ఉపాధి సొమ్ము మళ్లింపు

by Shyam |   ( Updated:2021-04-06 11:28:55.0  )
ఉపాధి సొమ్ము మళ్లింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి సొమ్మును డైవర్డ్​ చేశారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న రైతు వేదికలకు ఉపాధి నిధులు మళ్లించారు. ఉపాధి పనులకు వినియోగించాల్సిన సొమ్మును పక్కా ప్లాన్​తో దారి మళ్లించారు. దీంతో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రం వాటా మొత్తం గులాబీ నేతలకు వెళ్తోంది. దీంతో ఉపాధి నిధులతో పనులు చేసిన ప్రజాప్రతినిధులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కువ శాతం పనులు చేసిన సర్పంచ్​లు బిల్లులు రాక ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సర్పంచ్​లు తమ పదవులపై నిరాశ వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్​కు లేఖలు రాశారు. అయితే బిల్లుల పెండింగ్​లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే ఇబ్బందులు వస్తున్నాయని తేలింది.

రైతు వేదికలకు డైవర్షన్​

తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలను ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తోంది. కానీ వీటికి ఒక్క రూపాయి సొంత నిధులు ఇవ్వకుండా ఉపాధి నిధులనే మళ్లించింది. కేంద్రం విడుదల చేసే నిధులకు రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన మెటీరియల్​ కోటా నిధులన్నీ రైతు వేదికలకు ఇస్తోంది. దీంతో ఉపాధి కింద చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులన్నీ ఉపాధి నిధులతోనే జరుగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలతో పాటు సీసీ రోడ్లు, మట్టి రోడ్ల నిర్మాణ పనులన్నీ ఉపాధిలోనే చేస్తున్నారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టింది. క్లస్టర్ల వారీగా గ్రామాల్లో రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు వేదిక ఉండాలంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతు వేదికల నిర్మాణ ప్రయోజనాలను పక్కన పెడితే… ఇది అధికార పార్టీ నేతలకు మాత్రం కలిసి వచ్చింది. ఇక్కడే ప్రభుత్వం తన చేతికి ఖర్చు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఉపాధి నిధులను వాడుకునేందుకు వీలుగా అవకాశం కల్పించింది.
రాష్ర్ట వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2,596 రైతు వేదిక‌లు నిర్మించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతు వేదిక‌ల నిర్మాణాల కోసం రూ. 572.22 కోట్లను ఖర్చు చేశారు. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి కనిష్టంగా రూ. 22 లక్షల నుంచి గరిష్టంగా రూ. 34 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. దీనిలో కొంత వ్యవసాయ శాఖ నుంచి ఇస్తుండగా… ఎక్కువ శాతం ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్‌ కంపోనెట్‌ కింద నిధులు విడుదల చేస్తున్నారు.

ఉపాధి పనులకెట్లా..?

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీలో మెటీరియల్​ కాంపోనెట్​ కింద 33 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం 67 శాతం ఉపాధి నిధులు ఇస్తే మెటీరియల్​ కోటా కింద రాష్ట్రం 33 శాతం ఇవ్వాల్సి ఉంటోంది. దీంతోనే ఉపాధి హామీలో కూలీల సొమ్మును మినహాయించి మిగిలిన సొమ్మును మెటీరియల్​ కోసం వినియోగిస్తారు. తద్వారా పనులు ముందుకు సాగుతాయని భావిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్​ కంపోనెట్​ కింద ఈజీఎస్​కు రూ. 452.82 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో రూ. 135.59 కోట్లు, మార్చి 23న రూ. 312 కోట్లు, అంతకు ముందు రూ. 166 కోట్లు విడుదల చేశారు. అయితే మార్చిలో రైతు వేదికల బిల్లులు చెల్లించాల్సి ఉండగా… హడావుడిగా రూ. 312 కోట్లను మెటీరియల్​ కోటా కింద విడుదల చేసి రైతు వేదికలకు సంబంధించిన పాత బిల్లులను చెల్లించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గులాబీ నేతల కోసం..!

కానీ ఇక్కడే అసలు సమస్య ఉత్ఫన్నమైంది. ఉపాధి హామీలో పనులన్నీ పక్కన పెట్టి మొత్తం నిధులన్నీ రైతు వేదికలకే కేటాయించారు. ఈ పనులు తప్ప మరే పనులకు రూపాయి ఇవ్వలేదు. కానీ అంతకు ముందే గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గం తీర్మానాలతో రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, సీసీ, మట్టి రోడ్ల పనులు, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు, ప్రకృతి వనాల కోసం తీర్మానాలు చేసి పనులు ప్రారంభించారు. కూలీలతో చేయించాల్సిన పనులతో పాటుగా మిషనరీతో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేశారు. వీటికి సంబంధించిన బిల్లులన్నీ ఎంబీలు చేసి సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం వీటన్నింటికీ బ్రేక్​ వేసింది. ఎందుకంటే ఈ పనులన్నీ అధికార పార్టీ నేతలకే అప్పగించారు. వారే కాంట్రాక్టర్లుగా పనులు చేస్తుండటంతో వారికి ఆర్ధిక కష్టాలు రాకుండా ప్రభుత్వం నిధులన్నీ డైవర్ట్​ చేసింది.

రూ. 800 కోట్ల బిల్లులు పెండింగ్​

ఉపాధి నిధులతో నిధులను దారి మళ్లించిన ప్రభుత్వం… మిగిలిన పనులకు రూపాయి ఇవ్వలేదు. ఫలితంగా పంచాయతీ పాలకవర్గాలు తీర్మానం చేసి పూర్తి చేసిన పనులకు బిల్లులు పేరుకుపోయాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు దాదాపు రూ. 800 కోట్లు పెండింగ్​ పెట్టారు. ముందుగా రైతు వేదికలకు మాత్రమే బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో… ట్రెజరీల్లో ఇవన్నీ ఆగిపయాయి. అప్పులు తెచ్చి పనులు చేసిన పంచాయతీ పాలకవర్గాలు ఎంత మొత్తుకున్నా రూపాయి ఇవ్వడం లేదు. ఉపాధి కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం డైవర్ట్​ చేసి గులాబీ నేతలకు దాచి పెట్టినట్లైంది.

Advertisement

Next Story

Most Viewed