లాక్‌డౌన్ దెబ్బకు ఎకానమి విలవిల

by Harish |
లాక్‌డౌన్ దెబ్బకు ఎకానమి విలవిల
X

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని, లాక్‌డౌన్ ఆంక్షలను దాటి ఇప్పుడిప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం పొందుతున్నది. కంటోన్‌మెంట్ జోన్లు మినహా లాక్‌డౌన్ క్రమంగా అన్‌లాక్ అవుతున్నది. వ్యాపారాలు అన్నీ తెరుచుకున్నప్పటికీ మహమ్మారి భయం కారణంగా ప్రజలు ఆశించిన స్థాయిలో బయటికి రావడం లేదు. ఫలితంగా సరుకుల, సేవలకు డిమాండ్ పెరగడం లేదు. స్వల్పమొత్తంలో సాగుతున్న లావాదేవీలు, క్రయవిక్రయాలు, వ్యాపారాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అయినట్టుగా భావించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరేదేశంలోనూ లేనివిధంగా భారత దేశంలో సుదీర్ఘకాలం లాక్‌డౌన్ అమలైంది. దాని ఫలితంగానే ఈ సవాలు ఎదురైందని, మే నెలలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఫలితాలు మెరుగ్గా లేవని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకూ అన్ని రంగాలు రెండంకెల క్షీణతను నమోదు చేశాయి. పైగా ప్రముఖ ఏజెన్సీలన్నీ భారత ఆర్థిక వ్యవస్థ ఫలితాలు దారుణంగా ఉంటాయని అంచనాలను వెల్లడించాయి. తిరోగమనంలోనే ఉంటాయని విశ్లేషించాయి. ఇండియా 4.5 శాతం ప్రతికూలతను నమోదు చేస్తుందని గత వారాంతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చెప్పగా, గోల్డ్‌మెన్ సాచ్స్ ఇంకాస్త ఎక్కువగా 5 శాతం ప్రతికూలత నమోదు చేయనున్నట్టు అంచనా వేసింది. బ్లూమ్‌బర్గ్ ఎకానమిక్స్ సైతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రదర్శన 10.6 శాతం పడిపోతుందని అంచనా వేసింది.

ఆర్థిక వ్యవస్థలో బలహీన స్థితి…

సేవా రంగంలో కార్యకలాపాలు మే నెలలోనే స్వల్పంగా మెరుగుదల చూపించాయి. కానీ, ఇది రికవరీకి చిహ్నంగా భావించలేమని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాన సేవల సూచీ 5.4 శాతం నుంచి 12.6 శాతానికి పెరగ్గా, తయారీ 30.8 శాతం వద్ద ఉంది. ఐహెచ్ఎస్ మార్కెట్ నివేదిక ప్రకారం..ఎక్కువ కాలం వ్యాపారాలు స్తంభించిపోవడం, డిమాండ్ క్షీణించడం వల్ల ఉత్పత్తి పడిపోయింది. కొత్త ఆర్డర్లలో తగ్గుదల, ధరల ఒత్తిళ్లపైన వీటి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మే నెల ఎగుమతులు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 36.5 శాతం పడిపోయి సుమారు రూ. 1.43 లక్షల కోట్లకు క్షీణించాయి. అయితే, ఏప్రిల్ నెలకంటే ఇది స్వల్ప అధికం. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల వల్ల ఈ పెరుగుదల నమోదైనట్టు తెలుస్తోంది. కానీ, చమురుయేతర ఎగుమతులు గతేడాదితో పోలిస్తే 30.1 శాతం క్షీణతను నమోదు చేశాయి. వీటిలో రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్ కూడా పడిపోయాయి. ఎగుమతులతో పాటు దిగుమతుల్లో కూడా పదునైన సంకోచం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన స్థితిని సూచిస్తుందని అభిషేక్ గుప్తా సహా ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వినియోగదారుల విశ్వాసం…

ఇక, కరోనా భయం, లాక్‌డౌన్ దెబ్బకు వినియోగదారులు ప్రభుత్వం కంటే అప్రమత్తంగా ఉన్నారు. ఆదాయంలో క్షీణత, ఉద్యోగాలు పోతాయనే ఆందోళన వంటి కారణాలతో పాటు భవిష్యత్తు భయాలతో ఆచితూచి ఖర్చులను అదుపులో ఉంచుతున్నారు. ఇటీవల షాపర్‌ట్రాక్ తెలిపిన వివరాల ప్రకారం మే నెలలో రిటైల్ స్టోర్స్ వ్యాపారం 30 శాతం పడిపోయిందని, అలాగే, వినియోగదారుల విశ్వాసం చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయిందని సెంట్రల్ బ్యాంక్ సర్వే సూచించింది. ఇక, ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌ను ప్రతిబింబించే మరో విభాగం ఆటో విక్రయాలు. ఏప్రిల్‌లో సున్నా విక్రయాలు నమోదవడం, మే నెలలో కొంత మెరుగైనప్పటికీ అంతకుముందుతో పోలిస్తే చాలా తక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇక, బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిపదికన 6.8 శాతం నుంచి 5.5 శాతానికి పడిపోయింది. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ నగదును పంపించడంవల్ల తగినంత ద్రవ్యత ఉన్నప్పటికీ ఔట్‌స్టాండింగ్ బ్యాంక్ క్రెడిట్ రూ. 102.7 ట్రిలియన్ల నుంచి రూ. 102.2 ట్రిలియన్లకు దిగజారింది.

పారిశ్రామికోత్పత్తి…

పారిశ్రామికోత్పత్తి సూచీ ఏప్రిల్‌లో రికార్డు స్థాయికి పడిపోయింది. లాక్‌డౌన్ వల్ల అనేక పరిశ్రమలు మూతపడిన దశలోనే ఉన్నాయి. చాలా యూనిట్లు ఉత్పత్తి జరగలేదని ప్రభుత్వానికి నివేదించాయి. మౌలిక సదుపాయాల పారిశ్రామికోత్పత్తి గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌లో 38.1 శాతం తగ్గింది. పారిశ్రామికోత్పత్తి సూచీలో 40 శాతం కలిగి వున్న రంగాలు మార్చిలో 9 శాతానికి పడిపోయాయి. ఈ రెండింటి గణాంకాలు ఒక నెల వ్యవధిలో నివేదించబడ్డాయి.

Advertisement

Next Story