- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యానికి అడ్డుకట్ట వేయలేరా?
మద్యంతో జరిగే ప్రాణనష్టాలు, అనర్థాలపై సామాజిక చైతన్యం కల్పించే కనీస బాధ్యతను విస్మరించి, ఆ ఆదాయంతో వచ్చే నెత్తుటి కూడు, ఆ కుటుంబాల కన్నీళ్లకు ఆశపడే విధానాలు వెంటనే మానుకోవాలి. బంగారు తెలంగాణ అంటున్న ఏలికలు మద్యం తెలంగాణగా మారుస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు మద్యం ప్రమాదాలపై ప్రచారం చేయాలి. మేధావులు, మహిళలు, ప్రజా సంఘాలు ప్రజలను చైతన్యం చేయాలి. ఇది నిరంతరం ఉద్యమంగా సాగాలి. ఇందుకోసం బెల్టుషాపులు పెట్టని గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి.
ప్రభుత్వాలకు మద్యం దుకాణాల మీద ఉన్న శ్రద్ద మరే అంశం మీదా లేదు. మద్యం వలన కాలేయం, నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు దెబ్బతినడంతోపాటు రొమ్ము కాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. ధూమపానమూ తోడైతే ముప్పు తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా మద్యం కారణంగా యేటా 30 లక్షల మరణాలు జరుగుతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. మనదేశంలో యేటా 2.60 లక్షల ప్రాణాలు అర్ధంతరంగా కడతేరిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ప్రకటించింది.
నిద్రలేమి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, స్థూలకాయంలాంటి వాటితో శరీరం పోషక విలువలను గ్రహించే తత్వం కోల్పోతుంది. రహదారి ప్రమాదాలు, ఆత్మహత్యలు, కుటుంబ సభ్యులతో ఘర్షణలు, గృహహింస, వరకట్న వేదింపుల కారణంగా కుటుంబాలు వీధి పాలవుతున్నాయి. ఇలా దేశంలో యేటా ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే, ప్రజల ఆరోగ్యం కన్నా మన ప్రభుత్వాలకు మద్యం విక్రయాలే మిన్నగా మారాయి. ఈ విధంగా సంక్షేమరాజ్య భావనకు విఘాతం కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలు అమానవీయం. మత్తు పదార్థాల వినియోగాలను క్రమేణా తగ్గించి ఆరోగ్య భారతావనికి బాటలు వేయడం పాలకుల విద్యుక్త ధర్మమని 47వ రాజ్యాంగ అధికరణం చెబుతోంది. ప్రభుత్వాలు దానిని తుంగలో తొక్కుతున్నాయి.
దక్షిణాదిలోనే అధికం
దేశవ్యాప్తంగా అమ్ముడుపోతున్న మద్యంలో 45 శాతం వాటా ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలదేనని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ గడిచిన ఆరేండ్లలో మద్యం అమ్మకాల గణాంకాలు ఇలా ఉన్నాయి. 2016లో రూ.14,075.51 కోట్లు, 2017లో రూ.16,595.97 కోట్లు, 2018లో రూ.20,012.05 కోట్లు, 2019లో రూ.22,144.87 కోట్లు, 2020లో రూ.25,601.39 కోట్లు, 2021లో రూ.30,222.27 కోట్లు వెరిసి గడిచిన ఆరేండ్లలో రూ.1.28 లక్షల కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. మద్యపాన వ్యవసనం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు 2,620 ఉన్నాయి. కానీ 40 వేల నుంచి 50 వేల బెల్ట్‌షాపులలో అనధికారికంగా మధ్యం విక్రయాలు జరుగుతున్నాయి. లక్షలాది కుటుంబాలు ఈ వ్యసన ఊబిలో చిక్కుకొని ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా చితికిపోతున్నాయి. యువశక్తి నిర్వీర్యం అవుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కలిపి సగటున 36.2 శాతం మంది రోజూ తాగుతున్నారు. 54 శాతం మంది వారంలో ఒకసారి మత్తులో మునిగిపోతున్నారు. 15-49 ఏండ్ల వయస్సులో రోజు తాగేవారిలో పురుషులతో పాటు మహిళలూ పెద్ద సంఖ్యలో ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 చెబుతోంది.
అందుకు కారణాలివే
మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసకూ ప్రధాన కారణం మద్యపానమేనని తెలుస్తున్నది. మద్యం తాగే అలవాటు వ్యసనంగా మారి 30 నుంచి 40 ఏండ్లలోనే అనారోగ్యాలతో పురుషులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వలన మహిళలు యుక్తవయస్సులోనే వితంతువులుగా మారుతున్నారు. యువశక్తి నిస్సారం అవుతున్నది. సామాజిక మంత్రిత్వ శాఖ 2019లో దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో రాష్ట్రవ్యాప్తంగా 59,13,600 మంది మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని తేలింది. వీరిలో 6,33,600 మంది వాటికి బానిసలుగా మారుతున్నారని వెల్లడైంది. ఇప్పుడు ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుందనేది అంచనా.
మద్యం అమ్మకాలను జోరుగా ప్రోత్సహిస్తూనే, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అరికట్టాలనే చర్యలకు పూనుకోవడం ఏ రకంగా సమంజసం? మద్యంతో జరిగే ప్రాణనష్టాలు, అనర్థాలపై సామాజిక చైతన్యం కల్పించే కనీస బాధ్యతను విస్మరించి, ఆ ఆదాయంతో వచ్చే నెత్తుటి కూడు, ఆ కుటుంబాల కన్నీళ్లకు ఆశపడే విధానాలు వెంటనే మానుకోవాలి. బంగారు తెలంగాణ అంటున్న ఏలికలు మద్యం తెలంగాణగా మారుస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు మద్యం ప్రమాదాలపై ప్రచారం చేయాలి. మేధావులు, మహిళలు, ప్రజా సంఘాలు ప్రజలను చైతన్యం చేయాలి. ఇది నిరంతరం ఉద్యమంగా సాగాలి. ఇందుకోసం బెల్టుషాపులు పెట్టని గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి.
భూక్య నాగేశ్వరరావు
సామాజిక ఉద్యమకర్త
మిర్యాలగూడ, నల్గొండ