నాకు రాజకీయాలంటే అసహ్యం: డాక్టర్ సుధాకర్

by srinivas |
నాకు రాజకీయాలంటే అసహ్యం: డాక్టర్ సుధాకర్
X

దిశ ఏపీ బ్యూరో: నాకు రాజకీయాలంటే అసహ్యం.. ఉద్యోగమే ముఖ్యం అని, తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెను కలకలం రేపిన ఘటన అనంతరం విశాఖపట్టణం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న కారులోని ఏటీఎం కార్డు తీసుకునేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ, చంద్రబాబు, జగన్ అందరూ బాగానే పాలించారని అన్నారు. ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. సీఎం జగన్ గారు తనకు దేవుడన్న ఆయన, పేదల కోసం జగన్ మంచి పనులే చేస్తున్నారని, ఆయనను తిట్టాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. తాను మోదీని కూడా విమర్శించలేదని అన్నారు. వాళ్లను తిట్టేంత ధైర్యం లేదని అన్నారు.

తనపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్నారు. తాను సస్పెండ్ అయినప్పటి నుంచి తనకు దారుణమైన ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన చెప్పారు. ఒక దశలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డానని ఆయన వెల్లడించారు. సస్పెన్షన్ కారణంగా జీతం లేకపోవడం స్నేహితులు సాయం చేస్తే.. ఆ డబ్బులు తీసుకునేందుకు బ్యాంక్‌కు నక్కపల్లి వెళ్తుండగా తనను కొందరు వెంబడించారని ఆయన చెప్పారు. అందుకే తాను కారు ఆపానని అన్నారు. దీంతో తనపై దాడి జరిగిందని, కారులోని పది లక్షల రూపాయలు కూడా మాయమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తనను అరెస్టు చేశారని అన్నారు.

తనపై పిచ్చోడి ముద్ర వేసి, ఉద్యోగాన్ని తీయించాలనే కుట్ర చేశారని సుధాకర్ చెప్పారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన తప్పు అన్న ఆయన, ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకు తనను వాడుకున్నారని అన్నారు. తనకు గుండు గీసిందెవరో చెపితే మళ్లీ గొడవ అవుతుందని వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంపేస్తామని బెదిరిస్తే, ఇంట్లో వాళ్లంతా భయపడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు సేవ చేయాలనే వైద్య వృత్తిలో కొనసాగుతున్నా తాను, జీతం రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానని అన్నారు. రాజకీయ అవసరాల కోసం తనను ఎవరూ ఉపయోగించుకోలేదన్న ఆయన, ముఖ్యమంత్రి జగన్ తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరారు.

దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విచారణలో ఉన్న కేసును సీబీఐకి అప్పగించామని చెప్పారు. డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించిన ఫైల్, స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ మొత్తాన్ని సీబీఐకి అప్పగించామని తెలిపారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సుధాకర్‌కి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తున్నామని, అలాంటప్పుడు పోలీస్ స్టేషన్ ముందు మీడియా సమావేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులపై సుధాకర్ లేనిపోని నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సుధాకర్ తీరుపై సీబీఐకి ఫాక్స్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఆయన వెనుక ఉన్న వారెవరరో సీబీఐ ధృవీకరించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed