ఆ ఇద్దరికీ ఇది సవాలే!

by Viswanth |   ( Updated:2022-03-10 13:05:37.0  )
ఆ ఇద్దరికీ ఇది సవాలే!
X

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తులకు 'డూ ఆర్ డై' బ్యాటిల్‌గా మారింది. ఆ ఇద్దరూ ఉద్యమ నేపథ్యం ఉన్నవారే. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సహచరులుగా పనిచేసినవారే. ఒకరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరొకరు ఆయన ఆదేశాలను ఇంతకాలం తు.చ. తప్పకుండా అమలుచేసిన ఈటల రాజేందర్. దాదాపు ఒకటిన్నర దశాబ్దానికిపైగా ఇద్దరూ సన్నిహితులు. 'అన్నా' అని కేసీఆర్‌ను పిలవగలిగినంత దగ్గర. 'రాజేంద్రా.. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్' అని నిండు అసెంబ్లీలో వైఎస్‌ఆర్ నిలదీస్తే గులాబీ పార్టీని గుండెలలో పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా 'వస్తావా.. నా మీద పోటీ చేస్తావా' అని కేసీఆర్‌నే సవాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా' అంటూ ఈటల రాజేందర్ బహిరంగంగానే చెప్పుకున్నారు. గెలుపుపై ఆయనకు అంతటి ధీమా. 17 ఏళ్లుగా గెలిపిస్తున్న ప్రజల పట్ల ఉన్న నమ్మకం ఆయనది. గెలవాల్సిన అవసరమూ అంతే. గెలవకపోతే నాయకుడిగా రాజకీయాలలో జీరో అవుతారు. భవిష్యత్తులో టీఆర్ఎస్‌ను విమర్శించే స్థాయినీ కోల్పోతారు. రాజకీయ జీవితంలో తొలి ఓటమి అవుతుంది. ఇప్పటిదాకా ఈటల వల్లె వేస్తున్నట్లుగా కేసీఆర్ అహంకారానిదే పైచేయి అయినట్లవుతుంది. తాను చెప్పుకుంటున్న ఆత్మగౌరవం పసలేని నినాదంగానే మిగిలిపోతుంది. అందుకే ఇక్కడ గెలుపు ఈటలకు తప్పనిసరి. ఈటల ఓడితే వ్యక్తిగా రాజకీయంగా పతనమవుతారు. టీఆర్ఎస్ ఓడితే ఆ పార్టీకి ప్రజలలో విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది.

పలుకుబడే కీలకం

ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఆయనకున్న వ్యక్తిగత పలుకుబడి, ప్రజలలో ఉన్న ఆదరణే కీలకం అవుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ అయినా అక్కడ గెలుపు ఓటములు ఆయనకు సంబంధించినవిగా ఉండవు. ఆటు కేసీఆర్ ఫేస్ వ్యాల్యూ, ఇటు హరీశ్‌రావుకు ఉన్న ట్రబుల్ షూటర్ అనే గుర్తింపు కారణమవుతాయి. నిన్నమొన్నటిదాకా ఈటల, హరీశ్‌రావు కూడా ఉద్యమ సహచరులే. మంత్రివర్గంలో కలిసి ఉన్నవారే. అయినా ఇప్పుడు రాజకీయాలు వారి మధ్య స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని చెరిపేశాయి. ప్రత్యర్థులుగా మారిపోయారు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి వ్యక్తిగత వివరాలను మరొకరు బైటపెట్టుకుంటున్నారు. పైగా ఎన్నికలలో కేసీఆర్ ఎత్తులు ఎలా ఉంటాయో ఈటల రాజేందర్‌కు తెలియందేమీ కాదు. ఉద్యమపార్టీగా మొదలైన ఏడేండ్లలో స్థానిక ఎన్నికల మొదలు సాధారణ ఎన్నికల వరకు అనేకం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంతో అనుభవాన్ని నేర్పాయి. ఎవరిని ఎక్కడ నొక్కాలో, ఎక్కడ తొక్కాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అదే జరుగుతున్నది. ఆరు నూరైనా ఈటల ఇక్కడ ఓడిపోవడమే కేసీఆర్‌కు కావాల్సింది. ఇంతకాలం ఈటలను గెలిపించింది కారు గుర్తు, కేసీఆర్ ఇమేజ్ మాత్రమే అనేది టీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నది.

ఎన్నిక చిన్నది అయినా

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా ఓడినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ప్రభుత్వం కూలిపోయేదీ లేదు. ఇంకో మెట్టు పైకి వెళ్లేదీ లేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అన్నారు. ఇది చాలా చిన్న ఎన్నిక అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. పెట్టాలన్న అభిప్రాయాన్నీ వ్యక్తీకరించలేదు. కానీ, కేసీఆర్ మాత్రం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆలోచన, ఆచరణ ఆ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. ఏకంగా మండలానికొక మంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు. మూడు నెలలుగా ఎమ్మెల్యేలను గ్రామగ్రామానా తిప్పుతున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా దీన్ని చిన్న ఎన్నికగా కేసీఆర్ తీసుకోవడంలేదు. టీఆర్ఎస్ భవిష్యత్తు ప్రయాణాన్ని నిర్దేశించే ఎన్నికగా తీసుకుంటున్నారు. అందుకే ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన అసెంబ్లీ సమావేశానికి సైతం హాజరుకాకుండా నియోజకవర్గంలోనే చక్కర్లు కొడుతున్నారు. ప్రగతిభవన్ కేంద్రంగా కేసీఆర్ నిరంతరం సమీక్షలు జరుపుతున్నారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయిస్తున్నారు. కొత్త పథకాలను ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ప్రవేశపెడుతున్నారు. 'దళితబంధు'ను ఎన్నికల కోసమే పెడుతున్నామంటూ స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిధులను ఈ నియోజకవర్గానికి కుమ్మరిస్తున్నారు.

'గులాబీ' ప్రతిష్ట నిలిచేనా?

మరోవైపు ప్రజలలో గులాబీ పార్టీ పట్ల ఉన్న ఆదరణకు ఈ ఎన్నిక ఫలితం నిదర్శనంగా నిలవనున్నది. ఇంతకాలం కేసీఆర్ ఆలోచనలను ఆచరణలోకి తీసుకెళ్లిన రాజేందర్ ఇప్పుడు తనదైన వ్యూహానికి పదును పెట్టక తప్పడంలేదు. ఒక దశలో 'కేసీఆర్ ఆదేశిస్తే తల్లిదండ్రులను కూడా విడదీస్తా' అని ఈటల కామెంట్ చేశారు. కానీ, ఇప్పుడు 'కేసీఆర్ అహంకారానికి, ఈటల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం' అని కొత్త రాగం అందుకున్నారు. వీరిద్దరూ ఉప్పు-నిప్పుగా మారిపోయారు. ఒకప్పుడు 'ఈటల నా కుడి భుజం' అని కేసీఆర్ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ శ్రేణుల దృష్టిలో 'నమ్మకద్రోహి'. అహంకారం, ఆత్మగౌరవం లాంటి మాటలు ఎలా ఉన్నా ఇక్కడి గెలుపు రెండు పార్టీలకంటే ఇద్దరు వ్యక్తులకు ప్రధానంగా మారింది. గతంలో ఏ ఎన్నికలోనూ లేనంతటి మైండ్ గేమ్ ఇప్పుడు హుజూరాబాద్‌లో కనిపిస్తున్నది. ఉప ఎన్నిక షెడ్యూలును వాయిదా వేయించిందీ, ఇప్పుడు క్లియిర్ చేయించుకున్నదీ కేసీఆర్ అనే టాక్ వినపడుతున్నది. ఇందులో నిజం ఎంత ఉందనే సంగతి ఎలా ఉన్నా కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే షెడ్యూలు విడుదల కావడం బలం చేకూర్చినట్లయింది.

దసరా టు దీపావళి

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం జరుగుతున్నది. కత్తులు దూసుకుంటున్నాయి. హుజూరాబాద్‌లో పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే జరుగుతున్నది. కానీ జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీ నేతలంతా తనకు చాలా దగ్గర అనే భావం ఏర్పడేలా ఒకే నెలలో రెండుసార్లు ఢిల్లీ టూర్ చేశారు. గంటల తరబడి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులను డిఫెన్స్‌లోకి నెట్టేశారు. ఆ మేరకు కేసీఆర్ పొలిటికల్ మైండ్ గేమ్‌లో ప్రభావాన్ని చూపగలిగారు. ఇప్పటివరకు ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా రానున్న నెల రోజులు ఈటలకు, కేసీఆర్‌కు కీలకం. ఇప్పటివరకూ సీన్‌లోనే లేని కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థిని బట్టి ఓట్లలో చీలిక వస్తుంది. అది ఎవరికి లాభంగా మారుతుందనే గుబులు మొదలవుతుంది. బీరుకు, బిర్యానీకి, పచ్చ నోట్లకు అలవాటుపడిన ఓటర్లు గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తారని భావించలేం. ఇక సంక్షేమ పథకాల సంగతి సరే సరి. అక్టోబరు 30న జరిగే పోలింగ్ ఫలితం నవంబరు రెండున వెల్లడి కానున్నది. ఆ తర్వాత రెంజు రోజులకు వచ్చే దీపావళి పండుగ ఎవరి రాజకీయ జీవితంలో వెలుగు నింపుతుందో?

ఎన్. విశ్వనాథ్

Advertisement

Next Story

Most Viewed