వైద్య సిబ్బందికి తిప్పలు! 

by Shyam |
వైద్య సిబ్బందికి తిప్పలు! 
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ, వాటి ఆచరణ క్షేత్రస్థాయిలో సిబ్బందితోనే సాధ్యం. అయితే, ఆదేశాలు పాటించకపోతే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే భయం సిబ్బందిని వెంటాడుతోంది. కరోనా వైరస్ కట్టడి విషయంలో అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ సందర్భంగా బయటకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసులకు అదేశాలు జారీ సింది. దీంతో పోలీసులు మాట్లాడటం కంటే ముందే లాఠీలకు పని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటు అధికారులకు చెప్పుకోలేక ఇటు బయటకు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు.

సౌకర్యాల కల్పనేది..?

విధుల్లోకి వెళ్లే వైద్య సిబ్బంది కచ్చితంగా తమ వెంట వ్యాక్సిన్లను తీసుకెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది పెద్ద, పెద్ద వ్యాక్సిన్ బాక్స్‌లను ఎలా తీసుకెళ్లాలని ఒత్తిడికి గురవుతున్నారు. పైగా జిల్లాలోని గ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో అసలు గ్రామాలకు ఎలా వెళ్లాలో వారికి తోచడం లేదనీ, సొంత వాహనాల్లో వెళ్దామనుకుంటే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. ఆటోలకు వెళ్దామంటే వారు రావడం లేదనీ, మహిళా సిబ్బంది దూర ప్రాంతాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారని చెబుతున్నారు. కావున ప్రభుత్వం చొరవ చూపి తమకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఊరి పొలిమేరల్లో ముళ్ల కంపలు పెడుతూ..తమ ఊరికి ఎవరూ రావొద్దంటూ చెబుతున్నారు. తమనూ గ్రామాల్లోకి తమను అనుమతించడం లేదనీ, తాము వైద్య సిబ్బంది అని చెప్పినా పరిస్థితి మారడం లేదని అంటున్నారు. ఊరి పొలిమేరల్లోనే ముళ్ల కంప వద్దే తమను ఆపేస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఆరోగ్య శాఖ నుంచి అందాల్సిన మాస్కులు, శానిటైజర్లు, చేతులకు గ్లౌస్‌లు తమకు అందలేదనీ, దాంతో వారు తమను అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ‘‘మీరే జాగ్రత్తలు తీసుకోకుండా మా గ్రామంలోకి వస్తే ఎలా అని అంటూ..మీతో లేని రోగాలు మాకు వస్తాయని’’ అంటున్నారనీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు తమను సిబ్బందిగా గుర్తించడం లేదని సిబ్బంది అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి వైద్య సిబ్బంది అయిన తమకు తగు సామగ్రి యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని కోరుతున్నారు.

tags : coronavirus (covid-19), health dept, mahabubnagar district, villages

Advertisement

Next Story

Most Viewed