రంగారెడ్డి ప్రజలకు ఇది శుభవార్త

by Anukaran |
రంగారెడ్డి ప్రజలకు ఇది శుభవార్త
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చని పంటలే కనిపిస్తున్నాయి. అధికారులు ఈసారి సాగు విస్తీర్ణంపై వేసిన అంచానాలు మొత్తం తలకిందు లయ్యాయి. సరైన టైంలో వర్షాలు, అనుకూల వాతావారణం ఉండటంతో 20శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొండలు, గుట్టలు కూడా చదును చేస్తూ సాగులోకి తెస్తున్నారు.

ఉమ్మడి రంగారెడ్డిలో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయాధికారుల అంచానాలకు మించి ఈ సారి సాగు రెట్టింపయింది. సకాలంలో వర్షాలు, అనుకూల వాతావరణం ఉండటంతో పట్టణాలు విడిచి పల్లెలు చేరుకున్న వారు కూడా ఈ సారి వ్యవసాయానికి మొగ్గుచూపుతున్నారు. కొండలు, గుట్టలను కూడా చదును చేయడంతో ఈ సారి సాగు అమాంతం పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 18లక్షల 69వేల 566 ఎకరాల భూమి ఉంది. ఇందులో సుమారుగా 6 లక్షల ఎకరాల భూమి సాగులో ఉండగా, 2 లక్షల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా లేవు. వికారాబాద్ జిల్లాలో సుమారుగా 10 లక్షల భూమి ఉంది. ఇందులో 8లక్షల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా లేవు. కానీ ఈ సారి వీటిలో చాలా వరకు భూములు సాగులోకి వచ్చాయి.

బీడు భూములు సాగులోకి..

రంగారెడ్డి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4,19,735 ఎకరాలు ఉంది. నియంత్రిత సాగు విధానం కారణంగా ఈసారి 3,99,561 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగు చేయాలని వ్యవసాయాధికారులు నిర్దేశించారు. వికారాబాద్ జిల్లాలో సాధారణ సాగు 4,76,283 ఎకరాలు కాగా 4,25,399 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. కానీ ఈ సారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 20 శాతం అదనంగా జిల్లాలో సాగు చేశారు. కాని ఈసారి రంగారెడ్డి జిల్లాలో 4,79,473 ఎకరాలు, వికారాబాద్‌లో 5,10,477 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 19 రకాల పంటలను పంటలు వేశారు. ఇవే కాక రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్ల, మంచాల, బండలేముర్, రంగాపూర్ తదితర గ్రామాల్లో కొండలు, గుట్టలున్నాయి. ఈ భూములన్నీ కొన్నేండ్లుగా బీడుగా ఉన్నాయి. వీటిని కూడా సారి సాగులోకి తీసుకొచ్చారు.

అనుకూల వాతావరణం..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులు ఎక్కవగా వరిపంటలు వేస్తుంటారు. వీటితో పాటు మొక్కజొన్న, జొన్న, కందులు, పత్తి, పెసర్లు, సజ్జలు కూడా పండిస్తుంటారు. ఈ సారి సకాలంలో వర్షాలు కురవడంతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది. బోర్లపై ఆధారపడుతున్న రైతులకు కావాల్సినంత నీరు ఉండటంతో సాగు రెట్టింపు చేశారు.

Advertisement

Next Story

Most Viewed