ప్రజలకు మేలు చేయని మ్యానిఫెస్టో!

by Ravi |   ( Updated:2023-11-23 00:46:03.0  )
ప్రజలకు మేలు చేయని మ్యానిఫెస్టో!
X

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. వారి ఎన్నికల ప్రణాళిక ఎనభై పేజీల దాకా ఉన్నది. అయితే, అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమేరకు అవసరం వస్తుందో చూద్దాం..!

ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతారా?

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు సమ్మక్క సారక్క పేర్ల మీద గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో గిరిజనులకు ఉన్న రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్రం పక్కకుపెట్టింది.దీనిపై నేటికీ స్పందించలేదు కేంద్రం! పైగా తమకు గిరిజనులపై ఎంతో ప్రేమ ఉందని ప్రకటించుకునే బీజేపీ నూతన పార్లమెంట్ భవనానికి, రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదు? గిరిజనులపై ఇంతటి వివక్షత చూపుతున్న బీజేపీ ప్రభుత్వానికి గిరిజనులపై ప్రేమ ఉన్నదంటే నమ్మగలమా? అలాగే మహిళలకు మేలు చేస్తామని, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ మరి పది సంవత్సరాలుగా సిలిండర్ ధరలు పెంచుతుంది ఎవరు? ఇప్పుడు తగ్గిస్తామంటే ప్రజలు నమ్ముతారా?

అలాగే బీసీ వర్గం వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ అంతకంటే ముందు బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తికి ప్రజాదరణ రావటంతో ఓర్వలేక పదవి నుండి తొలగించి అగ్రకులానికి చెందిన వ్యక్తిని అధ్యక్షులుగా నియమించుకున్న బీజేపీ పార్టీకి వెనుకబడిన వర్గాలపై ప్రేముందంటే ఎంత మాత్రం ప్రజలు నమ్ముతారో ఆలోచించుకోవాలి!

షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ..!

ఇక షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణకు మద్దతుగా రాష్ట్రంలో అన్ని పార్టీల మద్దతు లభించింది. దీనిపై బీఆర్ఎస్ సైతం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై స్పందించకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణకు సహకరిస్తామని చెబితే ఇది ఎన్నికల కోసం మాట్లాడే మాటలే తప్ప మరేమీ కాదని స్పష్టం అవుతుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ చేయటం చాలా సులభమైన పని కానీ చేయడం లేదు. రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై ఒక కమిటీ వేస్తామని చెప్పి వెళ్లారు.అయితే, నిజానికి షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై కమిటీ వేయాల్సిన అవసరం లేదు పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేసి వర్గీకరించవచ్చు అలా చేయడం ఇష్టం లేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేస్తామని చెప్పడం షెడ్యూల్ కులాల వర్గీకరణపై చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది.

ఉపయోగపడని మ్యానిఫెస్టో!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ తెలంగాణకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు కానీ అసలు తెలంగాణ రాష్ట్ర పూర్వ వైభవం అంటే ఏమిటనీ చెప్పలేదు. ఇక కృష్టా నదీ జలాలలో తెలంగాణ వాటా తేల్చాలి అంటున్న బీజేపీ పార్టీ, తెలంగాణకు రావాల్సిన వాటాను పంచకపోగా పైన ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదాను కల్పిస్తూ తెలంగాణకు దక్కాల్సిన వాటాను దక్కకుండా చేస్తుంది. పక్కనున్న రాష్ట్రాలలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తే తెలంగాణకు నదీ జలాల్లో రావాల్సిన వాటా ఎలా వస్తుంది.

ఇక సమగ్ర ధాన్యలక్ష్మీ ప్రణాళిక పథకం ప్రవేశపెట్టి రైతులు పండించే ధాన్యాలకు సరైన గిట్టుబాటు ధరను కల్పిస్తామని బీజేపీ చెబుతోంది. మరీ వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ల చేతుల్లో పెట్టి వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించాలని చూసింది ఎవరు? ఇక పసుపు బోర్డు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పసుపు బోర్డుపై ఎన్నో ఎండ్లుగా డిమాండ్ చేస్తున్న చివరికి ఎన్నికల ముందు రాష్ట్రానికి పసుపు బోర్డు కేటాయించడం హస్యస్పదం. ఇక నారీ శక్తి వందన్ పేరుతో మహిళలకు మూప్పై శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా చట్టసభలలో,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు అవకాశం కల్పిస్తామనే పేరుతో రిజర్వేషన్లు కల్పించనున్నారు ఇది చాలా పెద్ద మోసం. ఈ బిల్లులో వెనుకబడిన వర్గాల మహిళల సబ్ కోట కేటాయించకుండా రిజర్వేషన్లు తీసుకురావాలనుకొవటం వెనకబడిన వర్గాల మహిళలను చట్ట సభలకు దూరం చేయడమే అవుతుంది. ఇలా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎన్నికల ప్రణాళిక ప్రజలకు ఉపయోగపడేలా లేదని తేలిపోయింది.

గుండమల్ల సత్యనారాయణ

95059 98838

Advertisement

Next Story

Most Viewed