robbers arrested : అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

by Sumithra |   ( Updated:2024-08-09 16:47:23.0  )
robbers arrested : అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..
X

దిశ, చౌటుప్పల్ : బంగారాన్ని సరఫరా చేసే వ్యక్తుల వద్ద నుండి కాపుకాసి వరుసగా చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని వ్యక్తిని చౌటుప్పల్ పోలీసులు శుక్రవారం వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అలీఖాన్, అస్లాం, సోనీ ఠాకూర్ (22) అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ముంబై నుండి ఇతర రాష్ట్రాలలోని షాపులకు బంగారాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తుల వివరాలు తెలుసుకొని వారిని అనుసరించి చోరీలకు పాల్పడుతున్నారు. ముంబై, పూణే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న ఏడి జ్యువెలర్స్ నిర్వాహకులు జూలై 26న తమ ఉద్యోగి పురోహిత్ భరత్ కుమార్ 2.1 కిలోల బంగారు ఆభరణాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడి జ్యువెలర్స్ షోరూమ్ కు తీసుకెళ్లేందుకు చునాబట్టి బస్ స్టాప్ నుండి బయలుదేరాడు.

ఆరెంజ్ ట్రావెల్ కు చెందిన బస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయలుదేరిన ఏడి జ్యువెలర్స్ ఉద్యోగి పురోహిత్ భరత్ కుమార్ జూలై 27 రాత్రి 9:30 నిమిషాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజి గూడెం జాతీయ రహదారి పక్కనే ఉన్నతాజా కిచెన్స్ వద్ద టీ తాగేందుకు బంగారు నగలతో తీసుకువచ్చిన బ్యాగును బస్సులోనే ఉంచి కిందకు దిగాడు. టీ తాగిన అనంతరం తిరిగి బస్సులోకి వచ్చిన పురోహిత్ భరత్ కుమార్ తన వెంట బంగారు నగలతో తెచ్చుకున్న బ్యాగును తనిఖీ చేసుకోగా అప్పటికే తన ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. తెల్లవారుజామున ఏడి జ్యువెలర్స్ సేల్స్ మేనేజర్ శ్రీ కునాల్ కోటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలో జాతీయ రహదారి వెంట ఉన్న ఆద్య హోటల్ వద్ద నిందితుల్లో ఒకరైన సోనీ ఠాకూర్ ను చౌటుప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు కిలో 832 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోటి 26 లక్షల 88 వేల రూపాయల విలువ చేసే 17 నెక్లెసులు, 35 నల్లపూసల గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తరచుగా ముంబై నుంచి ఇతర రాష్ట్రాలకు తమ షాపులకు బంగారాన్ని సరఫరా చేసే వారిని టార్గెట్ చేసి వారు మధ్యలో చాయి లేదా భోజనానికి దిగిన సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితుడు విచారణలో వెల్లడించారు. వీటిని చోరీ చేసిన అనంతరం ఫేక్ నెంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలలో తప్పించుకుంటున్నట్లు తెలిసింది. ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సులే వీరి ప్రధాన టార్గెట్ గా విచారణలో వెల్లడించారు. ముఠాలో మరో ఇద్దరు నిందితులు అలీ ఖాన్, అస్లాములను త్వరలోనే పట్టుకుంటామని రాచకొండ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ ఎం.రాజేష్ చంద్ర, అడిషనల్ డీసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్, భువనగిరి ఏసీపీలు పి.మధుసూదన్ రెడ్డి, రవి కిరణ్ రెడ్డి చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి, పోలీసులు మసియోద్దీన్, కే.యాదగిరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story