లాక్ డౌన్ సమయంలో బెల్ట్ షాపుల దందా

by Sridhar Babu |
లాక్ డౌన్ సమయంలో బెల్ట్ షాపుల దందా
X

దిశ, అశ్వారావుపేట: ఒకవైపు రెండవ దశ కరోనా వ్యాప్తి చెంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు బెల్టు షాపుల ద్వారా మద్యం వ్యాపారం మాత్రం విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేసుకున్నప్పటికీ.. వ్యాపారులు మాత్రం బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని అమ్ముతూ ప్రజల సొమ్మును పోగు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ మినహాయింపు సమయంలో సిండికేట్ హోల్ సెల్ దుకాణాల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో మద్యం తెచ్చుకొని లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అధిక ధరలకు బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని విక్రయిస్తున్నారు. దమ్మపేట మండలంలో వందల సంఖ్యలో బెల్టుషాపులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. దమ్మపేట మండల కేంద్రంలో పర్మిషన్ కలిగిన మద్యం దుకాణాలు నాలుగే మాత్రమే ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం ఊరుకోక బెల్ట్ షాప్ చొప్పున ఉన్నాయి. కరోనా వ్యాప్తి బెల్టుషాపులు ద్వారా ఎక్కువ వస్తుందని ప్రజలు వాపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో రాత్రి ఆరు గంటల నుండి ఈ బెల్టు షాపుల వద్ద జనం ఎక్కువ సంఖ్యలో గుమ్ముగుడి పోతున్నారు. ఎవరైనా అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నప్పటికీ, వీధుల్లో నుంచి పోలీసులకు దొరకకుండా బెల్టుషాపుల దగ్గరికి చేరుకొని ప్రజలు మద్యాన్ని సేకరిస్తున్నారు.

అధిక ధరలకు విక్రయాలు

మద్యం ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. దీంతో పేదవాడి జేబుకు చిల్లు పడుతోంది. బెల్టు షాపుల్లో ప్రతి క్వార్టర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు, ఒక్కో బీరు సీసా మీద రూ. 30 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చీప్‌ లిక్కర్‌ విక్రయాలు బాగా పెరిగాయి.

లాక్ డౌన్ సమయంలో సైడ్ బిజినెస్ గా మారిపోయిన మద్యం వ్యాపారం

లాక్‌డౌన్‌ సమయంలో అక్రమంగా మద్యం అమ్ముతూ, సైడ్ బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు, మద్యం వ్యాపారాన్ని హైటెక్ రేంజ్లో సాగిస్తున్నారు. కొన్ని చోట్ల మద్యాన్ని డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని చోట్ల అయితే పేరుకే కిరాణా దుకాణం లాగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు.

లైసెన్స్ లేకుండా మద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తాం: ఎక్సైజ్ సిఐ నాగయ్య

లాక్ డౌన్ సమయంలో బెల్టు షాపుల ద్వారా అక్రమంగా మద్యం అమ్ముతున్న విషయాన్ని అశ్వారావుపేట సీఐ నాగయ్య దృష్టికి “దిశ” తీసుకువెళ్లగా, ఎవరైనా ఆక్రమంగా మద్యాన్ని అమ్మితే కేసులు నమోదు చేస్తామని, ఇప్పటికే దమ్మపేట మండలం లో ఆరుగురిపై కేసులు నమోదు చేసామని, ఎవరైనా అక్రమంగా మద్యం అమ్ముతుంటే తమ దృష్టికి తీసుకువస్తే దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story