ఊబకాయం నుంచి తప్పించుకోగలమా?

by Ravi |   ( Updated:2024-11-22 03:29:17.0  )
ఊబకాయం నుంచి తప్పించుకోగలమా?
X

ప్రపంచీకరణ నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్యం అంటూ పనికిరాని అల్ట్రా ప్రాసెసింగ్ ఫుడ్స్ మన షాపింగ్ కార్టులో నిండిపోతున్నాయి. చిన్న పిల్లలకు చిన్నప్పటినుండి రకరకాల కంపెనీల చిప్స్ అందమైన ప్రకటనలతో అలవాటు చేస్తున్నాం. పిల్లలకు ఆనందం కలిగించడానికి, వారి అల్లరిని తగ్గించడానికి మనమే ఈ రకమైన ప్యాకెట్లను నిరంతరం కొని వారికి ఇస్తూ సంతృప్తి కలిగిస్తున్నాం. అలా వారి శరీరంలోకి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు చిన్నప్పటినుండి పంపించేస్తున్నాం. ఈ పనికి రాని రసాయనాలన్నీ కూడా మెల్లమెల్లగా అనర్ధాలకు దారి తీస్తున్నాయని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కానీ, బలమైన ప్రకటనల పరిశ్రమ, అందమైన మిరుమిట్లు గొలిపే ప్రకటనల కటౌట్లు ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. చాలామంది అలాంటప్పుడు టీవీల్లో ఎందుకు అలా చూపిస్తున్నారు అని వాదిస్తుంటారు. గతంలో ఇంగ్లాండ్‌లో కూడా ఈ ఊబకాయం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. అల్ట్రా ప్రొసెస్డ్ ఆహార పదార్థాలు వీటికి చాలా కారణమవుతున్నాయని కోర్టులో కేసులు నడిచాయి. అమెరికాలో కూడా చాలా సంస్థలు కేసులు పెట్టడం మనం చదివాం. ఇప్పుడు మన భారతదేశం కూడా అదే దారిలో ఉంది.

జంక్ ఫుడ్... ఊబకాయం

ఈ మధ్యనే లాన్సెట్ అనే పత్రికలో వచ్చిన ఒక పరిశోధనాత్మక వ్యాసం ప్రకారం, అమెరికాలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఊబకాయంతో బాధపడుతున్నారు. 1990లో ఈ సంఖ్య సగం నుండి ఇప్పుడు నాలుగు వంతుల్లో మూడు వంతులు పెరిగారు. ఇటీవల గెలిచిన ట్రంప్ హెల్త్ సెక్రటరీగా పదవిలోకి రాబోయే రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని అంటున్నారు. ఊబ కాయం, డయాబెటిస్ ఈ రెండు విషయాలు, దాంతో పాటు ఆటిజం వీటిని ఆరోగ్య పాలసీలో ప్రాధాన్యతలో ఉంచబోతుంది. అయితే ఆహార పదార్థాలు ఉపయోగించే కెమికల్స్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని ఆలోచిస్తున్నది. బిఎమ్ఐ 30ని దాటితే ఊబకాయులుగా పరిగణిస్తారు. టీన్స్‌లో కూడా 1990లో 29 శాతం మాత్రమే ఊబకాయంతో ఉండేవారు. నేడు జనాభాలో సగం కంటే ఎక్కువ మంది టీనేజర్స్ ఎక్కువ బరువు ఉన్నారు. లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. జెనెటిక్స్ పాత్ర కాదనలేం. కానీ, తినే జంక్ ఫుడ్, అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్, వ్యాయామం లేని జీవనశైలి, ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి వందమందిలో 75 మంది అనారోగ్యం కారణంగా ఊబకాయులుగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అది ఎంతవరకు ఫలితం వస్తుంది?

తినే తిండిపైనా చర్చలు..

ప్రజాస్వామ్యంలో వ్యాపారం కోసం ప్రతిదీ కూడా లైసెన్స్ సంపాదించుకుంటుంది. బలమైన కన్సూమర్ ఉద్యమం ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మన దేశంలో లేదు. ఇలాంటి ప్రొడక్ట్‌ల మీద కేసులు పెట్టే మంచి ఉద్యమాలు ఇంకా మన దేశంలో ఆరంభం కాలేదు. ఎంతసేపూ, ఫలానా మతం వాడు ఏం తింటున్నాడు? ఫలానా మతం ఎంత ప్రమాదంలో ఉంది? ఇలాంటి అప్రధానమైన చర్చల్లో మనకు ముంచేయడం తప్ప జీవితాలను ప్రభావితం చేసే వాస్తవాలు మనం ఆలోచించే పరిస్థితి లేదు. గతంలో ప్రజలు క్రిముల ద్వారా వచ్చిన జబ్బులతో బాధపడ్డారు. సైన్స్‌లో వచ్చిన అద్భుతమైన మార్పు ద్వారా సూక్ష్మ క్రిముల నుండి అంత భయంకరమైన సమస్యలు నేడు జనాలు ఎదుర్కోవడం లేదు. కరోనా అనే ఒక మహమ్మారిని విడిచిపెడితే, మరలా అంత అధిక స్థాయిలో ప్రతిరోజు క్రిములతో బాధపడే సమస్య చాలా ఎక్కువ మంది జనాలకు లేదు. కానీ, దానికి బదులుగా ఈరోజు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇబ్బంది పెడుతుంది. జీవన విధానంలో వచ్చిన మార్పులు మనుషులను అనారోగ్యంలోకి నెట్టేస్తున్నాయి. ఊబకా‌యం కూడా అలాంటిదే.

నడక మానేశాం.. అందుకే...

ఇదంతా కూడా వ్యక్తిగతమైన కారణమని చెప్పలేం. వ్యవస్థాగతమైన చాలా రకాల కారణాలు దీనికి దోహదం చేస్తాయి. ఈ మాట డాక్టర్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా అంటున్నారు. గతంలో నడక అనేది చాలా సాధారణమైన విషయం. ప్రతి పనికి కూడా నడిచే వెళ్లే జీవన విధానం ఉండేది‌. ఈరోజు నడుస్తూ కనిపించే ప్రజలు తగ్గిపోతున్నారు. ఈరోజు అవసరాలకు అనుగుణంగా వచ్చిన వాహనాలు ఒకవైపు మనకు సదుపాయం కలిగిస్తూనే, మరోవైపు మనకు ఏ రకమైన శారీరక శ్రమ లేకుండా మనల్ని ఊబకాయులుగా మార్చేస్తున్నాయి. మరోవైపు, సర్వీస్ పరిశ్రమ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు కూడా ఆఫీసుల్లోకి వెళ్లి కూర్చొని గంటలు గంటలు పని చేయాల్సిన అవసరం ఉంది‌. ప్రైవేట్ కంపెనీలో అయితే 12 నుంచి 14 గంటలు పనిచేస్తే తప్ప శాంతించని యజమానులు ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసే శ్రామికులు మేధా శ్రామికులైనప్పటికీ కూడా మరో దారి లేక గదులకు అతుక్కుని సర్దుకోవాల్సి వస్తోంది. రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వ్యాయామం చేసే పరిస్థితి ఉండదు. ఇక ఏదో ఆదివారం సమయం దొరుకుతుందీ అంటే ఆరోజు కూడా ఎన్నెన్నో పనులు వేచి ఉంటాయి.

అప్పులు తెస్తున్న ప్రెషర్..!

ఇలా నడక గానీ, వ్యాయామం గానీ లేని ఒక కొత్త రకమైన జీవిత విధానం ప్రారంభమైంది. దానికి తోడు అనవసరమైన ఒత్తిడి. పనిలో ఒత్తిడి. ఇంట్లో ఒత్తిడి. జీవితంలో ఒత్తిడి. టార్గెట్లు. డబ్బు కోసం ఆరాటం. సందిగ్ధ పరిస్థితి. పనులు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని అస్థిరత. గతంలో కంటే అప్పులు సునాయాసంగా దొరుకుతున్నాయి. నగరాల్లో అద్దెలు పెరిగాయి. ‌ఇంతేసి అద్దెలు చెల్లించే కంటే ఏకంగా ఫ్లాట్ తీసుకుంటే అదే అద్దె ఈఎమ్ఐ‌గా బ్యాంకులకు చెల్లించవచ్చు అని ఎంతోమంది విపరీతంగా అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇది మరలా ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలు అటూ ఇటూ అయితే, ఇక కుటుంబంలో ఉన్న శాంతి కరువవుతోంది. కొత్త జీవన విధానం ఇలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌కు కారణం అవుతుంది. ఇదంతా కూడా వ్యక్తిగతమైన పొరపాటు అని ఎల్లవేళలా అనలేం. వ్యవస్థాగతమైన కారణాలు అనేకం ఉంటాయి. కాబట్టి, ఊబకాయం, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ మొదలైన రోగాలు నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ మనకు ప్రసాదించిన బహుమానాలు.. వ్యవస్థాగత మార్పు లు ప్రజల ప్రయోజనాల కోసం తీసుకురానంత వరకూ అమెరికాలో అయినా, మనదేశంలో అయినా ప్రయోజనం శూన్యం. అయితే, ప్రజలు వ్యక్తిగతంగా మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం.

కేశవ్

జాగృతి సమీక్ష సంపాదకులు

98313 14213

Advertisement

Next Story

Most Viewed