కమలం వైపు బాబు చూపులు...

by Ravi |   ( Updated:2023-01-03 03:08:44.0  )
కమలం వైపు బాబు చూపులు...
X

ఏపీలో జగన్ ను ఎదుర్కొవాలంటే సొంతంగా పోటీ చేస్తే సాధ్యం కాదని పవన్ కల్యాన్, చంద్రబాబు ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. పవన్ కూడా ఈ పొత్తు గురించి కమలనాథులతో చర్చించినా టీడీపీ తో పొత్తుకి మాత్రం బీజేపీ ఏ మాత్రం ఇష్టపడటంలేదు. అందుకే చంద్రబాబు రూటు మార్చి తెలంగాణలో కేసీఆర్ ను బూచిగా చూపి ఇక్కడ పొత్తు పెట్టుకొని ఆ రాష్ట్రంలో లాభపడాలని యోచిస్తున్నారు. అందుకే ఖమ్మం బహిరంగ సభపెట్టారని అది విజయవంతం కావడంతో బీజేపీ టీడిపీతో పొత్తుకి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది. తెలంగాణాలో టీడీపీ సహకారం బీజేపీ తీసుకుంటే ఏపీలో కూడా పొత్తుకు రెడీ చెప్పి తీరాలి. అప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ జనసేన కూడా కలుస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలను తెలంగాణ ఎన్నికలే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.

మ్మడి ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం(tdp) పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. కానీ నేడు చంద్రబాబు చేతిలో ఆ పార్టీ జాతీయ పార్టీలకు తీసిపోని విధంగా తయారైంది. ఆ పార్టీకి అధినేతగా చంద్రబాబు అపర చాణక్యుడిగా రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీని మూడుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరు. ఒకప్పుడు టీడీపీ వేరు ఇప్పటి టీడీపీ వేరు. రాజకీయంగా టీడీపీలో నిస్తేజం అలుముకుంది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే సామర్థ్యం పై నమ్మకం సన్నగిల్లడంతో బలం పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాజకీయ పునర్ వైభవం కోసం పోరాడుతుంది. ఈ పరిస్థితులలో ఆయనకు మిత్ర పక్షాల మద్దతు అండదండలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో బాగా తెలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా టీడీపీ ను ముందుకు నడిపించే విషయంలో చంద్రబాబు ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. జగన్ పరిపాలనను టార్గెట్ చేసుకొని రాష్ట్రంలో ఎంతో పోరాడుతున్న పార్టీకి అనుకున్నంత మైలేజ్ రావడం లేదని టీడీపీ క్యాడర్ భావిస్తోంది.

రాజకీయంగా పతనం చేసేందుకే

రాజకీయంగాను, సామాజికంగా, ఆర్థికంగా టీడీపీ బాగా నష్టపోయింది. ఈ సమయంలో ఆ పార్టీ బతికి బట్ట కట్టాలంటే తప్పనిసరిగా మిత్రపక్షాల సహాయ సహకారాలు ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ అండ ఉండి తీరాల్సిందే. గడిచిన 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితులను అంచనా వేయలేకపోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలం అయ్యారు. బీజేపీ బలం రహాస్య వ్యూహాలను తక్కువగా అంచనా వేసి ఆ సమయంలో బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాక జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని చేసిన సాహసాలు స్వంత రాష్ట్రంలో బెడిసి కొట్టి ఊహించని రీతిలో వైసీపీ చేతిలో భారీ ఓటమి పాలయ్యాడు. దీంతో నాడు బీజేపీపై ఆయన వ్యవహరించిన తీరు కేంద్రంలోని బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. ఎలాగైనా సరే చంద్రబాబును రాజకీయంగా ఇరుకున పెట్టాలని 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి బీజేపీ పరోక్ష మద్దతు ఇచ్చిందనే గుసగుసలు వినిపించాయి.

అందుకే వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే జగన్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి టీడీపీ ని రాజకీయంగా పతనం చేసేందుకు ప్రయత్నించారనడంలో సందేహాలు లేనే లేవు. జగన్ సైతం కేంద్రం అండదండలతోనే పరిపాలనలో దూకుడుగా వ్యవహరించారు. కానీ ఆ తరువాత జరిగిన రాజకీయాల పరిణామాల నేపథ్యంలో వైసీపీ ని కాస్త దూరం పెట్టి బీజేపీ తటస్థంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఏపీలో బీజేపీ బలమైన పార్టీగా తయారవ్వాలంటే అక్కడి టిడిపిని పూర్తిగా తుడిచి పెడితేనే సాధ్యం అవుతుందనే అభిప్రాయానికి బీజేపీ పెద్దలు ఏనాడో వచ్చారు. అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి కరుడుగట్టిన బీజేపీ వాది అయిన సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించడం వెనకాల రహస్యం ఇదే సుమా!. అందుకే ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి టీడీపీ ను టార్గెట్ చేసి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నాయకులపై ఫోకస్ పెట్టి వారికి ప్రశ్నలు సంధించి నోర్లు మూతపడేలా చేస్తున్నారు. అలాగే ఆ పార్టిలో చాలా కాలంగా పనిచేస్తూ ప్రాధాన్యత లేని నాయకులను భారీగా చేర్చుకోవాలని ప్రయత్నించినా అనుకున్నంత స్థాయిలో వలసలు లేకపోవడంతో కేంద్ర పెద్దలు అసహనంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు రూటు మార్చి

రాష్ట్రంలో బీజేపీ తన పార్టీని టార్గెట్ చేసుకోవడంపై చంద్రబాబులోనూ ఆందోళన ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే అవకాశం ఉన్న చోట బీజేపీ పై ప్రశంసల జల్లులు కురిపిస్తూ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకే బీజేపీ నాయకులు ఆ పార్టీపై, నాయకులపై ఎన్ని విమర్శలు చేసినా కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ నాయకులు ముందుకు రాకపోవడంతో బీజేపీతో విభేదాలు పెట్టుకోవడానికి పార్టీ నాయకత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీజేపీ తో విభేదం పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో టీడీపీకి తెలియంది కాదు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడకూడదనే అభిప్రాయం లో ఉన్నారట. ఆ పార్టీ కనుమరుగైతే బీజేపీ పార్టీకి అవకాశం దక్కుతుందని టీడీపీ ను దూరం పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడిలా బీజేపీ సన్నిహిత్యం కోసం విశ్వ చేస్తున్నట్లు మీడియా సర్కిల్లో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో తమ బలం పుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై దృష్టి సారించింది.తెలంగాణలో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ తో సమరానికి సిద్ధం అవుతుంది. కానీ ఏపీలో తమ పార్టీ ఎందుకు బలోపేతం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు.

ఏపీలో జగన్ ను ఎదుర్కొవాలంటే సొంతంగా పోటీ చేస్తే సాధ్యం కాదని పవన్ కల్యాన్, చంద్రబాబు ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. పవన్ కూడా ఈ పొత్తు గురించి కమలనాథులతో చర్చించినా టీడీపీ తో పొత్తుకి మాత్రం బీజేపీ ఏ మాత్రం ఇష్టపడటంలేదు. అందుకే చంద్రబాబు రూటు మార్చి తెలంగాణ కేసీఆర్ ను బూచిగా చూపి ఇక్కడ పొత్తు పెట్టుకొని ఆ రాష్ట్రంలో లాభపడాలని యోచిస్తున్నారు. అందుకే ఖమ్మం బహిరంగ సభపెట్టారని అది విజయవంతం కావడంతో బీజేపీ టీడిపీతో పొత్తుకి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది. తెలంగాణాలో టీడీపీ సహకారం బీజేపీ తీసుకుంటే ఏపీలో కూడా పొత్తుకు రెడీ చెప్పి తీరాలి. అప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ జనసేన కూడా కలుస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలను తెలంగాణ ఎన్నికలే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.

బీజేపీ త్రిముఖ వ్యూహంతో

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశ చరిత్రలోనే అంతుబట్టని రాజకీయ వ్యూహాలతో మోదీ-షా ధ్వయం దూసుకెళుతుంది. ఒకటి రెండు మినహా వాళ్ళు చేసిన రాజకీయ క్రీడలన్ని విజయవంతం అయ్యాయి. రాజకీయాల్లో ఆరితేరిన వారిని సైతం ఎదురుతిరిగితే కనపడకుండా చేసే సాహసం వారి సొంతం. అందుకే చంద్రబాబు విషయంలో పట్టీపట్టనట్లు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో బీజేపీ పార్టీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు మద్దతిచ్చేయే. దీంతో ఎవరు గెలిచినా బీజేపీ కి పోయేదేమిలేదు. కానీ వైసీపీ పై చంద్రబాబుతో పోల్చితే మోడికి మంచి అభిప్రాయం ఉంది. చంద్రబాబుకి ఓకే చెబితే భవిష్యత్తులో సమస్యలు రావొచ్చని బీజేపీ అంతర్గతంగా భయపడుతుంది. అలాగే కష్ట కాలంలో నమ్మకంగా మద్దతు ఉంటుదన్నా గ్యారెంటీ లేదు.

ఈ పరిస్థితుల దృష్యా బీజేపీ త్రిముఖ వ్యూహం అమలు చేయాలని ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఒకటి వైసీపీ, టీడీపీ ఎవరు గెలిచినా తమకు నష్టం లేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేయడం. రెండవది జనసేన, టీడీపీ తో పొత్తు. మూడవది టీడీపీతో పొత్తు కేవలం తెలంగాణకే పరిమితం చేయడం. గతంలో టీడీపీతో పొత్తు కారణంగా సీట్లు మినహా పార్టీ పరంగా బలం పెరగలేదని కమలం నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే టీడీపీతో ఎట్టి పరిస్థితులలో పొత్తు ఉండదని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక టీడీపీతో బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఉంటుందా? లేదా తెలంగాణ ఎన్నికల విజయాన్ని బట్టి మార్పు తో ముందుకు సాగుతుందా? అనేది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.

డా. బి. కేశవులు నేత. ఎండీ

ఛైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read..

పరిశోధనల్లో గ్రంథాలయాల పాత్ర


Advertisement

Next Story