- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ బోధన.. బిల్లులతో వేదన
దిశ ప్రతినిధి, మేడ్చల్: డిజిటల్ బోధన విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారింది. ఇప్పటికే కరోనా మహ్మమారి ఉపాధిపై దెబ్బకొట్టగా కనీస ఆర్థిక అవసరాలు తీరక జనాలు విలవిలలాడుతున్నారు. గోరుచుట్టపై రోకలిపోటులా.. ఆన్లైన్క్లాసులతో పిల్లల పేరెంట్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు, డెటాకార్డులు, టీవీల కొనుగోలు కోసం అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
వీటికోసం ఇంటర్నెట్ కనెక్షన్, డెటా కార్డులను వాడాల్సి వస్తున్నది. టీవీలను ఎక్కువ సేపు వాడితే కరెంట్ బిల్లులు వందలు దాటి రూ. వేలల్లో వస్తున్నట్లు అల్వాల్ కు చెందిన పార్వతమ్మ తనకొచ్చిన కరెంటు బిల్లును చూపిస్తూ నిట్టూర్చింది. ప్రస్తుతం40 శాతం పైగా విద్యార్థులు డిజిటల్ క్లాసులకు దూరంగానే ఉన్నట్లు ఓ ఉపాధ్యాయుడు తెలిపాడు.
డిజిటల్భారం
ప్రైవేటు పాఠశాలల్లో ఆపత్కాలంలోనూ ఫీజుల దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఆన్లైన్క్లాసుల పేరిట మొదటి నుంచే దండుకుంటున్నారు. పిల్లల భవిష్యత్ తమ చేతిలో ఉందన్న ధీమాతో తల్లిదండ్రులతో ఆడుకుంటున్నారు. ఆన్లైన్క్లాస్ లకు కనీసం ఫీజు తగ్గించడం లేదు. ఇటు పాఠశాల ఫీజులు చెల్లించడం ఒక వంతు అయితే.. అటు నెట్కోసం డాటా రీచార్జ్ చేయించడం అదనపు భారంగా మారుతోంది. ఈ రెండింటినీ పక్కనబెడితే.. నెలనెలా వచ్చే కరెంటు బిల్లులు పట్టపగలే చుక్కలు కనిపించేలా వస్తోంది.
గతంలో రూ.300, రూ.400 వచ్చే వారికి ఇప్పుడు రూ.1000 వరకూ వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్లాస్లు , వర్క్ షీట్లంటూ అన్ని ఆన్లైన్లో చేయాల్సి వస్తుండడంతో బిల్లు భారీగా వస్తోంది. ఇక, ఈ ఆన్లైన్క్లాస్లతో పిల్లల కన్నులపై ప్రభావం చూపిస్తుండడంతో ఐ (eye) హాస్పిటల్స్ కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కో విద్యార్థికి కనీసం రూ.15 నుంచి రూ.25 వేల వరకు భారం పడుతోంది. తమ పిల్లలు చదువులో వెనక బడి పోతారేమోననే ఉద్దేశంతో ఆన్ లైన్ క్లాసులకు అంగీకరించినా.. మొబైల్, టీవీల నిర్వహణ భారంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య సైతం విద్యార్థులను వేధిస్తున్నది.
సర్కార్లో 40 శాతం పిల్లలు దూరం..
మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలు 108 ఉండగా వీటిలో 42,174 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలు 22 ఉండగా, వీటిలో 8097 మంది చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు 375 ఉండగా, వీటిలో 37,299 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. ఇలా మొత్తం ప్రభుత్వ పాఠశాలలో 82వేల 570 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చదువుకు ఎవరు దూరం కాకుడదన్న ఉద్దేశంతో అధికారులు డిజిటల్ క్లాసులకు ఏర్పాట్లు చేశారు.
డిజిటల్ బోధనకు ముందు ఉపాధ్యాయులంతా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సెల్ ఫోన్లు, టీవీలు ఎంతమందికి ఉన్నాయో ఆరా తీశారు. అప్పుడే చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పరిస్థితులను సర్వే కోసం వచ్చిన వారికి వివరించినట్లు ఓ హెడ్మాస్టర్ చెప్పారు. మేమిచ్చిన సర్వే వల్లనే ఉన్నతాధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని సూచించారని, గ్రామ పంచాయతీల్లో ఆన్ లైన్ క్లాసులు వినేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలియజేశాడు.
అదేవిధంగా నగరంలో ఉపాధి లేక చాలా కుటుంబాలు ఊరి బాట పట్టాయని, డిజిటల్ క్లాసుల సమాచారం ఇద్దామంటే కొంత మంది సెల్ ఫోన్ నెంబర్లు కూడా పనిచేయడం లేదని, దీంతో వారు ఆన్ లైన్ క్లాసులు వింటున్నారో ..లేదో తెలియడం లేదని ఓ టీచర్ పేర్కొన్నారు.ఈ సమస్యల వల్ల దాదాపు 40 శాతం మంది విద్యార్థులకు డిజిటల్ తరగతులకు దూరంగా ఉన్నారని జిల్లా వైద్యాశాఖలో ఓ అధికారి తెలిపారు.