ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు భూసేకరణ

by Shyam |
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు భూసేకరణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: వ్యవసాయానికి అనుసంధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, అందులో పరిశ్రమలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనకు కొనసాగింపుగా వాటికోసం వివిధ జిల్లాల్లో జరిగిన భూసేకరణపై ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఏయే జిల్లాల్లో భూసేకరణ పూర్తయింది, ప్రస్తుతం ఏ స్టేజీలో ఉంది తదితర అంశాలతో పాటు భూముల గుర్తింపునకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ఈ అంశంతో పాటు రైతు వేదికల నిర్మాణం ఏయే మండల స్థాయిలో ఏ మేరకు జరుగుతూ ఉందో కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికలకు చాలా చోట్ల అక్కడి రైతులు, దాతలు భూముల్ని విరాళంగా ఇచ్చినందున వాటి నిర్మాణం ఎక్కడిదాకా వచ్చిందో, ఎప్పటికల్లా పూర్తవుతాయో తెలుసుకున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుచేయాలనుకుంటున్న ‘ఈ-ఆఫీస్’ ప్రగతి ఎక్కడివరకు వచ్చిందో, దాన్ని అమలుచేయడానికి ఆయా స్థాయిల్లోని సిబ్బందికి శిక్షణ కల్పించడంపైనా చర్చించారు. ప్రతీ పల్లెలో, నివాస ప్రాంతాల్లో ‘పల్లె ప్రకృతి వనాలు’ ఉండాలని గతంలో సీఎం సూచించినందున వాటి ఏర్పాటుపైనా కలెక్టర్లతో చర్చించారు. పట్టణ స్థానిక సంస్థల్లో సైతం ‘ట్రీ పార్కు’ల గురించి నొక్కిచెప్పారు. వివిధ పట్టణాల్లో ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకునేవారిని గుర్తించి రికార్డుల్లో నమోదుచేయడం, అవసరమైతే వారికి అనుమతి లేదా గుర్తింపు కార్డులు ఇచ్చే విధానంపైనా కలెక్టర్లతో చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed