దసరా కల తీరేనా

by Sridhar Babu |
దసరా కల తీరేనా
X

ఉమ్మడి కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ దసరా నాటికల్లా పూర్తి చేస్తామని ప్రజాప్రతినిధులు ప్రతి సమావేశంలో చెప్తున్నారు. సర్కారు చేపట్టిన పనులన్నీ అప్పుడే పూర్తవుతాయని ప్రకటిస్తున్నారు. టార్గెట్ దసరా అన్నట్లుగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు.

దిశ ప్రతినిధి, కరీంనగర్
మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు దసరా నాటికల్లా పూర్తవుతాయని, దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాకపోవడం విశేషం. అలాగే కాళేశ్వరం జలాలను ఎగువ మానేరుకు తరలించేందుకు నిర్మిస్తున్న 9వ ప్యాకేజీ పనుల్లో జాప్యం జరిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షాలు 10, 11 ప్యాకేజీలకు కాళేశ్వరం నీరు వెళ్తున్నా 9వ ప్యాకేజీ అర్ధాంతరంగా నిలిచిపోవడంపై విమర్శలు గుప్పిం చాయి. దీంతో మంత్రి కేటీఆర్ స్వయం గా పర్యవేక్షించి 9వ ప్యాకేజీ పనులను దసరా నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కథలాపూర్ మండలంలోని సూరమ్మ చెరువు ప్రాజెక్టుకు దాదాపు నాలుగేళ్ల క్రితం అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును అదే సంవత్సరం దసరా నాటికల్లా పూర్తి చేస్తామని, ఆయకట్టుకు నీరందించే ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది.

ఐటీ టవర్, తీగల వంతెన

కరీంనగర్ జిల్లాలోనూ టార్గెట్ దసరా అన్నట్టుగానే సాగుతోంది. కరీంనగర్ లో ఐటీ టవర్ల ప్రారంభోత్సవాన్ని గత సంవత్సర దసరా నాటికల్లా ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ పనులు పూర్తి కాలేదు.. దీంతో వచ్చే దసరాకు పోస్ట్‌పోన్ చేశారు. తెలంగాణా రాష్ట్రానికే తలమానికంగా నిర్మిస్తున్న తీగల వంతెన కూడా ఈ ఏడాది దసరా నాటికి సిద్ధం అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. అయితే ఈ వంతెనకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరపాల్సి ఉంది. అయితే ఈ రోడ్డుతో పాటు వంతెన పూర్తి కావాల్సిన ఇతరాత్రా పనులు అక్టోబర్ 25 నాటికి పూర్తవుతాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే కరీంనగర్ నియోజకవర్గంలోని నిరుపేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా దసరా నాటికి సిద్ధం చేయాలని ఇటీవల మంత్రి గంగుల ఆదేశించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆయన డబుల్ ఇళ్ల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

పనులు పూర్తయ్యేనా?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి వద్ద నిర్మించిన పంప్ హౌజ్ లో మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తి అయింది. దీంతో రెండేళ్ల క్రితం దసరా రోజునే వెట్ రన్ చేస్తారని ప్రచారం చేసినా.. చేయలేదు. ఉమ్మడి జిల్లాలో చేపట్టే ప్రధానమైన పనుల్లో ఎక్కువగా వచ్చే దసరా నాటికల్లా పూర్తవుతాయని ప్రకటనలు చేస్తున్నారు. ఏటా దసరా పేరు చెప్పి.. తీరా చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఎక్కవయ్యాయి. ఈ సారి కూడా లక్ష్యం చేరుకునేలా పనులు జరగట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed