు ఉండవు. చట్టాలు, మైనింగ్ రూల్స్ పని చేయవు. జూలై 2021 నుంచి అమలు కావలసిన బొగ్గు గని కార్మికుల 11 వ వేతన ఒప్పందానికి ఇప్పటికీ అతీగతీ లేదు. జేబీసీసీఐ-11 చర్చలలో కనీసం జీతం పెంపుదల గురించి చర్చలే జరుగలేదు. యూనియన్‌లు అడుగుతున్న 35 శాతం పెంపుదలను ఇచ్చేదే లేదంటుంది ప్రభుత్వం. దేశానికీ వెలుగును అందిస్తున్న ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలను తన విధానాలతో కేంద్రం దెబ్బతీయడాన్ని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సింగరేణి కూడా ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి, సంస్థ గుర్తించిన 50 బొగ్గు బ్లాకులను వేలంలో కాకుండా గతంలో మాదిరిగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: ఆ రెండు బొగ్గు గనుల వలన సింగరేణికి నష్టమేనా?
మా గనులు మాకే ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ పరిధిలో భద్రాచలం వద్ద గోదావరి తీరాన్ని ఆనుకుని చింతలపూడి ప్రాంతంలో 18 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. వీటన్నింటినీ వేలం పెట్టనున్నారు. ఇటీవల పీఎం నరేంద్ర మోడీ రామగుండానికి వచ్చినపుడు సింగరేణి ప్రైవేటీకరణ (Singareni privatization) అనేది జరగదన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపు మీద మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు. వేలం అంటేనే ప్రైవేటీకరణ కదా! ఈ వాస్తవాన్ని పీఎం ఎందుకు విస్మరించారో తెలియదు. సింగరేణికి మరో 150 యేండ్ల భవిష్యత్తు ఉంది. సింగరేణి బోరింగ్ డిపార్ట్‌మెంట్ (అన్వేషణ విభాగం) గోదావరి తీరంలో ఇప్పటికీ 10 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించింది. వేలంలో కాకుండా గతంలో మాదిరి బ్లాకులను కేటాయించాలని సింగరేణి డిమాండ్ చేసింది. అయినా పెడచెవిన పెట్టిన కేంద్రం సింగరేణి కోరిన తెలంగాణలోని ఒక బ్లాక్‌ను ప్రైవేట్ సంస్థకు కేటాయించి, మిగిలిన మూడు బ్లాకులను వేలంలో పెట్టింది నిజం కాదా? దీనిని ప్రైవేటీకరణ కాకుండా ఏమంటారు?
ఇలా లాభాలలో ఉన్న బొగ్గు సంస్థను ప్రైవేటీకరించడం న్యాయమా? సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నది. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు అడుగుతున్నారు. బుద్ధిజీవులు, కార్మికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో రకాలుగా తెలంగాణకు నష్టం కలిగించే కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మా బొగ్గు బ్లాకులు మాకే ఇవ్వాలి. కార్మికుల మనోభావాలను గౌరవించాలి.
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223