ఉనికి కోల్పోయిన బ్యూరోక్రసీ

by Viswanth |   ( Updated:2022-03-10 09:43:13.0  )
ఉనికి కోల్పోయిన బ్యూరోక్రసీ
X

దళితుల అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకొచ్చిన 'దళితబంధు' పథకం తెలంగాణ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజల మధ్య అంతరాలను పెంచడానికి కారణమైంది. ఒక్కసారిగా తేనెతుట్టెను కదిలించినట్లయింది. సమాజంలోని అన్నివర్గాల ప్రజలను సమాన దృష్టితో చూడడం ముఖ్యమంత్రి బాధ్యత. కానీ, ఒక సెక్షన్ ప్రజలను అభివృద్ధిపథంలోకి తీసుకురావడానికి మిగతావారిని విస్మరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆదివాసీ, గిరిజన, బీసీ సంఘాలు ఇలాంటి పథకం తమకోసం కూడా తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే టీఆర్ఎస్‌కు ఇది ఓట్లు రాల్చేదిగా ఉంటుందా? లేక ఇతరుల ఓట్లను దూరం చేసుకునేందుకు దారితీస్తుందా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే పథకంగా కూడా ఇది మారనున్నదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారీస్థాయిలో అప్పులపై ఆధారపడుతున్న రాష్ట్రం లక్ష కోట్ల రూపాయలకుపైగా సమకూర్చుకోవడం ఆషామాషీ కాదు. ఉద్యోగుల జీతాలు, వేతనాల పెంపు అమలు కోసమే ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. పాత అప్పులపై వడ్డీలకే భారీ మొత్తంలో కేటాయించాల్సి వస్తున్నది. ఆర్థిక కోణంలో కూడా ప్రభుత్వానికి పెను సవాలే పొంచి ఉన్నది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అధికారులు 'జీ హుజూర్' అంటున్నారే తప్ప ఆచరణాత్మక ఇబ్బందులను వివరించలేకపోతున్నారు.

విఫలమైన పథకాలు

రాజకీయ కోణం నుంచి ఆలోచించి ముఖ్యమంత్రిస్థాయిలో కొత్త పథకాలకు అంకురార్పణ జరగడం ఆనవాయితీ. వాటిని అమలు చేయడంలో ఎదురయ్యే సాధక బాధకాలను ముఖ్యమంత్రికి వివరించాల్సిన బాధ్యత మాత్రం బ్యూరోక్రాట్లది. ఆ పథకానికి అవసరమైన మార్గదర్శకాల తయారీ మొదలు చివరి లబ్ధిదారుడి వరకు అమలు చేయడం ఐఏఎస్ మొదలు ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి కర్తవ్యం. గతంలో దళితులకు మూడెకరాల భూమి పథకం టీఆర్ఎస్ హామీగా ఉనికిలోకి వచ్చిందే. దాన్ని అమలుచేయడంలో ఎదురయ్యే సవాళ్లను క్షేత్రస్థాయి గణాంకాల ఆధారంగా విడమరిచి చెప్పి ప్రభుత్వానికి అర్థం చేయించడంలో అధికారులు విఫలమయ్యారు. అందుకే ఆ పథకం అర్ధంతరంగా నిలిచిపోయింది. 'ధరణి' అలాగే కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఒక పథకానికి ఎంత ఖర్చవుతుంది? ఆర్థిక వనరులను ఎలా సమీకరించుకోవాలి? ఏ రీతిలో అమలుచేయాలి? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరగాలి? లోపాలు జరగడానికి ఉన్న అవకాశాలేంటి? వాటిని ఎలా అధిగమించాలి? పారదర్శక విధానాన్ని ఎలా రూపొందించాలి? తదితర అంశాలన్నింటిపై లోతుగా కసరత్తు చేసి ముఖ్యమంత్రికి వివరించాల్సింది బ్యూరోక్రాట్లే. దురదృష్టవశాత్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన మొత్తం ప్రగతిభవన్‌లో కేంద్రీకృతం కావడంతో అధికారుల బాధ్యతలు కూడా అక్కడే డిసైడ్ అవుతున్నాయి. వారి పాత్ర పరిమితమైంది. రాజకీయ వ్యవస్థకు, పరిపాలనా వ్యవస్థకు మధ్య విభజన రేఖ మసకబారింది. అందుకే ఒక స్కీమ్ ఎగ్జిక్యూషన్‌లో ఎదురయ్యే ఇబ్బందులపై అధికారులెవ్వరూ పెదవి విప్పడంలేదు. అన్నింటికీ 'జీ హుజూర్' అంటున్నారు.

ప్లానింగ్‌కు, అమలుకు మధ్య అంతరం

అనేక సంక్షేమ పథకాలు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. ప్రభుత్వం సైతం గొప్పగానే చెప్పుకుంటుంది. కొన్ని పథకాలు నిధులు లేక నత్తనడకన నడుస్తున్నాయి. మరికొన్ని తాత్కాలికంగా ఆగిపోయాయి. కొన్ని అసలు పట్టాలే ఎక్కలేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3,016 చొప్పున భృతి ఇవ్వనున్నట్లు గత బడ్జెట్‌లో ప్రకటించిన ప్రభుత్వం దాన్ని అమలుచేయడంపై దృష్టి పెట్టలేదు. బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖతో పాటు అన్ని విభాగాలు పాలుపంచుకుంటాయి. వాటిని బడ్జెట్‌లో పెట్టే టైమ్‌లోనే విధివిధానాలతో పాటు లబ్ధిదారుల సంఖ్య, ఎంపిక, నిధుల లభ్యత లాంటి అంశాలపై కసరత్తు పూర్తవుతుంది. ఇప్పటికీ అది లాంచ్ కాలేదు. ప్లానింగ్ మొదలు అమలు వరకు అధికారులకు ప్రత్యేక పాత్ర ఉంటుంది. అది పరిమితమైంది. అధికారుల ప్రమేయమే లేకుండానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. మంత్రులే లేకుండా సీఎం సమీక్షలు జరుగుతున్నాయి. మంత్రులు, అధికారులూ ఈ విధానానికే అలవాటుపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వినడానికి పరిమితం అయ్యారు. వివరణ ఇవ్వడం ఆగ్రహానికి కారణమవుతున్నదని గ్రహించి నోరు విప్పకుండా ఉండడమే ఉత్తమం అనే ధోరణి నెలకొన్నది. పథకాలను సక్రమంగా అమలుచేయించే బాధ్యత అధికారులదే అయినా ఆచరణాత్మక అంశాలను సైతం సీఎం దగ్గర ప్రస్తావించడానికి జంకుతున్నారు. ప్రభుత్వపరంగా నిధుల విడుదలలో జాప్యంలాంటి లోపాలు జరుగుతున్నా దాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఇకపైన దళితబంధు అమలు విషయంలోనూ ఇదే తీరు రిపీట్ అయితే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహకు అందనిదేమీ కాదు.

మార్గదర్శకాలు లేని పథకం

మార్గదర్శకాలేవీ లేకుండానే 'దళితబంధు' పథకానికి నిధులు విడుదలయ్యాయి. వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా మొత్తం 76 దళిత కుటుంబాలకూ దీనిని అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎలాంటి గైడ్‌లైన్స్ లేకుండానే కేసీఆర్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. 24 గంటల వ్యవధిలోనే డబ్బులు కూడా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి. దాదాపు వారం రోజులైనా ఇప్పటికీ లబ్ధిదారుల గుర్తింపు జరగలేదు. ఆ పథకం ఎలా ప్రయోజనం కలిగిస్తుందో దళితులకూ అర్థం కాలేదు. దాని వెన్నంటే హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని రూ. 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు 21 వేల కుటుంబాలకూ దీన్ని వర్తింపజేస్తామని, రూ. 2100 కోట్లయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. జీఓలో మాత్రం అందుకు భిన్నమైన ప్రస్తావన ఉన్నది. ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాలను ఆశించి ఒక పథకాన్ని తీసుకొచ్చినా దాని ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా అమలుచేయించడం బ్యూరోక్రాట్ల బాధ్యత. కానీ ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి సాహసించడం లేదు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికీ చొరవ తీసుకోవడంలేదు. మళ్లీ ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగానే లోపాలన్నీ చర్చకు వస్తున్నాయి. ఆగ్రహం, అనుగ్రహం లాంటి అంశాల కారణంగా బ్యూరోక్రాట్లు వారి పాత్రను పరిమితం చేసుకున్నారు. భారీస్థాయి రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి సీఎం తీసుకున్న దళితబంధు పథకం అమలు ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది కాలమే తేలుస్తుంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికీ కొలిక్కి రాలేదు. బ్యూరోక్రాట్లు నిర్దిష్టమైన విధానంతో ఉన్నట్లయితే ఈ పేచీ ఉండేది కాదు. కానీ వారి చొరవను చంపుకోవడంతో దళితబంధు విషయంలో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది కీలకం.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story

Most Viewed