టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి..!

by Shyam |   ( Updated:2020-11-04 11:55:10.0  )
టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి..!
X

దిశ, కుత్బుల్లాపూర్: గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. నాయకులు టికెట్లు తమకంటే తమకు కావాలని నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది నాయకులు టికెట్ తమకే వస్తుందనే చోటామోటా నాయకులను వెంటేసుకోని తిరుగుతూ పరోక్షంగా ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇక సిట్టింగ్ లలో కొంతమందిని పక్కకు పెడ్తారనే ప్రచారంతో ఆశావహులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అయోమయం నెలకొన్నది.

టికెట్.. నాకంటే నాకే..?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో పలు రాజకీయ పార్టీల నాయకులు హడావుడి మొదలు పెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుని పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని కొన్ని డివిజన్లలో అధికార పార్టీ నేతల్లో సమన్వయం లోపించింది. ప్రధానంగా సుభాష్ నగర్ డివిజన్ లో ప్రస్తుతం టీఆర్ఎస్ కార్పొరేటర్ అయినప్పటికీ అతడిని తప్పిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా కొందరు నేతలు టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో కార్పొరేటర్ గా మరో డివిజన్ లో పోటీ చేసి ఓడిన నాయకుడు హంగు ఆర్భాటాలతో రెండు రోజుల ముందే ప్రచారం ప్రారంభించారు. ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ తోనే ఉంటున్న ఓ యువ నాయకుడు తనకే టికెట్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాడు. గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇస్తామని ఓ నియోజకవర్గ స్థాయి నేత హామీనిచ్చినట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ఒకరిపై మరొకరు ఫిర్యాదులు

గాజులరామారం సర్కిల్ లోని ఓ డివిజన్ కార్పొరేటర్ కు టికెట్ ఇస్తే తాము పని చేయమని ద్వితీయ శ్రేణి నేతలంతా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగతా డివిజన్లలోని ఓ కార్పొరేటర్ ప్రజల్లో అందుబాటులో ఉండడం లేదని, ఇతరులకు టికెట్ కేటాయిస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ లోని మరో రెండు డివిజన్ ల కార్పొరేటర్లు అవకతవకలకు పాల్పడ్డారని, ఈ సారి వారికి కాకుండా కొత్త వారిని బరిలో నిలిపేందుకు అధినాయకత్వం గెలుపు గుర్రాల కోసం వెతకడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎవరి తరపున ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలో తెలియిక పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోమయంలో పడ్డారు.

ఇతరులకు ప్లస్..

అధికార పార్టీ నేతలు ఇలా తన్నుకు తిరుగుతుంటే ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశముంది. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు వారికి అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. తమ పార్టీల అభ్యర్థులు వీరేనని ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ నేతల కొట్లాడుకుంటూ ఇతర పార్టీ నాయకులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed