- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్షణికావేశం అనర్థాలకు మూలం
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కూరలో కారం ఎక్కువైందనో, ఉప్పు లేదనో, ఉప్పు ఎక్కువైందనో భార్యను చితక బాదిన సంఘటనలు.. చికెన్ తేలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలు, పరీక్షలో చీటీ ఇవ్వలేదని చితకబాదిన స్నేహితుడి ఉదంతాలు, హోటల్‌లో సాంబారు వేడిగా లేదనో.. త్వరగా తేలేదనో బేరర్‌నీ చితక బాదిన ఉదంతాలు.. కట్టుకున్న చీర బాలేదనో, లేదా తాను చెప్పిన చీర కట్టుకోలేదనో చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలి వానై కాపురాలు కూలిన సంఘటనలు ఎన్నో..
పక్కింటి మహాలక్ష్మి పట్టు చీర కట్టుకుంది.. వడ్డాణం కొనుక్కుంది..లేదా పక్కింటోళ్లు కలర్ టీవీ తెచ్చుకున్నారనో అలిగి ఆవేశపడి లోకాలు విడిచిన సంఘటనలు చూశాం. అమ్మ గారింటికి పంపియ్యలేదనో లేక అత్తారింటికి పోదామంటే వద్దన్నప్పుడో.. అలిగి ఆత్మ హత్యలు చేసుకున్న దాఖలాలు కోకొల్లలు. ఇలాంటి ఉదాంతాలెన్నో నిజ జీవితంలో చూస్తున్నాం. పిల్లలు సెల్‌ఫోన్ కోనివ్వలేదనో, కాలేజ్ ఫ్రెండ్స్‌తో టూర్‌కి పంపియ్యలేదనో ప్రాణాలు తీసుకున్న వార్తలు చదివాం. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన చూశాం. అన్నదమ్ముల మధ్య ఆస్తి, భూ పంపిణీలో తేడాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం లేదా సొంత అన్నదమ్ములను చంపిన సంఘటనలు చూశాం. వీటన్నిటికీ క్షణికమైన ఆవేశం విచక్షణ కోల్పోయి చేసినవే.. ఆ తరువాత కుమిలి కుమిలి ఏడ్చిన ఉదంతాలే..
సమస్యకు చావే పరిష్కారమా?
1859లో ఒక నల్ల పందిని చంపినందుకు అమెరికా బ్రిటన్‌ల మధ్య నాలుగు నెలల యుద్ధం జరిగింది. 1925లో ఓ గ్రీసు సైనికుడు కుక్కను తరుముతూ పొరపాటున బల్గేరియాలో అడుగు పెట్టిన పాపానికి కాల్చి చంపితే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. ద్రౌపది దుర్యోధనుడిని చూసి నవ్విందనే కారణంతో మహాభారత యుద్ధమే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చరిత్రకు అంతమే ఉండదు. ఇవన్నీ నిజ జీవితంలో జరిగినవే.. జరుగుతున్నవే. మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో విచక్షణ కోల్పోయి భావోద్వేగాలు నియంత్రించుకోలేక క్షణికావేశానికి గురై చేయకూడని పనులు చేస్తున్నారు. హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలకు తనువులు చాలిస్తున్నారు. కొన్నిసార్లు అనారోగ్యం కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమను ఇంట్లో ఒప్పుకోవడం లేదనో ఇలా ఇతర కారణాలతో బతకడం కన్న చావే మేలని వారి ఉసురు వారే తీసుకుంటున్నారు. ఇక రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కొదువేలేదు. నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇవ్వన్నీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు. తమ నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నవే.. సమస్యకు చావే పరిష్కారం అని నిర్ణయానికి వచ్చి బలవన్మరణాలు పొందుతున్నారు. క్షణికావేశంలో విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తమతో పాటు తమను నమ్ముకున్న వారినీ ఈ లోకం నుంచి తీసుకెళ్తున్నారు. ఆవేశంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం పెద్ద పెద్ద ఉపద్రవాలనే సృష్టిస్తుంది. బతికి ఉన్న వారు అనాధాలుగా మిగిలిపోతున్నారు. వారు జీవితాంతం నరక యాతన పడుతున్నారు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది..
సమస్యలన్నింటిని కొంచెం నిగ్రహం మరికొంచెం ఓర్పు సహనం వహిస్తే 200 శాతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు.. ఏదో ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఆ తరువాత ఎంత పశ్చాత్తాప పడ్డా విలువైన ప్రాణాలు తిరిగి రావని గమనించాలి. విరిగిన మనసులు అతుక్కోవు. తెగిన కాళ్ళు చేతులు తిరిగి మొలవవు. కూలిన సంసారాలు నిలబడవు. బంధాలు, అనుబంధాలు పెనవేసుకోవు. జీవితాంతం శత్రుత్వాన్ని మూట కట్టుకోవాలి. పగలు ప్రతీకారాలు నిత్యకృత్యం అవుతాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తరువాత వగచి లాభం లేదు. ఆవేశం అందరికీ వస్తుంది.. అయితే అది అదుపులో పెట్టుకొని విచక్షణతో వ్యవహరిస్తే ఉపద్రవాల నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కార దిశగా ఆలోచన చేయకుండా అతిగా ఆలోచించడం, మానాలి. సమస్యను భూతంగా ఊహించుకోవడం, భయపడడం మానాలి. వేల రూపాయల అప్పు తీర్చలేక కొందరు పరువు కోసం ప్రాణాలు తీసుకుంటే.. మరో పక్క వందల కోట్ల అప్పులు చేసి దేశ సరిహద్దులు దాటి దర్జాగా బతికేస్తున్నారు. అంటే వారిని ఆదర్శంగా తీసుకొమ్మని కాదు, వారిలోని తెగువ, ధైర్యాన్ని అలవరచుకోవాలి. బతికి ఉంటే బలుసు ఆకైనా తినవచ్చనే దిశగా ఆలోచించాలి.
బలవన్మరణం లేదా హత్య రెండూ నేరాలే.. రెండూ విచక్షణ కోల్పోయి చేసేవే.. బలవన్మరణం వల్ల ఆ వ్యక్తి చనిపోయి ఉన్న వారికి క్షోభ మిగులుస్తారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి జీవితానికి తెర పడుతుంది. కానీ ఉన్నవారికి అగచాట్లు ప్రారంభమవుతాయి. వారి సంతానం పడరాని పాట్లు పడుతుంది. అలాగే క్షణికావేశంలో చేసిన నేరానికి శిక్ష పడి జీవితాంతం నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. క్షణ క్షణం చస్తూ బతకాల్సి వస్తుంది. కోపం, ఆవేశం రెండూ తాత్కాలికమే.. రెండు క్షణాలు ప్రశాంతంగా ఆలోచిస్తే రెండూ తగ్గి ఓ మంచి నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. చచ్చి సాధించేది ఏమీ ఉండదు.. బతికి ఉంటే ఏదైనా సాధించవచ్చు. జీవితంలో ప్రేమ ఒక్కటే సర్వం కాదు. ప్రేమించిన వ్యక్తి ఛీ కొట్టినరనో, నో చెప్పినరనో ప్రాణాలు తీసుకునే బదులు అది నీకు మరొకరితో రాసి పెట్టి ఉందని గమనించాలి.
అందరూ తెరమరుగు కావాల్సిందే..
జీవితం అంటే కేవలం ప్రేమ, పెళ్లి మాత్రమే కాదు. ప్రపంచం ఎంతో పెద్దది. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవి అన్నీ ఆస్వాదించడానికి బతికి ఉండాలి కదా.. ఒక ఉద్యోగం రాలేదని దిగులు పడే బదులు ఇంకో మంచి ఉద్యోగం వస్తుందని గ్రహించాలి. భూమిపై ఎవరూ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వితం కాదు అని గుర్తెరిగి అనవసర పరుగులు, పందాలు, డబ్బు, సంపద కోసం వెంపర్లాట మాని ప్రశాంతంగా బతకడం నేర్వాలి. వేల కోట్లు సంపాదించిన బిల్ గేట్స్, టాటాలు, నారాయణ మూర్తి ఎంతటి ఉదార గుణంతో దానధర్మాలు చేస్తున్నారు. లక్షల కోట్లు సంపాదించిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు వారంతా ఏం మూట కట్టుకుపోయారు? కేవలం ఒకరు సంపాదించుకున్న మంచి, చెడు మాత్రమే చనిపోయాక బతికి ఉంటాయి. వాటి గురించి రెండు రోజులు ప్రజల నాలుకలపై ఉంటుంది. ఆ తరువాత అదీ కనుమరుగు అవుతుంది. అందుకోసం ఎందుకు వెంపర్లాట. భూమిపై ఏదీ శాశ్వతం కాదన్నప్పుడు.. ఇవన్నీ అవసరమా ఆలోచించాలి. తుచ్ఛమైన ఆస్తి కోసం అమ్మా, నాన్నలను అలాగే అన్నదమ్ములను చంపుకోవడం అవసరమా ఆలోచించాలి. నిర్ణయానికి ముందు ప్రశాంతంగా రెండు క్షణాలు కళ్ళు మూసుకొని ఆలోచించాలి. కోపం, ఆవేశం మనిషికి సహజం. కానీ ఆవేశాన్ని అణచుకోవడానికి ఏదో ఒక ట్రిక్ ఉపయోగించుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఒకటీ, రెండూ అని లెక్క పెట్టుకున్నట్లు, లేదా ఇష్టమైన దేవుడిని లేదా ఇష్టమైన వారికి స్మరించుకోవడం చేయాలి. లేదా శ్వాసపై లగ్నం చేసి కొంత సేపు ప్రశాంతంగా ఆలోచించాలి. ప్రతి ఓటమి వెనుక విజయం దాగి ఉంటుంది అని గమనించండి. ప్రపంచమే ఒక నాటక రంగం ప్రతి ఒక్కరూ పాత్రదారులే.. అంటారు షేక్స్పియర్ ప్రతి ఒక్కరూ వారి వారి పాత్ర పోషించి తెర మరుగు అవ్వాల్సిందే. వినాశ కాలే విపరీత బుద్ది అంటారు. ఆ వినాశ ఘడియలు వాయిదా వెయ్యండి. విలువైన ప్రాణాలను క్షణ కాలంలో అనంత వాయువుల్లో కలవకుండా కాపాడండి.
శిరందాస్ శ్రీనివాస్
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ
94416 73339