అయోధ్య అక్షింతలు పంపిణీ.. సుమధుర ఘట్టం..!

by Ravi |   ( Updated:2024-12-31 00:30:22.0  )
అయోధ్య అక్షింతలు పంపిణీ.. సుమధుర ఘట్టం..!
X

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అక్షింతలు పంపిణీ చేసి ఏడాది పూర్తి అవుతున్న సందర్భం తలుచుకుంటే అపురూపమైన అనుభూతి కలిగిస్తోంది.. మదిని పులకింపచేస్తోంది. చిన్నా పెద్ద.. పేద ధనిక.. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అయోధ్య శ్రీ రామ జన్మ భూమి ప్రాణప్రతిష్టకు ఆహ్వానం పలికిన కార్యక్రమం అది. ఆకాశమంత పందిరి వేసి భూమండలమంతా పండగ చేసిన శుభ సందర్భంగా ఏ నోట విన్నా .. ఏ టీవీ చూసినా..ఏ పత్రిక చదివినా.. ఏ ఒక్కరిని కదిలించినా అయోధ్య అక్షింతలు.. అయోధ్య అక్షింతలు.! ఇదే మాట.. ఇదే ముచ్చట..! ప్రతి పౌరుడినీ కదిలించిన యజ్ఞం అది. స్వయంగా శ్రీరామచంద్రుడే తమకు ఆహ్వానం పంపాడు అనేలా ప్రతి ఒక్కరిని భక్తి పారవశ్యంలో ముంచేసింది.

క్షతం కానివి అంటే నాశనం కానివి అక్షింతలు అని అందరికీ తెలుసు. అయోధ్య శ్రీ రామచంద్రుడి భవ్య దివ్య నవ్య రామమందిర నిర్మాణంలో ప్రతి పౌరుడుని పాల్గొనేలా చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టి అద్భుత విజయం సాధించింది. ప్రతి హిందువులో స్వాభిమా నం రగిలించింది. 2024 జనవరి ఒకటో తారీకు నుంచి 15వ తారీఖు వరకు అద్భుత కార్యక్రమాలు చేపట్టి చరిత్రలో నిలిపింది. అయోధ్య శ్రీరాముని పాదాల చెంత పవిత్ర పూజలు చేసుకున్న అక్షింతలను ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాల్లో పంపిణీ చేశారు. ప్రతి హిందువును, ప్రతి పౌరుడుని తట్టి లేపిన మహా యజ్ఞం అది. ఇంటింటికి కరపత్రం, అక్షింతలు అంద జేసి, ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం సృష్టించిన అపురూప ఘట్టం అది. కొంతమందికి అక్షింతలు అందకపోతే ..మా ఇంటికి అక్షింతలు రాలేదు.. వచ్చి అందివ్వండి "అంటూ స్వయంగా భక్తులు ఫోన్లు చేసి అక్షింతలు అందుకున్న తీరు ఎంత చెప్పినా తక్కువే. భక్తి శ్రద్ధలతో అక్షింతలను ఆనందంగా అందుకున్న విశేష పర్వం అద్భుతం.. మహాద్భుతం. ఈ కార్య క్రమం ఓ చరిత్ర. ఒక విప్లవం. సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహా కార్యం. గొప్ప హిస్టరీ. భక్తులకు భేదాలు ఉండవని, పేద, ధనిక, నిమ్న అగ్ర, జాతి, రీతి ఏదీ లేకుండా అందరినీ సమానంగా.. అందరికీ ఒకే తరహా అక్షింతలు అందజేసి రాముడి కార్యంలో పాలుపంచుకునేలా చేసిన ఘనత శ్రీ రామచంద్ర శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ నిర్వాహకులదే.

ఆలయాల్లో అక్షింతల వృద్ధి

అయోధ్య రామ జన్మభూమిలో పవిత్ర పూ జలు చేసిన అక్షింతలు వచ్చిన సందర్భంలో విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌ల నుంచి పండుగ వాతావరణం తలపించింది. నృత్యాలు చేస్తూ.. కోలాటాలు ఆడుతూ.. రామ భక్తులు చేసిన కోలాహలం అంతా ఇంతా కాదు. కులమతాలు, రాజకీయ భేదాలు పక్కన పెట్టి అక్షింతలు తలపై పెట్టుకుని మురిసిపోయిన మధుర క్షణాలు చిరస్మరణీయం. ఆలయాలు, మఠాలు, మందిరాలు కేంద్రంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో స్థానికంగా వృద్ధి చేసుకొని ప్రతి ఇంటికి అక్షింతలను అందజేశారు. ఎవరికి వారే అందమైన ప్యాకె ట్లతో అక్షింతలు అందజేసి అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. ఇక రాష్ట్రపతి నుంచి మొదలుకొని, గ్రామాలు, తండాలు, పల్లె సీమ, గిరిజన ప్రజలతో పాటు కొండ కోనల్లో నివసించే చిట్టచివరి పౌరుడి వరకు ఎవరిని వదలకుండా అందరిని అయోధ్య రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానిస్తూ అక్షింతలు అందజేశారు. చిరస్థాయిగా ప్రతి ఏడాది మురిపెంగా, అపురూపంగా ఆ అద్భుత కార్యక్రమం గురించి కథలు కథలుగా చెప్పుకొని సంతోషించాల్సిన ఈ కార్యక్రమానికి ఏడాది పూర్తి కావడం ఆనందదాయకం.

(దేశవ్యాప్తంగా అయోధ్య అక్షింతలు పంపిణీ చేసి ఏడాది గడిచిన సందర్భంగా)

- పగుడాకుల బాలస్వామి

ప్రచార ప్రముఖ్, వీహెచ్‌పీ తెలంగాణ

9912975753

Advertisement

Next Story