రాజ్యాంగ‌బద్ధ పాలనే శ్రేయస్కరం!

by Ravi |   ( Updated:2025-01-26 00:30:24.0  )
రాజ్యాంగ‌బద్ధ పాలనే శ్రేయస్కరం!
X

భారత రాజ్యాంగానికి 75 వసంతాలు నిండాయి. అయితే, రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం కాదు! స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించి సమున్నత ఆశయంతో కూడుకుంది. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగం నుంచి సంక్రమించినవే.

ఓ వ్యక్తి నిరక్షరాస్యుడు కానీ, విద్యాధికుడు కానీ, కూటికి లేని నిరుపేద గానీ, ధనవంతులు కానీ అందరూ రాజ్యాంగం పరిధిలో మనుగడ సాగిస్తున్న వారే. చట్టం ముందు అందరూ సమానులే.. కూటికి లేని వారు కుబేరులు ఒకే వరుసలో నిల్చొని ఓటు వేస్తున్నారన్నా, ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరిస్తున్నారన్నా, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారన్నా, వివక్ష లేకుండా చదువుకోగలుగుతున్నారన్నా.. మెరుగైన జీవనం జన్మ హక్కుగా మారిందన్నా ఇదంతా ముమ్మాటికీ మన రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమే.

సంక్షోభాలు ఎన్ని ఎదురైనా..

ప్రపంచంలో నాగరిక దేశాలమని తమకు తామే కితాబులిచ్చుకున్న దేశాలు కూడా వివక్ష లేకుండా పౌరులకు ఓటు హక్కు కల్పించలేదు. కానీ భారత రాజ్యాంగం వివక్ష లేకుండా వయోజనులందరికీ సార్వజనీన ఓటు హక్కు కల్పించింది. ఇక మనలాగే వలస పాలనలో మగ్గి, స్వాతంత్ర్యం పొంది ప్రజాస్వామ్య బాట పట్టిన అనేక దేశాలు కాలక్రమంలో నిర్వీర్యమయ్యాయి. నియంతృత్వంలోకో సైనిక పాలనలోకో వెళ్లిపోయాయి. కానీ మనదేశం మాత్రం ఇప్పటీకీ ప్రజాస్వామిక దేశంగా విరాజిల్లుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషలు, సంప్రదాయాలు, భిన్న మతాలు, కులాలు ఉన్నప్పటికీ దేశ విభజన అల్లకల్లోల పరిస్థితులు, అస్తవ్యస్త ఆర్థిక స్థితిగతుల్లోనూ.. పొరుగు దేశాలతో ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు అంతర్గత ఎమర్జెన్సీలా మారిన ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, కశ్మీరులో పెచ్చరిల్లిన ఉగ్రవాదం! ఇలా విదేశీ శత్రువులు స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా భారత్‌లో ప్రజాస్వామ్యం నిలబడటమే కాదు బలపడింది. జాతిని ఐక్యంగా నిలిపి దేశంగా కలిపి ఉంచుతున్న రక్షాబంధన్ మన రాజ్యాంగం.

మనది రాజకీయ సమానత్వమే

భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్‌గా అంబేడ్కర్ సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించారు. భవిష్యత్తులో రాజ్యాంగానికి వచ్చే ప్రమాదాలను ఆనాడే గ్రహించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆనాడే హెచ్చరించారు. ప్రజాస్వామ్య మూలాలను పరిరక్షించుకోవడానికి ఏం చేయాలో! ఏం చేయకూడదో? రాజ్యాంగ సభలో దిశా నిర్దేశం చేశారు. దేశం ముఖ్యమా.. నమ్మిన మత విశ్వాసాలు, సిద్ధాంతాలు ముఖ్యమా? అనే దాన్ని బట్టి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆనాడే చెప్పాడు. రాజకీయపరంగా సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది. సామా జిక ఆర్థిక అంశాల్లో మాత్రం ఈ సమానత్వం లేదు. ప్రజలు వారి బాధ్యతలు మర్చిపోవద్దు.. ఏ తప్పు జరిగినా మనల్ని మనమే నిందించుకోవాలి. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే.. ఆ దారిలో ఎదుర య్యే దుష్టశక్తులను ఏరిపారేయాలన్నారు. రాజ్యాంగం విఫలమైతే రాజ్యాం గాన్ని విమర్శించవద్దు. దాన్ని అమలు చేసే వారిని నిందించాలన్నారు. దేశా నికి గాని, జాతికి గాని సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందన్నారు.

ప్రజాస్వామ్య పాలనలో..

ఏడున్నర దశాబ్దాల రాజ్యాంగ ప్రస్థా నంలో దేశ పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు రక్షణగా నిలిచిన భారత రాజ్యాంగం పెను సవాళ్లను ఎదు ర్కొంది. పలు పరీక్షలకు గురైంది, అలా రాజ్యాంగ ఘర్షణను కేశవానంద భారతి కేసు(1973) మలుపు తిప్పిందనే చెప్పాలి. భారతదేశ చరిత్రలోనే దీన్నో చరిత్రత్మక తీర్పుగా న్యాయ కోవిదులు పేర్కొంటారు. ఈ కేసులో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అధికరణాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొం టూనే.. మౌలిక స్వరూపాన్ని మార్చకూడదంటూ కట్టడి చేసింది. రాజ్యాంగం సంక్షోభం ఎదురైన ప్రతిసారీ తన మూలాల సహాయంతో మరింత బలోపేతం అవుతూనే ఉంది. కానీ నేటి పాలకుల పాలనా విధానాలలో నియంతృత్వం, అధికార దుర్వినియోగం, రాజ్యాంగబద్ధ పాలనను చేయకపోవడం మూలంగా ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించబడలేదు. వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి రాజ్యాంగంపై నెపం మోపడం మంచిది కాదు. రాజ్యాంగ బద్ధ పాలనే ముమ్మాటికీ మన దేశానికి శ్రేయస్కరం.

- మేకిరి దామోదర్,

95736 66650



Next Story

Most Viewed