బీసీకే బీజేపీఎల్‌పీ పోస్ట్!

by Ravi |

బీసీ సీఎం నినాదంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ తెలంగాణలో ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 4 స్థానాలను కైవసం చేసుకున్నది. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు తమతమ శాసనసభాపక్ష నేతలను ప్రకటించగా, బీజేపీ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంచింది. బీసీ నినాదంతో ముందుకెళ్లడంతో శాసనసభాపక్ష నేతను కూడా బీసీనే ఎన్నుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీ హై కమాండ్, రాష్ట్ర నాయకత్వం మధ్య చర్చలు నడుస్తుండగా, పాయల్ శంకర్ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీసీని కాదనుకుంటే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశం కనిపిస్తున్నది.

ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బీజేపీ నాలుగు స్థానాలను గెలుపొందింది. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్నది. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ నుంచి పవార్ రామారావు పాటిల్, సిర్పూర్ నుంచి హరీశ్ బాబు విజయం సాధించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే శాసనసభాపక్ష నేత పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముధోల్ నుంచి గెలిచిన రామారావు పటేల్ ఓబీసీ కావడం, ఆయన పార్టీలు మారి బీజేపీలోకి రావడంతో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. బీజేపీ నుంచి గెలిచిన ఏకైక బీసీ ఎమ్మెల్యే కావడం పాయల్ శంకర్‌కు కలిసొస్తున్నది. ఆయన దశాబ్దంన్నర కాలంగా బీజేపీలోనే ఉంటున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని కాపాడుతూ వస్తున్నారు. బీసీని కాదనుకుంటే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి అవకాశమివ్వనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డికే ఎక్కువగా మాట్లాడడానికి అవకాశమిచ్చారు.

రాజాసింగ్‌పై విముఖత

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులంతా ఓటమి పాలయ్యారు. గోషామహల్ నుంచి ఒక్క రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. అయితే మొదట బీజేపీఎల్పీ నేత పోస్టు తనకే అని ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర నాయకత్వం అందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సిటీలో ఒక్క సీటు మాత్రమే గెలుపొందడం, రాజాసింగ్ గోషామహల్‌కే పరిమితం కావడం, హిందూత్వ ఎజెండా తప్ప ఇతర అంశాలపై పట్టు లేకపోవడం, తెలుగు సరిగా మాట్లాడరాకపోవడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించవద్దని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు తనను కాదని ఇతరులకు బీజేపీఎల్పీ పోస్ట్ ఇవ్వాలని భావిస్తే.. పాయల్ శంకర్‌కు ఇవ్వాలని రాజాసింగ్ ప్రతిపాదించినట్లు సమాచారం.

సామాజిక సమీకరణాలతో..

ఎన్నికల సమయంలో మెజార్టీ సీట్లు సాధిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో గత ఎన్నికల కంటే బీజేపీ ఓటు శాతాన్ని రెట్టింపు చేసుకుందనే వాదనా ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీఎల్పీ నేతగా బీసీని ఎన్నుకోకుంటే విమర్శలు వచ్చే ప్రమాదమున్నది. అందుకనే అధిష్టానం ఆ పోస్టు కోసం బీసీ ఎమ్మెల్యే అయిన పాయల్ శంకర్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పాయల్ శంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు రాష్ట్ర, జాతీయ నాయకత్వంతోనూ మంచి సంబంధాలున్నాయి. సామాజిక, రాజకీయ పరిణామాలను పరిశీలించడంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా అధిష్టానం అడుగులు వేస్తున్నది.

-ఫిరోజ్ ఖాన్,

సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464

Advertisement

Next Story