చదువరీ.. నన్ను మరిచిపోయావా?

by Ravi |   ( Updated:2022-09-03 18:05:27.0  )
చదువరీ.. నన్ను మరిచిపోయావా?
X

చిన్నప్పటి నుంచే పుస్తకాలను చదివించడం అలవాటు చేస్తే పిల్లల బతుకులు బాగుపడుతాయి. పుస్తకమూ జీవిస్తుంది. పాఠశాలలు, కళాశాలలు వివిధ సందర్భాలలో నిర్వహించే పోటీలలో ఇచ్చే బహుమతులకు వేలాది రూపాయలు ఖర్చు చేసే బదులుగా ఒక చిన్న పుస్తకాన్ని బహుమతిగా ఇస్తే మంచిది. పుస్తకం కంటే నిఖార్సయిన మిత్రుడు, గైడ్ ఎవరుంటారు? పిల్లల కోసమే కాదు, పెద్దలకు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉండాలి. జీవితం అంటే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించడం విందు, వినోదాలలో మునిగి తేలడం మాత్రమే కాదు. హృదయానికి కొత్త అనుభవాన్నిచ్చే పుస్తకాలను చదవాలి.

మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే, ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం. పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం. అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే. తరతరాల నుంచి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడమంటే ఆకాశాన్ని కొలవడంలాంటిది. స్పెయిన్ దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తంచేసుకుంటూ గులాబీలను అందించుకునేవారు. 1926లో 'మిగ్యుల్ డి సెర్వెంటెస్' అనే ఆ దేశ రచయిత మరణించడంతో ఆ సంవత్సరం గులాబీలకు బదులు పుస్తకాలను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు వేర్వేరు తేదీలలో పుస్తక మహోత్సవాలు నిర్వహించాయి.

1616 లో ఏప్రిల్ 23న సెవాంతెస్, షేక్స్‌పియర్, ఇన్కాగర్సిలాసో, వేగా అనే రచయితలు ఒకే రోజున మరణించారు. మరి కొందరు ప్రముఖ రచయితలు అదే రోజున జన్మించారు. దీనిని ప్రామాణికంగా తీసుకొని యునెస్కో 1995లో ప్యారిస్‌లో జరిగిన సమావేశంలో పుస్తకాలకు, రచయితలకు గౌరవ సమర్పణ చేయాలని యోచించింది. యువతను చదువు వైపు ఆకర్షించడమే లక్ష్యంగా, పుస్తకం చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులవంటి విషయాలను ప్రోత్సహించి, వాటి గురించి విస్తృత ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశంగా ఏప్రిల్ 23న 'ప్రపంచ పుస్తక దినోత్సవం' 'ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినం' జరుపుకోవాలని పిలుపునిచ్చింది. రచయితలు, ప్రచురణకర్తలు పాఠశాల ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. యేటా ఒక ప్రముఖ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తూ వస్తోంది.

ఉన్నత అభిరుచిగా

ప్రతి ఒక్కరు పుస్తకం చదవడం ఒక ఉన్నత అభిరుచిగా భావించాల్సిన అవసరముంది. కంప్యూటర్లు, టీవీలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి పుస్తకానికి ప్రత్యామ్నాయమైతే కావు. కాలేవు. పిల్లలకు, పెద్దలకు చదవడం ఒక అభిరుచిగానే కాదు ఒక అలవాటుగా మారాలి. పుస్తకం లేకుండా జ్ఞానం లేదు. ఎవరికి వారు తమ ఇష్టమైన రంగానికి సంబంధించిన పుస్తకాలయినా చదువాలి. వారానికి ఒక పుస్తకం చదివినా ఏడాదిలో 50కిపైగా పుస్తకాలు చదివినవారవుతారు. మన ఇంటిలో టీవీ, సోఫాలు, టేబుల్స్, ఫ్యాన్లు, ఏసీలు కూలర్లు, కంప్యూటర్లు ఉండడమే కాదు పుస్తకాల కోసం ఒక రాక్ ఏర్పరుచుకోవాలి. ప్రతి ఒక్కరు తమకంటూ పర్సనల్ లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. ఎవరు ఏ వృత్తి చేసినా, ఏ రీతిన జీవించినా పుస్తకాలు చదవడం వలన వారి వికాసానికి, పురోభివృద్ధికి ఉపకరిస్తుంది.

నిరంతరం చదవడం మనుషుల ఎదుగుదలకి, మనోవైశాల్యానికి తోడ్పడుతుంది. అందుకే పుస్తకాలు చదువడం మన జీవితంలో అంతర్భాగం కావాలి. పుస్తకాల పండుగలు ముఖ్యమైన పట్టణాలలోనే కాకుండా మారుమూల ప్రాంతాలలో కూడా నిర్వహించాలి. పుస్తకాలు అందరికిీ అందుబాటులోకి రావాలి. చదవాలనే జిజ్ఞాసను కల్పించాలి. ఒక కొత్త పుస్తకాన్ని కొని చదవడంలో ఉండే ఆనందాన్ని అనుభవించాలి. ఒక్కొక్కసారి ఒక 'పుస్తకం' మన జీవితాన్నే మార్చివేస్తుంది. ఒక్క వాక్యమే చాలు ఆలోచింపచేయడానికి, ప్రపంచంలో ఏ రంగలో శిఖరాగ్రస్థాయికి చేరుకున్నవారైనా పుస్తకాలు బాగా చదివి తమ జీవితాన్ని విశాలం చేసుకున్నవారే. అందుకే చదువు మన బతుకులో భాగం కావాలి. పుస్తకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినపుడే అది సాధ్యమవుతుంది.

సమాజానికి ఆయుధాలు

'కత్తికన్నా కలం పదునైనది' ఇది మన సమాజం గర్వంగా చెప్పుకునే మాట. అయితే కత్తి కన్నా కలం గొప్పదవ్వాలన్నా, పదునుగా మారాలన్నా, కేవలం కలం పట్టిన కవి, రచయిత ఉంటే సరిపోడు. ఆ కలం సృష్టించే భావాలను అందుకునే పాఠకుడు కూడా సమవుజ్జీగా ఉన్నపుడే కలం సృష్టించే అక్షరాలు సమాజానికి ఆయుధాలుగా చేరుతాయి. కాబట్టి ఇక్కడ కీలకం చదువరులే. దురదృష్టవశాత్తు మన సమాజంలో పఠనాశక్తి తగ్గిపోతోంది. పుస్తకాలు చదవడం అరుదవుతున్నది. పుస్తకమే జీవితంగా గడపాల్సిన బాల్యంలో కూడా పుస్తకాల జోలికి పరిమితంగానే వెళ్లడం నేటి వాస్తవం. పుస్తకం అంటే పాఠ్య పుస్తకమే అనే భావన విద్యార్థులలో బలపడేలా చేస్తున్నది.

మన కార్పొరేట్ విద్యావ్యవస్థ. ర్యాంకులు, మార్కులు తప్ప ఇతర పుస్తకాలు చదవడం. సమయాన్ని వృధా చేసుకోవడమే అనే భావన పిల్లలు, తల్లిదండ్రులలోను కల్పించింది. ఒకప్పుడు 'పుస్తకం హస్తభూషణంగా' భావించిన మన సమాజంలో నేడు'సెల్‌ఫోన్' హస్త భూషణం అయింది. అలాగని సాంకేతిక ప్రగతిని అడ్డుకోవాలనో, సాంకేతిక ప్రగతి ఫలాలను అనుభవించకూడదనో అనడం లేదు. కేవలం సాంకేతిక సామాగ్రి ఉంటే, మన చెంత సర్వస్వం ఉన్నట్లే అనే భావన సరైంది కాదు అని గుర్తిస్తే మంచిది. పిల్లలకు పాఠ్యపుస్తకాలతో పాటు, సామాజిక పరిజ్ఞానం, సాహిత్యం పట్ల అభిలాష, చారిత్రక నేపథ్యం పట్ల ఆసక్తిని పెంపొందించే పుస్తకాలను చదివించాలి. చిన్నతనం నుండి పుస్తకాలను చదివించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో ఇంటి నుండి బడి వరకు అందరూ విఫలమయ్యారనడంలో అతిశయోక్తి కాదు.

జీవితాలు బాగుపడతాయి

చిన్నప్పటి నుంచే పుస్తకాలను చదివించడం అలవాటు చేస్తే పిల్లల బతుకులు బాగుపడుతాయి. పుస్తకమూ జీవిస్తుంది. పాఠశాలలు, కళాశాలలు వివిధ సందర్భాలలో నిర్వహించే పోటీలలో ఇచ్చే బహుమతులకు వేలాది రూపాయలు ఖర్చు చేసే బదులుగా ఒక చిన్న పుస్తకాన్ని బహుమతిగా ఇస్తే మంచిది. పుస్తకం కంటే నిఖార్సయిన మిత్రుడు, గైడ్ ఎవరుంటారు? పిల్లల కోసమే కాదు, పెద్దలకు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉండాలి. జీవితం అంటే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించడం విందు, వినోదాలలో మునిగి తేలడం మాత్రమే కాదు.

హృదయానికి కొత్త అనుభవాన్నిచ్చే పుస్తకాలను చదవాలి. లోకం తీరును పట్టి చూపే పుస్తకాలతో సావాసం చేయాలి. చదివే పుస్తకాలు కథలో, నవలలో కానక్కర్లేదు. ఆసక్తి ఉన్న ఏ పుస్తకాలు అయినా చదువుకోవచ్చు. 'పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది' అన్నారు. మనిషి సృజనాత్మకంగా జీవించాలంటే పుస్తకాలు ఉండాలి. ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ యుగంలో కూడా పుస్తక స్థానాన్ని మరేది భర్తీ చేయలేదు. మనకుండే ఇతరేతర అభిరుచులు కూడా పుస్తక పఠనాన్ని క్షీణింపచేయజాలవు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకానికి ప్రత్యామ్నాయమే లేదు.

(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)

నరేందర్ రాచమల్ల

99892 67462

Advertisement

Next Story