డ్రీమ్​ రైడ్​.. సామాన్యుడికి అందుబాటులో హార్లీ డేవిడ్ సన్

by Anukaran |
డ్రీమ్​ రైడ్​.. సామాన్యుడికి అందుబాటులో హార్లీ డేవిడ్ సన్
X

నేటి యువత రోడ్లపై రయ్​రయ్​మంటూ బైక్ పై దూసుకెళ్తుంటారు. యువత అభిరుచికి తగ్గట్లుగా మార్కెట్​లోకి కొత్తకొత్త బైక్​లు వస్తున్నాయి. ఒక్కో బైక్​ధర రూ.లక్షల్లో ఉంటుంది. పేద, మధ్యతరగతి యువకులు రూ.లక్షలు పెట్టి బైక్​లు కొనుగోలు చేయలేరు. అలాంటి వారి కోసమే నగరంలో బైక్​రైడ్​ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. యువత అమితంగా ఇష్టపమే హార్లీ డేవిడ్ సన్, రాయల్ ఎన్ ఫీల్డ్, బుల్లెట్, బజార్ ఎక్స్ ఫ్లోజర్, పల్సర్​బైక్లు 100 సీసీ నుంచి 220 సీసీ వరకు బైకులు అద్దెకు లభిస్తున్నాయి. మార్కెట్ లోకి వచ్చే కొత్త మోడల్ బైక్ లను సైతం నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. కోరుకున్న బైక్​ను యువత అద్దెకు తీసుకుని సరదా తీర్చుకుంటున్నారు. యువత మాత్రమే కాకుండా సొంత వాహనాలు లేని వారు, వివిధ పనుల మీద నగరానికి వచ్చిన వారు అద్దె బైకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారికి సమయం, డబ్బు ఆదా అవుతుండగా, బైక్​సెంటర్ ​నిర్వాహకులను ఆదాయ వనరుగా మారింది.
-దిశ ప్రతినిధి, హైదరాబాద్

లేటెస్ట్ మోడల్ బైకులతో పాటు ఏ బైక్ కావాలన్నా నగరంలోని బైక్ రైడ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇష్టపడిన బైక్​ను అవసరాలకు తగ్గట్లుగా అద్దెకు తీసుకోవచ్చు. ఒక రోజు మొదలుకుని గరిష్ఠంగా మూడు నెలల వరకు బైకులు అద్దెకు తీసుకోవచ్చు. ఎంచుకునే వాహనాన్ని బట్టి అద్దె చెల్లించాల్సి ఉం టుంది. వాహనం కావాలనుకునే వారు సంస్థ అడిగే పత్రాలతో పాటు వారు విధించే షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.

కావాల్సిన పత్రాలు..

వాహనం అద్దెకు తీసుకునే వారు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్​పోర్టు, పాన్ కార్డులలో ఏదేని ఒకటి, ఆధార్ జిరాక్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. నచ్చి న బైక్ ను ఎన్ని రోజులకు తీసుకోవాలనుకుంటున్నారో ముందుగా చెప్పాలి. 24 గంటల సమయం కంటే తక్కువకు బైక్ ను అద్దెకు ఇవ్వరు. వాహనం తీసుకున్న సమయం నుంచి తిరిగి ఇచ్చే సమయంలో ఒక గంట మినహాయింపు ఇస్తారు. సకాలంలో బైక్ తిరిగి ఇవ్వకపోతే రెండో రోజు కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలు అద్దెకు ఇవ్వడానికి కొన్ని సంస్థలు రూ.5వేలు కనీస డిపాజిట్ తీసుకుంటున్నాయి. బైక్ తో పాటు హెల్మెట్ కూడా నిర్వాహకులే సమకూరుస్తారు. రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ముందుగా డిపాజిట్ చేసిన మొత్తం నుంచి మినహాయించుకుని మిగి లిన నగదును తిరిగి ఇస్తారు. బైక్ తిరిగి అప్పగించే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి పరిశీలిస్తారు.

రోజుకు ఎంత చెల్లించాలి..

100 సీసీ వాహనం అద్దెకు కావాలంటే రోజుకు రూ.350 చెల్లించాలి. రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైకులకు రోజుకు రూ.999, ఐదు రోజులు తీసుకుంటే రోజుకు రూ.899, పది రోజులు తీసుకుంటే రోజుకు రూ.799, ఆపై రోజులకు తీసుకుంటే రోజుకు రూ.699 ప్రతీ రోజుకు చెల్లించాల్సి ఉంటుంది. బజాజ్ 220 సీసీ బైక్ కు రోజుకు రూ.799, ఐదు రోజులకు తీసుకుంటే రోజుకు రూ.699, పది రోజులకు తీసుకుంటే రోజుకు రూ.599, పదిహేను రోజులకు తీసుకుంటే రోజుకు రూ.499 అద్దె వసూలు చేస్తున్నాయి . కొన్ని సంస్థలు వసూలు చేసే రేట్లలో కొంచెం ఎక్కువగా కూడా అద్దె తీసుకుంటున్నాయి.

రోజుకు 150 కిలో మీటర్లు..

బైక్ అద్ధెకు తీసుకున్న వారు రోజులో గరిష్ఠంగా 150 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వారం రోజులకు 800 కిలోమీటర్లు, 15 రోజులకు 1400 కిలో మీటర్లు, నెలకు 200 కిలో మీటర్ల వరకు తిరగవచ్చు. అంతకు మించి తిరిగితే కిలోమీటర్ కు అదనంగా వసూలు చేస్తా రు. కొన్ని సంస్థలు గంటల వారీగా కూడా బైకులను అద్దెకు ఇస్తున్నాయి.

అద్దెకు ఇస్తున్న సంస్థలు..

ఓఎన్ఎన్ బైక్స్ నాగోల్, టోలీచౌకీ, మహేశ్​మోటార్స్ సికింద్రాబాద్, బైక్ సన్ హెయిర్ ఏఎస్ రావు నగర్, బైక్ ఫర్ రెంట్ టెలీ కాం నగర్ గచ్చిబౌలి , బైక్ రెంటల్స్ నిజాంపేట్ రోడ్ కూకట్ పల్లి , పీఎస్ బ్రదర్స్ బైక్ జోన్ పంజాగుట్ట, సబ్ రెంట్ కరో డాట్ కాం హైటెక్ సిటీ , బైక్స్ ఫర్ రెంట్ గచ్చిబౌలి వంటి ఎన్నో సంస్థలు నగరంలో ఉన్నాయి.

Advertisement

Next Story