న్యూ ఇయర్ వేడుకల్లో విశృంఖలత్వం వద్దు..!

by Ravi |   ( Updated:2024-12-31 00:45:55.0  )
న్యూ ఇయర్ వేడుకల్లో విశృంఖలత్వం వద్దు..!
X

నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచం సమాయత్తమవుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మతాలు, ప్రాంతాలు, దేశాలకతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే విశ్వవ్యాప్త పండగ. అయితే, సంస్కృతి సాంప్రదాయానికి నిలయమైన భారతదేశంలో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే సాంప్ర దాయ బద్ధంగా జరుపుకోవడానికి మెజారిటీ ప్రజలు మొగ్గు చూపించే వారు. కానీ, గత కొంత కాలంగా నూతన సంవత్సర వేడుకలకు స్వాగ తం పలికే విధానంలో వికృత సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా విందు, వినోదాలు, చిందులతో జల్సాల జోరు పెరుగుతుంది. కానీ ఇలాంటి దుర్లక్షణాలకి యువత తొందరగా ఆకర్షితులై విచక్షణ కోల్పోతున్నారు.

ప్రతి యేటా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ మాంసం, మద్యం, బేకరి, స్వీట్స్‌ పదార్థాలపై విపరీతంగా ఖర్చు పెరిగిపోతోంది. ముఖ్యంగా సంవత్సరం చివరి రోజు హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం షాపుల వద్ద రద్దీ విపరీతంగా పెరుగుతుంది. చివరిరోజు అమ్మకాలు అధికంగా ఉంటా యని వ్యాపారులు సైతం అందుకు తగ్గట్టుగానే వినియోగదారుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందం, ఉత్సాహం పేరుతో ధనికులతో పోల్చుకొని పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం అదనపు ఖర్చులు చేయ డం ఆందోళనకరమే అంటున్నారు నిపుణులు.

పొంచి ఉన్న ప్రమాదం...

కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి బైకులతో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. మద్యం తాగి యువత చిందులు వేయడం, గొడవలకు దిగడం లాంటి సంస్కృతి పెరుగుతుంది. చివరికి హింసాత్మక సంఘటనలతో పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా యువతీ, యువకులు రోడ్లపైకి రావడం జరుగుతుంది. బైక్ రైడింగ్, బాణసంచా పేలుస్తూ, "వెల్‌కం... న్యూ ఇయర్" అంటూ బిగ్గరగా అరుస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటారు. దీంతో విపరీత శబ్ద వాయు కాలుష్యం సైతం పెరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలు వ్యాపారులకు సిరులు కురిపించగా, వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆందో ళన చెందుతున్నారు. కొత్త ఏడాదిని ఆనందోత్సాహాలతో స్వాగతించి, ఆస్వాదించడం మన చర్యల్లో భాగంగా మారింది. దీన్ని ఎవరూ కాదనలేరు. ఈ విధానంలో మార్పు రావాలి. ఇతరులకు ఇబ్బందులు సృష్టించకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేడుకలు జరగాలి. పర్యావరణహితంగా జరుపుకుంటే మరీ మంచిది. నేటి ఆధునిక యుగంలో సమాచారాన్ని చేరవేయడంలో కీలకపాత్ర పోషించేవి సామాజిక మాధ్య మాలే. కావున వీటి వేదికగా జరుపుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. పోలీసులు రాత్రి 10గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో టీమ్‌లను ఆయా కూడళ్లలో ఏర్పాటుచేసి నిఘా పెంచాలి. బార్లు రెస్టారెంట్లకు అర్ధ రాత్రి వరకు అనుమతి నిరాకరించాలి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి దొర్లకుండా భవిష్యత్తు గమ్యానికి నాంది పడుతుంది.

నూతన లక్ష్యాలతో స్వాగతం పలకాలి..

హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించడమా? ఒక్క క్షణం ఆలోచించండి. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు” డబ్బుతో బలిసిన వాళ్లు కిక్ కోసం తాగుతుంటే, దీపానికి ఆకర్షితులయ్యే పురుగుల్లా మీరు బలవుతున్నారు. పరీక్ష పాస్ అయిన ఆనందంతో ఓ పెగ్గు వేస్తే తప్పేంటి? అని మొదలుపెట్టి ఉద్యోగం దొరికిందనో, ప్రమోషన్ వచ్చిందనో దాన్ని కొనసాగిస్తున్నారు. “కాళ్లకు చుట్టుకున్న పాము కరవక మారదు అన్నట్టు” ఈ దిక్కుమాలిన అలవాటు మీ జీవితాలను విషాదం చేస్తుంది. “కొత్త సంవత్సరం వస్తుందంటే శుభాలను తెస్తుందని ఆశించడంలో తప్పు లేదు. కానీ అర్ధరాత్రి ఉన్మాదంతో చెవులు బద్దలయ్యేలా అరుపులు, మద్యం మత్తులో చిందులు వేయడం ఎంతవరకు సరైనదో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. దీనివల్ల మద్యం వ్యాపారుల జేబులు నిండుతాయి, మధ్యతరగతి జీవుల జేబులు ఖాళీ అవుతున్నాయి తప్పితే ఒరిగేది ఏమిటి? ప్రజల ఆరోగ్యానికి హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వాలే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

కాబట్టి ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. కొత్త సంవత్సరం సందర్భంగా మీ జీవితాల్లో వెలుగునింపే, అందరూ గర్వపడే ఓ మంచి పనికి శ్రీకారం చుట్టండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మనపైన మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని గమనించాలి. చదువులో ఉన్నతంగా రాణించాలని, ఉద్యోగం సాధించాలని మంచి నిర్ణయం తీసుకోండి. జీవితం చాలా చిన్నది. కొవ్వత్తి లాగా రోజురోజుకు కరిగిపోతుంటుంది. ఈలోపే మనం అనుకున్న గమ్యాలను, లక్ష్యాలను చేరాలి. అప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుంది.

(నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా .....)

- సంపతి రమేష్ మహారాజు

79895 79428

Advertisement

Next Story

Most Viewed