ఆ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

by Shyam |
ఆ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
X

దిశ, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు​కు ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు బాబ్లీ నుంచి ఎస్సారెస్సీలోకి చేరుతుంది. జూన్ 1 నుంచి స్వల్పంగా ప్రారంభమైన ఇన్​ఫ్లో ఆదివారం వరకు 11 వేల క్యూసెక్కులకు పెరిగింది. శనివారం ఇన్​ఫ్లో 9 వేల 230 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం ఉదయం ఆరు గంటలకు 11,102 క్యూసెక్కులకు చేరుకుంది. బాబ్లీ నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని ఏఈఈ మహేందర్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో నీటి సామర్థ్యం 1,072 అడుగులు ఉండగా 11,102 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో 33.550 టీఎంసీల నీరు ఉండగా.. గతేడాది ఇదే రోజు 5.458 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి అవసరాలకు రోజూ 152 క్యూసెక్కులు వదులుతున్నారు. 513 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్ట్ నుంచి అవుట్​ ఫ్లో 1,255 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

విష్ణుపురి గేట్లు ఎత్తివేత్త..

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు బాబ్లీ ప్రాజెక్ట్‌కు ఎగువన ఉన్న విష్ణుపురి గేట్లను తెరిచారు. అక్కడి నుంచి బాబ్లీకి వరద చేరడంతో అక్కడి నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చి వదులుతున్నారు. జూన్ 1న బాబ్లీ గేట్లను ఎత్తివేసిన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వరకు వరద చేరుకుంది. ఆ రోజు 992 క్యూసెక్కుల నీరు వచ్చింది. అప్పడు ప్రాజెక్ట్​లో 29 టీఎంసీల నీరు ఉండగా.. జూన్ 1 నుంచి 12 వరకు 4.69 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్‌పీలోకి వచ్చి చేరింది. నాలుగైదు రోజులుగా స్వల్పంగా వరద నీరు వస్తున్నా అత్యధిక వరద రావడం ఇది రెండోసారి. గతేడాది జూలై మూడోవారం వరకు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లోకి చుక్క నీరు కూడా రాలేదు. ఈ సారి ప్రాజెక్ట్ పరిహార ప్రాంతాల నుంచి వెయ్యి క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. విష్ణుపురి ప్రాజెక్ట్ సామర్థ్యం 2.8 టీఎంసీలు కావడం, ఇప్పటికే ప్రాజెక్టులో 90 శాతం నీరు ఉండడంతో వర్షాలు కురుస్తే కిందికి నీటిని వదులుతున్నారు. మూడు రోజుల క్రితం గేట్లను వదలడంతో ఎస్సారెస్పీకి వరద పెరుగుతుంది.

కాళేశ్వరం నీళ్లు చేరలే..

ఎగువ నుంచి ఎస్సారెస్పీకి చుక్కనీరు రాని సమయంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లతో శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులు చేపట్టింది. ప్రస్తుతం పనులు తుది దశకు చేరినా కాళేశ్వరం నుంచి నీళ్లు మాత్రం రాలేదు. కానీ కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేశారు. ఇప్పటికే వారబంధీగా మూడు తడులకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ భాగం తెలంగాణలో వర్షాలు లేకపోయినా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడం బాబ్లీ, విష్ణుపూరి ప్రాజేక్ట్ గేట్లను ఎత్తడంతో ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ భాగంలో చేపల వేటను నిషేధించారు. కాళేశ్వరం నీరు ప్రాజెక్ట్‌లోకి రాకున్నా ఈ సారి వానకాలం పంటలకు శ్రీరాం సాగర్ నీరు విడుదల చేసిన సరిపోతుందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed