టెన్నిస్‌లో మరో ప్రొఫెషనల్ అసోసియేషన్

by Shyam |
Djokovic
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలోని ఏ క్రీడను తీసుకున్నా వారికంటూ ఒక సంస్థ ఉంటుంది. ఫుట్‌బాల్‌కి ఫిఫా, క్రికెట్‌కి ఐసీసీ, బ్యాడ్మింటన్‌కు బీడబ్ల్యూఎఫ్ వంటి సంస్థలు ఉన్నాయి. కానీ టెన్నిస్‌లో మాత్రం ఇలాంటి సంస్థ ఒకటి లేదు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అనే సంస్థ ఒకటి ఉన్నా.. దాని అధికారాలు నామమాత్రమే. ఇతర క్రీడలకు సంబంధించి టీమ్, వ్యక్తిగత ర్యాంకులు ఆ క్రీడా సంస్థలు అందిస్తుంటాయి. కానీ, టెన్నిస్‌లో మాత్రం టెన్నిస్ ప్లేయర్ల అసోసియేషన్స్ ఇస్తున్నాయి. పురుషుల ర్యాంకులు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల ర్యాంకులు ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) అందిస్తుంది. ఏటీపీ, డబ్ల్యూటీఏలు కేవలం ఆటగాళ్ల అసోసియేషన్ మాత్రమే. మొదట్లో ఏటీపీలోని క్రీడాకారులే టెన్నిస్ ఆడేవాళ్లు. కాగా, ఇందులో మహిళలు వివక్షకు గురవుతున్నారని.. ప్రైజ్ మనీలో కూడా తేడాలు ఉంటున్నాయని ఆరోపిస్తూ 50 ఏళ్ల క్రితం మహిళా టెన్నిస్ ప్లేయర్లు ప్రత్యేకంగా డబ్ల్యూటీఏను ఏర్పాటు చేశారు. ఈ మధ్య ఏటీపీ, డబ్ల్యూటీఏను విలీనం చేయాలని పలు చర్యలు జరుగుతుండగా.. ఏటీపీనే రెండుగా చీలిపోయే ప్రమాదం వచ్చింది. ఏటీపీతో విభేదిస్తూ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ నోవాక్ జకోవిచ్, కెనడా టెన్నిస్ ప్లేయర్ వాసెక్ పోస్పిసిల్ ప్రత్యేక టెన్నిస్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ (పీటీపీఏ) పేరుతో ఇప్పటికే వీళ్లు రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.

ఎందుకీ కొత్త అసోసియేషన్?

ప్రస్తుతం ఉన్న ఏటీపీలో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లతో పాటు అంపైర్లు, రిఫరీలు, ఇతర సంస్థలు సభ్యులుగా ఉన్నారు. ఈ అసోసియేషన్‌లో ఆటగాళ్లపై ఇతరుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నదని ఆరోపిస్తూ గత ఏడాది అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి నోవాక్ జకోవిచ్ బయటకు వచ్చేశాడు. కెనడాకు చెందిన వాసెక్ పోస్పిసిల్‌తో కలసి పీటీపీఏను స్థాపిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ అసోసియేషన్‌లో కేవలం ఆటగాళ్లు మాత్రమే ఉంటారని.. ఇది ఏటీపీకి వ్యతిరేకంగా స్థాపించింది కాదంటూ జకోవిచ్ వెల్లడించారు. ఏపీటీ ర్యాంకింగ్స్‌లోని టాప్ 500 మంది సింగిల్, టాప్ 200 డబుల్స్ ప్లేయర్స్‌ను పీటీపీఏలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అయితే జకోవిచ్ నిర్ణయాన్ని రోజర్ ఫెదరర్, రాఫెల్ నదాల్ వ్యతిరేకించారు. తాము ఏటీపీలోనే కొనసాగుతామని ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఏటీపీ, పీటీపీఏ మధ్య మాటల యద్దం జరుగుతూనే ఉన్నది. ఏటీపీలో ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా కొత్త అసోసియేషన్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, గత వారం జరిగిన ఒక సమావేశంలో ఏటీపీ చైర్మన్ ఆండ్రియా గాడెన్జీ, పీటీపీఏ సహ అధ్యక్షుడు వాసెక్ పోస్పిసిల్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే తాజాగా జరుగుతున్న మియామీ ఓపెన్‌లో వాసెక్ పోస్పిసిల్ మెన్స్ సింగిల్స్ ఆడుతున్నాడు. అతడు ఆడే మ్యాచ్‌కు ఆండ్రియా చైర్ అంపైర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో వాళ్లిద్దరి మధ్య మరోసారి మాటల యుద్దం నడిచింది.

ఏటీపీ మౌనం..

మియామీ ఓపెన్‌లో ఒక సెట్ ముగిసిన తర్వాత చైర్ అంపర్ ఆండ్రియాను ఉద్దేశించి వాసెక్ పోస్పోసిల్‌తో గొడవకు దిగాడు. బంతులను కోర్డు అవతలకు కొట్టడమే కాకుండా రెండు రాకెట్లను కూడా విరగ్గొట్టాడు. చైర్ అంపైర్ వద్దకు వచ్చి.. ‘ఆటగాళ్లు అందరినీ ఏకం చేస్తున్నానని నాపై మీటింగ్స్‌లో గట్టిగా అరుస్తున్నావు. నన్ను ఏం చేద్దామని అనుకుంటున్నావ్.. నేను మీ మొత్తం ఆర్గనైజేషన్‌ మీద కేసు వేస్తాను’ అంటూ కేకలు వేశాడు. అయితే మ్యాచ్ అనంతరం తన మాటలకు వాసెక్ క్షమాపణలు చెప్పినా.. కొత్త అసోసియేషన్ ప్రక్రియ మాత్రం ఆగదని చెప్పాడు. దీనిపై ఏటీపీ ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కొత్త అసోసియేషన్‌ను గుర్తించే ప్రసక్తే లేదంటూ ఏటీపీ ఇప్పటికే చెప్పింది. ఫెదరర్, నాదల్ ఈ విషయంలో ఇప్పటికే తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇక గ్రాండ్‌స్లామ్స్ నిర్వాహకులు కూడా పీటీపీఏను గుర్తించకపోతే ఆ అసోసియేషన్‌లో ఉండే ఆటగాళ్లకు ఎంట్రీ కష్టం అవుతుంది. మరి ఈ కొత్త అసోసియేషన్ గొడవ ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed