ఒక్కోచోట ఒక్కో మాట.. ‘దళితబంధు’ అమలు ఎలా?

by Anukaran |   ( Updated:2023-12-16 17:13:30.0  )
Dalit Bandhu scheme, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు రెండు నెలలుగా ‘దళితబంధు‘పై కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో, అఖిలపక్ష నేతలతో, దళిత ప్రజా ప్రజాప్రతినిధులతో, హుజూరాబాద్ నియోజకవర్గంలోని 412 దళిత కుటుంబాల సభ్యులతో సమావేశమై సమీక్ష చేశారు. ఇది ఒక పథకం కాదని, ఉద్యమం అని, దళితులకు ఆర్థికంగా సాధికారత కల్పించడానికి, సామాజికంగా ఎదుర్కొంటున్న వివక్షను పారదోలడానికి చేపట్టినదంటూ వ్యాఖ్యానించారు. ఆ పథకం ఎలా అమలవుతుందో, దానికిందకు వచ్చే లబ్ధిదారులెవరో ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఎంత ఖర్చవుతుందో కూడా పలు రకాలుగా లెక్కలు చెప్పారు. ముఖ్యమంత్రి ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా చెప్తే, మంత్రి హరీశ్‌రావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మరో రకంగా చెప్పారు. అయినా ఇప్పటికీ ఆ పథకం అమలుపై అనేక సందేహాలు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దళిత కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా వర్తిస్తుందని, అందరూ లబ్ధిదారులేనని హుజూరాబాద్ వేదికగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అమలవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హుజూరాబాద్‌లో ఉన్న మొత్తం 20,929 దళిత కుటుంబాలతో పాటు కొత్తగా నమోదైన దాదాపు వెయ్యి కుటుంబాలకు కూడా అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తంగా అన్ని దళిత కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ మంజూరు చేసింది మాత్రం రూ. 500 కోట్లే. ఇంకా అదనంగా రూ. 1600 కోట్ల మేర మంజూరు కావాల్సి ఉన్నది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ఎన్ని సంవత్సరాలు అమలవుతుంది, ఎప్పటి వరకు పూర్తి చేయాలన్నది టార్గెట్, ఏటా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఎలా.. ఇలాంటి అంశాలపైనా స్పష్టత రావాల్సి ఉన్నది.

ఇప్పటివరకూ రకరకాలుగా చెప్పిన కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా ఇచ్చిందే ఫైనల్ అవుతుందనే భావనలో ఉన్నారు. కానీ ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయి. పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోట నుంచి సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంలో హుజూరాబాద్‌లో మాత్రమే సంపూర్ణంగా అమలవుతుందని, మిగిలిన నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలవుతుందన్నారు. కానీ 24 గంటల తర్వాత హుజూరాబాద్ వేదికగా మాత్రం రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం కింద సాయం అందుతుందని పేర్కొన్నారు.

కడు పేదరికంలో ఉన్నవారికి మొదట ఇవ్వడాన్ని ప్రాధాన్యతగా భావించి చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు అందుతుందని సీఎం ప్రకటించినా పేదరికాన్ని నిర్ధారించడానికి సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలే ప్రామాణికంగా ఉంటాయా లేక ఇప్పుడు అన్ని గ్రామాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులతో జరుగుతున్న సర్వే వివరాలు కీలకమవుతాయా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. మరోవైపు రైతుబంధు తరహాలోనే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వంద శాతం సబ్సిడీతో జమ అవుతాయని పేర్కొన్నా, వాసాలమర్రి గ్రామంలో మాత్రం మొత్తం 76 కుటుంబాలకు మంజూరైన రూ. 7.60 కోట్లు మాత్రం కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. లబ్ధిదారులైన దళితులకు ఈ పది లక్షల పంపిణీపై మరింత క్లారిటీ రావాల్సి ఉన్నది.

జూన్ 27, ప్రగతి భవన్, అఖిలపక్ష సమావేశం

“మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద కుటుంబాల చొప్పున రాష్ట్రం మొత్తం మీద 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు సాయం అందుతుంది. బాటమ్ లైన్‌లో ఉన్న కడు పేద దళిత కుటుంబానికి నేరుగా అందజేయాలని అఖిలపక్షం నిర్ణయించింది“.

జూలై 18, ప్రగతి భవన్ సమీక్షలో

“సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ఆధారంగానే దళితబంధు అమలవుతుంది. నిబంధనల ప్రకారం అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళితబంధు పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో వర్తింపజేస్తారు. రైతుబంధు తరహాలో నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని దళితబంధు పథకం ద్వారా అందజేస్తాం’’.

జూలై 26, ప్రగతి భవన్, హుజూరాబాద్ దళితులతో భోజనం

“తెలంగాణ దళితబంధు కేవలం ఒక కార్యక్రమమే కాదు. ఇదొక ఉద్యమం. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్తు తెలంగాణ విజయం ఆధారపడి ఉంటది. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలి’’

ఆగస్టు 4, వాసాలమర్రి గ్రామం

“దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సాయం అందించి కుటుంబాలు నిలదొక్కుకునేలా చూస్తాం. దళితబంధు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలి. ఈ గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉన్నట్లు సర్పంచ్ లెక్క చెప్పారు. అందరికీ తలా రూ. 10 లక్షల చొప్పున ఒక్కసారే మంజూరు చేస్తున్నా. మరుసటి రోజు 11 గంటలకల్లా మీ అకౌంట్లలో పడిపోతాయి.’’

గోల్కొండ కోట, పంద్రాగస్టు ప్రసంగంలో

ఈ సంవత్సరం బడ్జెట్‌లోనే ప్రభుత్వం దళితబంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ పథకాన్ని మన రాష్ట్రంలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా అమలుచేస్తుంది. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో పాక్షికంగా అమలుచేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed