జానపద సాహిత్యానికి రారాజు బిరుదురాజు

by Sumithra |   ( Updated:2023-04-15 09:25:09.0  )
జానపద సాహిత్యానికి రారాజు బిరుదురాజు
X

ఒక ప్రాంతం యొక్క భాష, చరిత్ర, సంస్కృతి కళావైషిష్ట్యమంతా జానపద సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. అటువంటి జానపద సాహిత్యంపైన తెలుగులో అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో మొదటగా పి హెచ్ డి పట్టా పొందినవాడు, విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద సాహిత్యానికి సముచిత స్థానం కల్పించినవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు.

తెల్ల ధోవతి లాల్చీ కండువా ధరించి నుదుటన నులువు తిలకం బొట్టుతో అచ్చమైన,స్వచ్చమైన పల్లెదనానికి ప్రతీకగా కనిపించే రామరాజు 1925 ఏప్రిల్ 16న హనుమకొండ జిల్లా దేవనురు గ్రామంలో లక్ష్మీ దేవమ్మ, నారాయణ రాజు దంపతులకు జన్మించారు. దేవనురు, మణికొండ, వరంగల్లులో ప్రాథమిక , మాధ్యమిక విద్యను హైదరాబాదులోని నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్, ఉస్మానియా విశవవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. న్యాయశస్త్రాన్ని అభ్యసించి 'లా, పట్టా పొందాడు.

మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్రమహాసభల సందర్భంగా మహాత్మాగాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఇతడు ఆ సభలలో వాలంటీర్‌గా పాల్గొన్నాడు. మహాత్మాగాంధీతో కలిసి పాదయాత్ర చేశాడు. వరంగల్‌లో చదువుకునే రోజుల్లో ఇతనిపై ఆర్యసమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.

కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవాచారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు మొదలైన యువనాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగారశిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.

ఎం.ఎ.చదివే సమయంలో సి.నారాయణరెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణకవులు అనే పేరుతో జంటకవులుగా కవిత్వం చెప్పాడు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణా రచయితల సంఘం ఇతడు మొదటి కార్యదర్శిగా ప్రారంభమైంది.

సివిల్ సర్వీసులో ఉత్తీర్నుడై పంచాయతీ ఆఫీసరుగా ఎంపికయ్యాడు. సురవరం గారి సలహా మేరకు ఆ ఉద్యోగంలో చేరకుండా సాహిత్య పరిశోధన వైపు అడుగులు వేసాడు. జానపద సాహిత్యంపై తన పరిశోధనలు కొనసాగించాడు. పల్లెల్లో పామరజనం పాడుకునే లల్లాయి పదాలు పరిశోధనాంశంగా తగదని విశ్వవిద్యాలయ పెద్దలు, పండితులు అభ్యంతరం చెప్పారు. అయితే ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, సురవరం గార్ల చొరవతో రామరాజు పరిశోధనకు అనుమతి లభించింది.

జానపద సాహిత్యం అచ్చమైన పల్లె సంస్కృతికి, ప్రజా జీవనానికి మూలమని భావించిన రామరాజు రవాణా సౌకర్యాలు బొత్తిగా లేని ఆ రోజుల్లో కాలి నడకన మైళ్ల కొద్ది ప్రయాణించాడు. అనేక మారుమూల పల్లెల్లో తిరుగుతూ ఎందరినో కలుసుకుని వారు పాడే పాటలను విని రాసుకునేవారు. సుదీర్ఘంగా సాగిన ప్రయాణంలో కొన్నిసార్లు జబ్బు పడ్డాడు. తిండికి ఇబ్బంది పడ్డాడు, పస్తులున్నాడు. అలసటతో సృహ తప్పి పడిపోయేవాడు అయినా పట్టువదలక ఎంతో శ్రమపడి ఎన్నో ప్రాంతాలు తిరిగి అజ్ఞాతంలో ఉండిపోయిన పాటలను సేకరించాడు. ఆ పాటలను పరిశీలించి, అధ్యయనం చేసి, పరిశోధించి వాటికి సమగ్ర రూపాన్ని ఇచ్చి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో తెలుగు జానపద గేయ సాహిత్యంగా అందించి పి హెచ్ డి పట్టా పొందాడు. రామరాజు కృషి భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శకమైంది. రామరాజు అందించిన ఆ జానపద విజ్ఞాన భాండాగారం నేడు ఎంతో మందికి పరిశోధనాంశం అయ్యింది.

ఆంధ్రయోగులు, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, తెలంగాణా పిల్లల పాటలు,తెలంగాణా పల్లెపాటలు వీరగాథలు, తెలు జానపద రామాయణం మొదలగు ఎన్నో రచనలు చేశాడు. 1994 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది అలాగే 1995 లో భారత ప్రభుత్వం రామరాజుకు నేషనల్ ప్రోఫెషనల్ షిప్ ఇచ్చి గౌరవించింది. 20062007 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారే 'విశిష్ట పురస్కారం, అందించారు. బిరుదురాజు రామరాజు, అస్వస్థత కారణంగా 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.

(నేడు బిరుదురాజు రామరాజు జయంతి)


సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

9000674747

Advertisement

Next Story

Most Viewed