బెస్తగూడెంలో విషాదం.. పాము కాటుతో చిన్నారి మృతి

by Kalyani |
బెస్తగూడెంలో విషాదం.. పాము కాటుతో చిన్నారి మృతి
X

దిశ, ఏటూరునాగారం: పాము కాటేయడంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వెంక‌టాపురం మండ‌ల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. బెస్తగూడెం గ్రామానికి చెందిన‌ కాసాడ‌పు గిరి, ర‌జిత దంప‌తుల కూతురు తేజ‌స్విని(6), ఆదివారం ఉద‌యం 11గంట‌ల స‌మ‌యంలో వారి ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఆడుకుంటుండగా తేజ‌స్వినిని నాగుపాము కాటేసింది. విష‌యం తెలుసుకున్న చిన్నారి త‌ల్లిదండ్రులు హుటాహుటిన వెంక‌టాపురం మండ‌లంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా త‌ర‌లించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తేజ‌స్విని ప‌రీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు. క‌ళ్ల ముందు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగి తేజ‌స్వీని మ‌ర‌ణించడంతో త‌ల్లిదండ్రులు బోరున విల‌పించారు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

డాక్టర్ల నిర్లక్ష్యం వ‌ల్లనే పాప మృతి చెందింది..!

పాము కాటుకు గురైన వెంట‌నే తేజ‌స్వీనిని త‌ల్లిదండ్రులు వెంక‌టాపురం ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లగా స‌రైన వైద్యం అందించ‌కుండా డాక్లర్లు నిర్లక్ష్యం చేశార‌ని, స‌మ‌యానికి స‌రైన వైద్యం అందించి ఉంటే త‌మ కూతురు బతికి ఉండేదని ఆరోపిస్తూ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరయ్యారు. కాగా దీంతో ఆగ్రహించింన చిన్నారి త‌ల్లిదండ్రులు, బంధువులు జాతీయ రహ‌దారిపై ధర్నా నిర్వహించారు. విష‌యం తెలుసుకున్న వెంక‌టాపురం ఎస్ఐ కొప్పుల తిరుప‌తి రావు ధర్నా జ‌రుగుతున్న ప్రాంతానికి చేరుకొని ఆందోళ‌నకారుల‌కు న‌చ్చచెప్పి పాప మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి త‌ర‌లించారు.

Advertisement

Next Story

Most Viewed