Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా? నేటి నుంచి స్పర్శ దర్శనాలు నిలిపివేత

by D.Reddy |   ( Updated:2025-03-26 06:01:25.0  )
Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా? నేటి నుంచి స్పర్శ దర్శనాలు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు (Devotees) పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి సందడిగా మారింది. ఇక ఈనెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరుగున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నేటి (మార్చి 26) నుంచి స్వామి వారి స్పర్శ దర్శనాలను తాత్కలికంగా నిలిపివేసి.. గురువారం నుంచి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నారు.

ఉగాది ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. టోల్‌గేట్‌ వద్ద బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్దనున్న బాలగణేశవనం, పాతాళగంగ మార్గంలో శివదీక్షా శిబిరాలు, ఆలయ పురష్కరిణి వద్ద పర్వతవనం, దక్షిణమాడవీధిలోని రుద్రాక్షవనం, శివాజీవనం, మల్లమ్మకన్నీరు మొదలైనచోట్ల భక్తుల కోసం చలువ పందిళ్లు వేయించింది. కాలిబాట మార్గంలో వెంకటాపురం, నాగలూటి, దామర్లగుంట, పెద్దచెరువు, కైలాసద్వారం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. భక్తులకు ఆలయం సమీపంలో అన్నపూర్ణాభవనంలో అన్న ప్రసాద వితరణ చేయనుంది. ఉత్సవాల్లో భక్తులను అలరించేందుకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది.

Next Story