- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం కేర్స్‌కు సీఎస్ఆర్.. సీఎం ఫండ్‌కు నో సర్!
న్యూఢిల్లీ: కొవిడ్ 19 పై పోరు కోసం కొత్తగా ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. పీఎం కేర్స్‌కు అందించే నిధులను కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద పరిగణించుకోవచ్చునని, సీఎం రిలీఫ్ ఫండ్‌కు మాత్రం ఇది వర్తించదని కేంద్రం శుక్రవారం కేంద్రం చేసిన ఒక ప్రకటన కలకలం రేపుతున్నది. ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్‌పై విపక్షాలు పలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి.
1948లో ఏర్పాటైన పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్) ఉండగా.. ప్రత్యేకంగా పీఎం కేర్స్ నిధి అవసరమేమొచ్చిందని ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు నిధులను పర్యవేక్షించడమూ భారమని విపక్షాలు సూచించాయి. ప్రధాని స్వయానా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందజేయాలని కోరడంతో.. దానికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అయితే, ఈ విరాళాల వివరాలను అధికారికంగా అందించే ఒక్క వెబ్‌సైట్‌కూడా ఇప్పటికీ లేకపోవడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. అదీగాక, పీఎం కేర్స్(ప్రైమ్ మినిస్టర్స్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్)ను ప్రధాని మోడీ వ్యక్తిగత గుర్తింపు కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే పీఎం కేర్స్‌ను నిలిపేయాలని, విరాళాల సేకరణకు పీఎంఎన్ఆర్ఎఫ్(పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారికోసం ఉద్దేశించిన పీఎంఎన్ఆర్ఎఫ్ తర్వాత.. అల్లర్లు, ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాల బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్నది)నే వినియోగించుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.
కార్పొరేట్ దాతృత్వం పీఎం కేర్స్‌కేనా?
ఈ ఆరోపణలన్నీ ఒక్క ఎత్తు అయితే.. శుక్రవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) చేసిన ఓ ప్రకటన ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. సుమారు రెండు వారాల క్రితం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చే విరాళాలను సీఎస్ఆర్‌గా ప్రకటించుకోవచ్చునని ఎంసీఏ శుక్రవారం రాత్రి ప్రకటన చేసింది. కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ లేదా స్టేట్ రిలీఫ్ ఫండ్ ఫర్ కొవిడ్ 19లకు అందజేసే నిధులకు ఈ అవకాశం లేదని తెలిపింది. కంపేనీస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 7 కింద సీఎం రిలీఫ్ ఫండ్‌ను పేర్కొనలేదు కాబట్టి.. వీటికి అందజేసే నిధులను కార్పొరేట్‌లు సీఎస్ఆర్ కింద చూపెట్టుకునే అవకాశం ఉండదని పేర్కొంది. ఒకవేళ రాష్ట్రాలకు విరాళాలు అందజేయాలనుకునే కార్పొరేట్ సంస్థలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అందించవచ్చునని, వాటిని సీఎస్ఆర్‌గా పరిగణించవచ్చునని వివరించింది.
ఈ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వాలు భగ్గుమంటున్నాయి. కొవిడ్ 19పై వాస్తవ పోరాటం చేస్తున్నది రాష్ట్రాలే. అటువంటి రాష్ట్రాలకు అందించే విరాళాలపై మోడీ కన్నేశారని ఆరోపణలు చేస్తున్నాయి. పీఎం కేర్‌కు కూడా సీఎస్ంఆర్ అవకాశముండగా.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎందుకు ఉండొద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది సమాఖ్య వ్యవస్థకు తూట్లుపొడవడమేనని, ఈ పక్షపాతాన్ని సహించేది లేదని అన్నారు. సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా విమర్శలు గుప్పించారు. సీఎస్ఆర్ సొమ్మునంత సొంత పేరు(ప్రధానమంత్రి నరేంద్రమోడీ) మీద పోగేసుకుంటున్నారని, రాష్ట్రాలకు అందనివ్వడం లేదని ఆరోపించారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు సీఎస్ఆర్ కింద విరాళాలు అందజేసే అవకాశాన్ని కార్పొరేట్లకు అవకాశమివ్వాలని మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సీఎస్ఆర్ వెసులుబాటు ఉంటే నిధులు భారీగా సమకూరుతాయి. పెద్ద పెద్ద కంపెనీలు సీఎస్ఆర్ కింద సంస్థ నికర ఆదాయంలో రెండు శాతం సామాజిక సమస్యల కోసం ఖర్చు పెట్టాలి. లేదా విరాళాలివ్వాలి. నికర ఆదాయం కనీసం ఐదు కోట్లు, లేదా వెయ్యి కోట్ల టర్నోవర్, 500 కోట్ల నెట్‌వర్త్ ఉన్న కంపెనీలకు సీఎస్ఆర్ వర్తిస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో సీఎస్ఆర్ కింద నిధులకు విరాళాలు అందతాయి.
పీఎం కేర్స్ ఫండ్ తొలిగించాలని సుప్రీంలో పిల్:
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌ను తొలగించాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌పై న్యాయమూర్తులు సీజేఐ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనాగోదర్‌ల త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించనుంది. ఎటువంటి ఆర్డినెన్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ లేకుండానే పీఎం కేర్స్ ఏర్పాటు ప్రకటన రావడం, ప్రధాని విరాళాలు అందజేయాలని సూచించడంపై సందేహాలతో ఈ పిల్‌ను దాఖలు చేసినట్టు లాయర్ ఎంఎల్ శర్మ తెలిపారు. పీఎం కేర్ నిధిపై నమ్మకాన్ని ఆర్టికల్ 267 ప్రకారం.. పార్లమెంటో లేదా శాసన సభనో కల్పించలేదని తెలిపారు. కాబట్టి పీఎం కేర్స్ నిధులన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు తరలించాలని, పీఎం కేర్స్ ఏర్పాటుపై సిట్ వేసి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు.
Tags: pm cares fund, donations, relief fund, states, corporate social responsibility, CSR