అక్షరాస్యతతోనే అభివృద్ధి

by Ravi |   ( Updated:2022-09-08 04:16:51.0  )
అక్షరాస్యతతోనే అభివృద్ధి
X

ఝార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే వెనకబడి ఉన్నాయి. దేశంలో తెలంగాణ అక్షరాస్యతలో 32 వ స్థానంలో కొనసాగుతున్నది. సంపూర్ణ అక్షరాస్యత కోసం సీఎం కేసీఆర్ 2020 జనవరిలో 'ఈచ్ వన్ టీచ్ వన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో పంచాయతీ వారీగా నిరక్షరాస్యుల జాబితా సేకరించారు. నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. సంపూర్ణ అక్షరాస్యత కోసం పకడ్బందీ వ్యూహం రచించాలి. సమాజంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. అక్షరాస్యతలో లక్ష్యాలను సాధిస్తేనే దేశంలోని అన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్ కాగలదు.

ఏ దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందంటే అక్కడి అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశాలలో అక్షరాస్యత ప్రధానమైనది. అక్షరాస్యత పెంపొందించడమంటే ఒకరికి చదవడం, రాయడం తో పాటు సాంఘిక చైతన్యం కలిగించి సంపూర్ణ పౌరుడిగా తీర్చిదిద్దడమే. ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వయోజన విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అవి క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు అందించడం లేదు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల సమన్వయ లోపం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన కొరవడటం, తగినన్ని నిధులు కేటాయించక పోవడం తదితర అంశాలు వయోజన విద్య వైఫల్యానికి ప్రధాన కారణాలు. 1966 సెప్టెంబర్ 8 నుంచి యేటా అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకోవాలని 1965లో యునెస్కో ప్రతిపాదించింది.

అక్షరాస్యత పెరిగినా

కేంద్ర ప్రభుత్వం 1988లో 'జాతీయ అక్షరాస్యత' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 15 సంవత్సరాల వయస్సు దాటిన వారికి అక్షరజ్ఞానం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. దీనిని 2009లో 'సాక్షర‌ భారత్' గా మార్చారు. ఈ పథకం అమలు కోసం దేశవ్యాప్తంగా 404 జిల్లాలలో 1.64 లక్షల గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాలలో సుమారు 8.27 కోట్ల మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వారందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో మాత్రం విఫలమయ్యారు. ఇదే పథకం పేరును 2018లో 'పఢ్‌నా, లిఖ్‌నా అభియాన్' అని మార్చి జాతీయ వయోజన విద్యా పథకంగా నిర్వహించారు. అయినా, దేశంలో 27 శాతం నిరక్షరాస్యత ఇంకా మిగిలే ఉంది.

నిజానికి దేశంలో అక్షరాస్యత రేటు నెమ్మదిగా పెరుగుతున్నది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత 64.83 శాతం ఉండగా, 2011లో 74.04 శాతంగా ఉంది. 2019-21 జాతీయ గణాంకాల సర్వే ప్రకారం 77.70 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో నిరక్షరాస్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బ్యాంకు ఖాతాలు తెరవడానికి, దరఖాస్తులు పూర్తి చేయడానికి సంతకం పెట్టడం కూడా రాని వారు చాలా మంది ఉన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల కారణంగా మహిళలు కొంతవరకు అక్షర జ్ఞానంపై దృష్టి సారించారు. పురుషుల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

అందరి క‌ృషి అవసరం

కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యను 'సార్వత్రిక విద్య'గా అమలు చేయాలని నిర్ణయించింది. 'పఢ్‌నా, లిఖ్‌నా అభియాన్' స్థానంలో 'నవ భారత్ సాక్షరత' కార్యక్రమాన్ని 2022 ఏప్రిల్ 1న ప్రారంభించింది. దీనికి కేంద్రం రూ.700 కోట్లు, రాష్ట్రం రూ.337.90 కోట్లు వెచ్చించాయి. ఇది 2026-27 వరకు అమలు చేయబడుతుంది. ఈ మెత్తం కాలంలో ఐదు కోట్ల మందిని అక్షరాస్యులను చేయాలని సంకల్పించింది. నిరాక్షరాస్యులకి పునాది అక్షరాస్యత. సంఖ్యాశాస్త్రం, జీవన నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత మొదలైన అంశాలు లక్ష్యాలుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. యేటా కోటి మందికి ఆన్‌లైన్‌లో చదువు చెప్పి వారి అభ్యసనా సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పథకం విజయవంతం కావాలంటే వయోజన విద్య అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలోనూ 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 66.46 శాతంగా ఉంది. మహబూబ్‌నగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలలో అత్యల్పంగా ఉంది. ఝార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు మాత్రమే తెలంగాణ కంటే వెనకబడి ఉన్నాయి. దేశంలో తెలంగాణ అక్షరాస్యతలో 32 వ స్థానంలో కొనసాగుతున్నది. సంపూర్ణ అక్షరాస్యత కోసం సీఎం కేసీఆర్ 2020 జనవరిలో 'ఈచ్ వన్ టీచ్ వన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో పంచాయతీలవారీగా నిరక్షరాస్యుల జాబితా సేకరించారు. నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. సంపూర్ణ అక్షరాస్యత కోసం పకడ్బందీ వ్యూహం రచించాలి. సమాజంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. అక్షరాస్యతలో లక్ష్యాలను సాధిస్తేనే దేశంలోని అన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్ కాగలదు.

Also Read : చదువుకుంటేనే సమాజ హోదా

Also Read : విద్య సంక్షేమానికి ఉపకరణం

(నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం)

అంకం నరేశ్

63016 50324

Advertisement

Next Story

Most Viewed